కారుణ్య మరణానికి అనుమతివ్వండి

ABN , First Publish Date - 2022-01-24T08:35:58+05:30 IST

తల్లిదండ్రులు లేని నన్ను మా అక్క బావ హింసిస్తున్నారు. కారుణ్య నియామకం ద్వారా వచ్చే ఉద్యోగం, డబ్బు కోసం వేధిస్తున్నారు.

కారుణ్య మరణానికి అనుమతివ్వండి

ఆస్తి, ‘ఉద్యోగం’ కోసం అక్క, బావ వేధిస్తున్నారు

సీఎం కేసీఆర్‌, మంత్రులకు బాలుడి లేఖ

నేలకొండపల్లి, జనవరి 23 : ‘తల్లిదండ్రులు లేని నన్ను మా అక్క బావ హింసిస్తున్నారు. కారుణ్య నియామకం ద్వారా వచ్చే ఉద్యోగం, డబ్బు కోసం వేధిస్తున్నారు. నాకు చనిపోయేందుకు అనుమతివ్వండి’ అంటూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన గోరింట్ల సాయిచంద్‌( 17) సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌, జగదీశ్‌రెడ్డి.. ఖమ్మం, సూర్యాపేట కలెక్టర్లకు విన్నవిస్తూ ఆదివారం లేఖ రాశారు. నేలకొండపల్లికి చెందిన గోరింట్ల లక్ష్మీనారాయణ, సుజాత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. లక్ష్మీనారాయణ టీచర్‌గా పనిచేస్తూ మృతి చెందడంతో ఆయన భార్య సుజాతకు స్కూల్‌ సబార్డినేట్‌గా ఉద్యోగం ఇచ్చారు. వారి కూతురు సాయి ప్రత్యూషను సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన గుండా గోపికి ఇచ్చి వివాహం చేశారు. తల్లి చనిపోవడంతో సాయిచంద్‌కు కష్టాలు మొదలయ్యాయి. సాయి చంద్‌ లేఖ ప్రకారం.. ‘అదనపు కట్నం కోసం మా బావ.. అక్కను ఇబ్బంది పెట్టేవాడు. నువ్వు తొందరగా చచ్చిపోతే నీ ఉద్యోగం నా భార్యకు ఇప్పించుకుంటానని మా అమ్మను వేధించేవాడు. గత ఏడాది మా అమ్మ అస్వస్థతకు గురైంది. చికిత్స కోసం మా బావ ఆమెను హుజూర్‌నగర్‌ తీసుకెళ్లాడు. రూ.4 లక్షలు ఖర్చవుతుందని అమ్మతో చెప్పి, డబ్బులు వడ్డీకి తెప్పించుకుని దగ్గర పెట్టుకున్నాడు. మా అమ్మను చంపి, కొవిడ్‌తో మృతి చెందిందని చెప్పాడు. ఉద్యోగం విషయంలో తాను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలని నన్ను బెదిరించాడు. లేదంటే నన్ను చంపేస్తా అని బెదిరించాడు. ఇన్ని సమస్యలతో బతుకు భారంగా అనిపిస్తోంది. ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేక కారుణ్య మరణాన్ని కోరుకుంటున్నాను. నా మరణానికి కారణమవుతున్న మా అక్కా బావతో పాటు, బావ తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలి’ అని సాయిచంద్‌ వేడుకుంటున్నాడు. 

Updated Date - 2022-01-24T08:35:58+05:30 IST