అదనపు రుణానికి ఓకే!

ABN , First Publish Date - 2020-10-14T08:09:38+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో రూ.5,051 కోట్ల మేరకు అదనంగా రుణం సేకరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం...

అదనపు రుణానికి ఓకే!

  • 5,051 కోట్ల సమీకరణకు ఏపీకి అనుమతి
  • 20 రాష్ట్రాలకు 68,825 కోట్లు.. కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడి


న్యూఢిల్లీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో రూ.5,051 కోట్ల మేరకు అదనంగా రుణం సేకరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దేశంలో 20 రాష్ర్టాలు మొత్తం రూ.68,825 కోట్ల వరకు అదనపు రుణాలను సమకూర్చుకునేందుకు అనుమతించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయం) మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. జీఎ్‌సటీ అమలు చేయడం వల్ల నెలకొన్న నష్టాలను భర్తీ చేయడానికి వీలుగా ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.  కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి(జీఎ్‌సడీపీ)లో 2 శాతం అదనపు రుణ సమీకరణ లక్ష్యంలో భాగంగా 0.50 శాతం అదనపు రుణాల సేకరణకు కేంద్రం తొలి విడతగా అనుమతించింది.


గత ఆగస్టు 27న జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీలో వచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో అదనపు రుణాల సేకరణకు అనుమతి పొందిన 20 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రూ.5,051 కోట్లు, అరుణాచల్‌-రూ.143 కోట్లు, అసోం-రూ.1,869 కోట్లు, బిహార్‌-రూ.3,231 కోట్లు, గోవా-రూ.446 కోట్లు, గుజరాత్‌-రూ.8,704 కోట్లు, హరియాణా-రూ.4,293 కోట్లు, హిమాచల్‌-రూ.877 కోట్లు, కర్ణాటక-రూ.9,018 కోట్లు, మధ్యప్రదేశ్‌- రూ.4,746 కోట్లు, మహారాష్ట్ర-రూ.15,394 కోట్లు, మణిపూర్‌-రూ.151 కోట్లు, మేఘాలయ-రూ.194 కోట్లు, మిజోరం-రూ.132 కోట్లు, నాగాలాండ్‌-రూ.157 కోట్లు, ఒడిశా-రూ.2,858 కోట్లు, సిక్కిం-రూ.156 కోట్లు, త్రిపుర-రూ.297 కోట్లు, ఉత్తరప్రదేశ్‌-రూ.9,703 కోట్లు, ఉత్తరాఖండ్‌ రూ.1,405 కోట్లు వంతున బహిరంగ మార్కెట్ల ద్వారా అదనంగా రుణాలు పొందవచ్చు. ఈ జాబితాలో తెలంగాణకు చోటు దక్కలేదు. మిగతా 8 రాష్ర్టాలు ఆప్షన్లను ఇంకా ఎంచుకునే ప్రక్రియలోనే ఉన్నాయి.

Updated Date - 2020-10-14T08:09:38+05:30 IST