మహేశ్‌బాబు ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేయనున్న బన్నీ

ABN , First Publish Date - 2020-02-02T01:52:08+05:30 IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘అల.. వైకుంఠపురములో..’

మహేశ్‌బాబు ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేయనున్న బన్నీ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘అల.. వైకుంఠపురములో..’ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తోంది. ఈ చిత్రం విడుదలై పది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ హౌస్‌ఫుల్ షోలతో, భారీ వసూళ్లతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండేళ్లు గ్యాప్ తీసుకున్నా.. తమ అభిమాన హీరో జీవితాంతం గుర్తుండిపోయే సినిమాను అందించారంటూ బన్నీ అభిమానులు గర్వంగా చెబుతున్నారు. అల.. వైకుంఠపురములో చిత్రం విడుదలైన ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 118 కోట్ల షేర్‌ను రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది. పది రోజులకు గాను ఈ మూవీ దాదాపు రూ. 150 కోట్ల షేర్ సాధించినట్టు సమాచారం. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు, రెస్ట్ ఆఫ్ ఇండియాతో పాటు అటు ఓవర్సీస్‌లోనూ ‘అల.. వైకుంఠపురములో..’ తన జోరు చూపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ ఏడాది అమెరికాలో తొలి రెండు మిలియన్లు, మూడు మిలియన్లు సాధించిన హీరోగా అల్లుఅర్జున్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.


తాజాగా ఈ సినిమా అమెరికాలో మూడు మిలియన్ డాలర్లు కొల్లగొట్టి అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో ఐదో స్థానాన్ని సంపాదించుకుంది. అమెరికాలో రెండో వారం కూడా ఈ చిత్రం లక్షల డాలర్లను కలెక్ట్ చేస్తుండటం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. అల్లుఅర్జున్ కెరీర్‌లో ఇప్పటివరకు 2 మిలియన్ డాలర్ల చిత్రమే లేదు. అల.. వైకుంఠపురములో చిత్రం ద్వారా అల్లుఅర్జున్ 2 మిలియన్ క్లబ్‌తో పాటు ఏకంగా 3 మిలియన్ క్లబ్‌లోనూ ప్రవేశించాడు. దర్శకుడు త్రివిక్రమ్‌కు సైతం అమెరికాలో ఇదే తొలి 3 మిలియన్ డాలర్ క్లబ్ చిత్రం అవ్వడం విశేషం. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'అరవింద సమేత', 'అజ్ఞాతవాసి', 'అఆ' చిత్రాలు అమెరికాలో 2 మిలియన్ క్లబ్‌లో ఉన్నాయి. 


ఇదిలా ఉండగా.. అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో తొలి నాలుగు స్థానాల్లో బాహుబలి పార్ట్ 2, బాహుబలి పార్ట్ 1, రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు ఉన్నాయి. బాహుబలి పార్ట్ 2 అమెరికాలో 20.77 మిలియన్ డాలర్లు(రూ. 147 కోట్ల 82 లక్షలు) సాధించి ఎవరికీ అందని ఎత్తులో ఉంది. ఆ తర్వాత బాహుబలి పార్ట్ 1 7.51 మిలియన్ డాలర్ల(రూ. 53 కోట్ల 45 లక్షలు)తో రెండో స్థానంలో నిలిచింది. 3.51 మిలియన్ డాలర్ల(రూ. 24 కోట్ల 98 లక్షలు)తో రంగస్థలం మూడో స్థానంలో, 3.42 మిలియన్ డాలర్ల(రూ. 24 కోట్ల 34 లక్షలు)తో భరత్ అనే నేను నాలుగో స్థానంలో ఉన్నాయి. 


కాగా.. ఓవర్సీస్‌లో మహేశ్‌బాబు ఆల్‌టైమ్ రికార్డు హిట్ అయిన ‘భరత్ అనే నేను’ సినిమాను అలవైకుంఠపురంలో ఈ వారంలోనే దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవర్సీస్‌లో భరత్ అనే నేను సినిమాకు 3.42 మిలియన్ డాలర్ల(రూ. 24 కోట్ల 34 లక్షలు) కలెక్షన్లు వచ్చాయి. మహేశ్ బాబు కెరీర్‌లోనే అమెరికాలో ఇదే హయ్యస్ట్ కలెక్షన్లను సాధించింది. ఈ వీకెండ్‌లోపు ఈ సినిమా రికార్డును అలవైకుంఠపురంలో దాటేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత టాప్-3 స్థానంలో ఉన్న రంగస్థలం (3.51 మిలియన్ డాలర్లు) రికార్డును కూడా బ్రేక్ చేస్తుందని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు అంచనా వేస్తున్నారు. 


మరోపక్క అల.. వైకుంఠపురములో చిత్రంతో పాటు ఇదే సంక్రాంతికి మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా విడుదలై భారీ సక్సెస్‌ను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు చిత్రం అల.. వైకుంఠపురములో మూవీతో పోటీ పడుతున్నప్పటికీ.. అమెరికాలో మాత్రం ఈ చిత్రం వెనుకబడిందనే చెప్పుకోవాలి. మహేష్ బాబు గత చిత్రాలైన శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలకు వచ్చిన కలెక్షన్లను కూడా సరిలేరు నీకెవ్వరు సాధించలేకపోయింది. సరిలేరు నీకెవ్వరు చిత్రం అమెరికాలో 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. అయితే రెండో వారంలో అల.. వైకుంఠపురములో చిత్రానికి వస్తున్న ఆదరణ మహేష్ బాబు చిత్రానికి కరువైంది. దీంతో ఈ చిత్రం లాంగ్ రన్‌లో 3 మిలియన్ క్లబ్‌లో చేరే అవకాశాలు లేనట్టే కనిపడుతోంది. 


Updated Date - 2020-02-02T01:52:08+05:30 IST