పాడేరు కేంద్రంగా అల్లూరి జిల్లా

ABN , First Publish Date - 2022-01-27T06:18:19+05:30 IST

పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు పేరిట కొత్త జిల్లాను ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గజిట్‌ విడుదల చేసింది.

పాడేరు కేంద్రంగా అల్లూరి జిల్లా

విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతంతో ఏర్పాటు

కలెక్టరేట్‌, ఇతర కార్యాలయాలకు సరిపడా భవనాలు 


పాడేరు, జనవరి 25: పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు పేరిట కొత్త జిల్లాను ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గజిట్‌ విడుదల చేసింది. పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటుచేయనున్న ఈ కొత్త జిల్లా విస్తీర్ణం సుమారు 12 వేల కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 22 మండలాలు. 2011 లెక్కల ప్రకారం 9.54 లక్షల మంది జనాభా ఉన్నారు. జిల్లా కేంద్రంగా ఎంపిక చేసిన పాడేరులో కలెక్టరేట్‌తోపాటు ఇతర శాఖలకు అవసరమైన భవనాలు చాలావరకు అందుబాటులో ఉన్నాయి.


పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన చాలాకాలం నుంచి ఉంది. అయితే భౌగోళికంగా అతి పెద్దదైన అరకులోయ పార్లమెంటు నియోజకవర్గంలో రెండు జిల్లాలను ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత అరకులోయ కేంద్రంగా పాడేరు, అరకులోయ, రంపచోడవరం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఒక జిల్లాను, మిగిలిన పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలతో మరో జిల్లాను ఏర్పాటు చేయనున్నారని ఊహాగానాలు వినిపించాయి. తరువాత పాడేరు, అరకులోయ, వి.మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పడుతుందని అన్నారు. తాజాగా పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాడేరు కేంద్రంగా ‘అల్లూరి సీతారామరాజు’ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

కొత్త జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలు, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, ఎటపాక రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఎటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం మండలాలు ఉంటాయి.


అందుబాటులో భవనాలు

పాడేరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటైతే ప్రస్తుతం ఐటీడీఏ కార్యాలయ భవనాల్లోనే కలెక్టరేట్‌ ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఐటీడీఏ, సబ్‌కలెక్టర్‌ కార్యాలయాలతోపాటు, గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌, రోడ్లు, భవనాల శాఖలకు చెందిన ఈఈ, డీఈఈ కార్యాలయాలు ఉన్నాయి. ఇంకా ఏడీఎంహెచ్‌వో, జిల్లా మలేరియా, ఏజెన్సీ డీఈవో కార్యాలయాలు కూడా వున్నాయి. అందువల్ల జిల్లాస్థాయి కార్యాలయాలకు వసతి పరంగా ఇబ్బంది వుండదని అంటున్నారు. జిల్లా ఎస్‌పీ కార్యాలయానికి పట్టు పరిశ్రమ ఏడీ కార్యాలయం భవనాలను గతంలో ప్రతిపాదించారు. 


అల్లూరి సీతారామరాజు

జిల్లా కేంద్రం: పాడేరు

విస్తీర్ణం: 12,251 చ.కి.మీ.

జనాభా: 9.54 లక్షలు (2011 గణాంకాలు)

రెవెన్యూ డివిజన్లు: 2 (పాడేరు, రంపచోడవరం)

మండలాలు: 22

అసెంబ్లీ నియోజకవర్గాలు: 3 (పాడేరు, అరకు, రంపచోడవరం)


ప్రజలకు చేరువగా పాలన

గొడ్డేటి మాధవి, అరకు ఎంపీ

విశాఖ నగరానికి దూరంగా వున్న ఏజెన్సీ ప్రాంతం ఒక జిల్లాగా ఏర్పాటుకానుండడం సంతోషం. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం నాలుగు జిల్లాలకు విస్తరించి ఉది. మొత్తం ఏడు సెగ్మెంట్‌లను కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటుచేయడం సాధ్యంకాదు. అందుకే అరకులోయ, పాడేరు, రంపచోడవరం కలిపి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటుచేస్తున్నారు. దీనివల్ల గిరిజనులకు పాలన చేరువవుతుంది. అధికారులంతా మాకు అందుబాటులో ఉంటారు. ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయి. అభివృద్ధికి అవకాశం లభిస్తుంది.


విశాఖ వచ్చే శ్రమ తప్పుతుంది

జల్లిపల్లి సుభద్ర, జడ్పీ చైర్‌పర్సన్‌

గిరిజన ప్రాంతాలతో ఒక జిల్లా ఏర్పాటు అనేది చారిత్రక అవసరం. గిరిజనుల మనోభావాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ముంచంగిపుట్టు నుంచి విశాఖపట్నం రావాలంటే కనీసం ఆరేడు గంటల సమయం పడుతుంది. అటువంటిది పాడేరు కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే గంట వ్యవధిలో అధికారులను కలుసుకునే అవకాశం ఉంటుంది. విశాఖ నుంచి విడిపోయి పాడేరు కేంద్రంగా కొత్త జిల్లా వస్తే గిరిజనులు విశాఖకు నాన్‌ లోకల్‌ అవుతారు. అయినా చదువుకునే యువతకు ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది.

Updated Date - 2022-01-27T06:18:19+05:30 IST