May 6 2021 @ 08:48AM

రెండు భాగాలుగా 'పుష్ప' ..!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప'. కొవిడ్ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా ఆపారు. పరిస్థితులు కాస్త చక్కబడ్డట్టు అనిపించగానే షూటింగ్‌ను పునః ప్రారంభిస్తారు. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని బన్ని, సుక్కు, నిర్మాతలు అనుకుంటున్నారట. ఈ ఏడాదిలో 'పుష్ప' పార్ట్‌ 1ను విడుదల చేసి వచ్చే ఏడాది రెండో భాగాన్ని విడుదల చేయాలనేది ప్రస్తుత ప్లాన్‌ అని టాక్‌. మరి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వార్తపై చిత్ర యూనిట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆగస్ట్‌ 13న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పుడు సినిమా విడుదల వెనక్కి వెళుతుందని అంటున్నారు. శేషాచల అడవుల్లో సాగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్‌గానే విడుదలైన 'పుష్ప' క్యారెక్టర్‌ రివీలింగ్‌ టీజర్‌ సోషల్‌ మీడియాలో దూసుకెళ్తోంది. ఈ టీజర్‌కు ఇప్పటికే అరవై మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ వచ్చాయి. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.