నేటి నుంచి ‘8’కి కూడా....

ABN , First Publish Date - 2020-11-23T06:17:11+05:30 IST

ఉన్నత పాఠశాలల్లో సోమవారం నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు కూడా హాజరుకానున్నారు.

నేటి నుంచి ‘8’కి కూడా....

ఉన్నత పాఠశాలల్లో మరో తరగతి ప్రారంభం

‘తొమ్మిది’ తరహాలోనే రోజు విడిచి రోజు తరగతులు

పెరగనున్న విద్యార్థులు... అప్రమత్తంగా ఉండాలని హెచ్‌ఎంలకు ఆదేశాలు

విద్యార్థులకు కరోనా పరీక్షలు... అందరికీ నెగెటివ్‌తో ఊరట

మధ్యాహ్న భోజనం వద్ద అదనపు కౌంటర్లు


విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉన్నత పాఠశాలల్లో సోమవారం నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు కూడా  హాజరుకానున్నారు. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులు రోజూ హాజరవుతుండగా, తొమ్మిదో తరగతి విద్యార్థులు రోజు విడిచి రోజు పాఠశాలకు వస్తున్నారు. సోమవారం నుంచి ఎనిమిది తరగతి విద్యార్థులకు కూడా రోజు విడిచి రోజు తరగతులకు హాజరు కావాల్సి వుంటుంది. కాగా ఎనిమిదో తరగతి పిల్లలు కూడా రానున్నందున పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగనున్నది. అందువల్ల విద్యార్థులు కరోనాబారిన పడకుండా చూడాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాల స్థాయిలో టీచర్లు అప్రమత్తంగా ఉండాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి ఆదేశించారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులందరికీ కరోనా పరీక్ష కోసం ప్రధానోపాధ్యాయులు ముందుగానే స్లాట్లు తీసుకున్నారు. పలుచోట్ల విద్యార్థులకు పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు విద్యార్థుల్లో ఎవరికీ కరోనా వైరస్‌ లక్షణాలు లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అంతమాత్రాన నిర్లక్ష్యం వద్దని ప్రధానోపాధ్యాయులకు డీఈవో స్పష్టం చేశారు.  ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యా బోధన ఉంటుంది. తరువాత మఽధ్యాహ్న భోజనం పెట్టి, విద్యార్థులను ఇళ్లకు పంపాలి.  భోజనం వడ్డించే ప్రదేశం వద్ద ఎక్కువ కౌంటర్లు ఏర్పాటుచేయాలని అధికారులు సూచించారు. ఆదివారం ఎంఈవో/ ప్రధానోపాధాయులతో డీఈవో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని ఆదేశించారు. పాఠశాలకు హాజరుకాని విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాలని, దీనికి సంబంధించి ముందుగా వర్క్‌షీట్స్‌ సిద్ధం చేసుకోవాలన్నారు.

Updated Date - 2020-11-23T06:17:11+05:30 IST