బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయింపు

ABN , First Publish Date - 2021-04-17T05:26:06+05:30 IST

బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయింపు

బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయింపు
ఫోటోరైటప్‌ : వికారాబాద్‌-హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును ప్రారంభిస్తున్న ఎంపీ రంజిత్‌రెడ్డి

  •  చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి 
  • రెండు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు ప్రారంభం

వికారాబాద్‌ : సీఎం కేసీఆర్‌ ఆర్టీసీని ఆదుకునేందుకు బడ్జెట్‌లో రూ. 1500కోట్లు కేటాయించడం జరిగిందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్‌ డిపోలో హైదరాబాద్‌కు వెళ్లే రెండు ఎక్స్‌ప్రెస్‌ బస్సు సర్వీసులను స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రెండు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సామాన్య ప్రజలను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ సేవలు మరువలేనివని, ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకునే దిశగా కృషి చేస్తుందన్నారు. 50 రోజులు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసినా, వేతనాలు ఇచ్చారని ఆ ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల రమేష్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, డీవీఎం రమేష్‌, డీఎం దైవాదీనం, యూనియన్‌ చైర్మన్‌ జీవీకే రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగులు, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

5 నిమిషాలకే ఆగిపోయిన బస్సు

హైదరాబాద్‌కు బస్సు సర్సీసును ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులకు ఒక్కసారిగా షాక్‌ తగిలింది. పాత బస్సును ఎక్స్‌ప్రెస్‌గా మార్చి నడపాలని చూడటంతో బస్సు కొద్ది దూరం వెళ్లగానే శబ్దం చేస్తూ, పక్కకు ఒరిగినట్లు కావడంతో డ్రైవర్‌ బస్సును తిరిగి డిపోలోకి తీసుకెళ్లడం కన్పించింది. దీంతో పట్టణ ప్రజలు జిల్లా కేంద్రమైన వికారాబాద్‌కు కావాల్సింది పాత బస్సులు కాదని, ఎక్స్‌ప్రెస్‌ బోర్డులు పెట్టడం కాదు.. కొత్త బస్సులు తీసుకొచ్చి వాటిని ప్రజాప్రతినిధులు ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పాత బస్సులను హడావిడిగా ప్రారంభించే కన్నా కొత్త బస్సులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వికారాబాద్‌ జిల్లా వెనుకబాటులో స్థానిక ప్రజాప్రతినిధులనిర్లక్ష్యం మెండుగా ఉందని ఆరోపిస్తున్నారు.

Updated Date - 2021-04-17T05:26:06+05:30 IST