Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

  వీడియో కాన్ఫరెన్స్‌లో చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌కుమార్‌ 


మెదక్‌, నవంబర్‌ 27: యాసంగి సీజన్‌లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా కృషి చేయాలని రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ సోమే్‌షకుమార్‌ అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు, యాసంగి పంట ప్రణాళిక అంశాలపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి బాయిల్డ్‌ రైస్‌ను కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. యాసంగి సీజన్‌లో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేసే దిశగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. యాసంగి సీజన్‌లో తమ సొంత అవసరాలకు విత్తన కంపెనీలు, మిల్లర్లతో రైతులకు ఒప్పందం ఉంటే సొంత పూచికత్తుపై మాత్రమే వరి సాగుచేయాలని సీఎస్‌ సూచించారు. అనంతరం మెదక్‌ కలెక్టర్‌ హరీష్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. సీఎంఆర్‌ బైల్డ్‌ రైస్‌ డెలివరీకి అదనంగా రెండు గోదాములు అవసరమని కోరారు. వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపేలా రైతులను చైతన్య పరుస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మెదక్‌ అదనపు కలెక్టర్‌ రమేష్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌, ఆర్డీవో సాయిరామ్‌, జిల్లా వ్యవసాయాధికారి పరశురాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement
Advertisement