ప్రత్యామ్నాయ సాంస్కృతిక యోధుడు

ABN , First Publish Date - 2021-09-16T06:07:13+05:30 IST

పెరియార్‌గా ప్రసిద్ధి చెందిన ఇ. వి. రామసామి కులమతాలకి అతీతంగా ఉన్నత మానవ సమాజం కోసం జీవితాంతం పోరాడిన ధీరుడు. ఆత్మగౌరవ ఉద్యమ స్థాపకుడిగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా యుద్ధం చేసిన...

ప్రత్యామ్నాయ సాంస్కృతిక యోధుడు

పెరియార్‌గా ప్రసిద్ధి చెందిన ఇ. వి. రామసామి కులమతాలకి అతీతంగా ఉన్నత మానవ సమాజం కోసం జీవితాంతం పోరాడిన ధీరుడు. ఆత్మగౌరవ ఉద్యమ స్థాపకుడిగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా యుద్ధం చేసిన ధీరుడిగా, అణగారిన ప్రజల, మహిళల హక్కుల కోసం అవిరామంగా కృషి చేసిన సమానతశీలిగా ఆయన నిర్వహించిన పాత్రలు అనేకం. అనితర సాధ్యమైన రీతిలో ఆత్మగౌరవ ఉద్యమాన్ని నిర్మించి నడిపిన పెరియార్–దేవుడ్ని నిర్మూలించాలి, మతాన్ని నిర్మూలించాలి, కాంగ్రెస్‌ను నిర్మూలించాలి, గాంధేయవాదాన్ని నిర్మూలించాలి, బ్రాహ్మణిజాన్ని నిర్మూలించాలి అనే ఐదు అంశాలనూ ఉద్యమ ఉద్దేశాలుగా ప్రకటించి ప్రకంపనలు సృష్టించాడు. దేశమంతటా కాంగ్రెస్ జపం చేస్తున్న రోజుల్లో కాంగ్రెస్‌కు విరుద్ధంగా నిలిచి గాంధేయవాదం నుండి విముక్తి కోరాడు. రాజ్యాంగ శాసనం ప్రవేశపెట్టినపుడే రాజ్యాంగ ప్రతిని బహిరంగంగా కాల్చేసి, ‘ఈ దేశానికి కావాల్సింది బ్రాహ్మణిజం నుంచి స్వాతంత్ర్యం’ అంటూ గర్జించాడు. రాజ భాషగా చెలామణీ అవుతున్న హిందీని అవతలకి తోసిపారేసి ప్రాంతీయ భాషలే అధికారిక భాషలన్నాడు. స్వాతంత్ర్య ఉద్యమం ముసుగులో ఉన్న మతతత్వం దుమ్ముదులిపి ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్య విధానాన్ని నిజంగా కాపాడిన ఏకైక యోధుడు పెరియార్. రష్యా విప్లవం నుంచి స్ఫూర్తిపొందిన పెరియార్ భారతీయ కమ్యూనిస్టులనబడేవారి వైఖరి కారణంగా విసుగు చెందాడు. ఏకంగా ‘beware of Communists’ అని హెచ్చరించాడు. 


పెరియార్ ప్రత్యామ్నాయ ద్రావిడ సంస్కృతి నిర్మాణం కోసం జీవితం మొత్తాన్ని అంకితం చేసాడు. దక్షిణ భారత దేశంలో, ఆ మాటకొస్తే యావద్దేశంలోనే అత్యంత పటిష్ఠమైన హేతువాద దృక్పథంతో కూడిన లౌకిక ప్రజాస్వామ్య సాంస్కృతికోద్యమ సంస్థగా ‘ద్రావిడర్ కజగమ్’ను నిర్మించాడు. ఈ రోజు దక్షిణాది రాష్ట్రాలలో, ముఖ్యంగా తమిళనాట ఈ మాత్రమైనా మతాతీత లౌకికవాద దార్శనికత నిలిచి ఉందంటే, అందుకు పెరియార్ కార్యాచరణ కచ్చితంగా ఒక ప్రబల కారణం! డా. బి. ఆర్. అంబేడ్కర్, డా. రామ్ మనోహర్ లోహియా వంటి బుద్ధిజీవుల ఆలోచనలపై సానుకూల అభిప్రాయం కలిగిన పెరియార్, జీవితాంతం అణగారిన ప్రజల వైపు నిలబడి వారి హక్కుల కోసం నినదించి, స్త్రీ పురుష సమానత కోసం ధ్వజ మెత్తాడు. అర్థంలేని ఆచారాల మూసలో సంప్రదాయాల పేరిట చిక్కుకుని ఉన్న ఎందరో మహిళలకి చెర నుంచి విముక్తి కలిగించాడు. స్వతంత్ర ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడమే మానవ అస్తిత్వానికి తార్కాణమని యువతకి సందేశం ఇచ్చాడు. తీరికలేని సామాజిక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ కూడా అసంఖ్యాక రచనలు చేసి కండగల సాహిత్యాన్ని సుసంపన్నంగా ప్రచురించాడు. 


స్వాతంత్ర్య ఉద్యమానికి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా, సాంప్రదాయేతర సిద్ధాంత రూపశిల్పిగా, సుస్థిర నైతిక విలువలు కలిగిన రాజకీయ రంగాన్నీ, సుభిక్షమైన స్వపాలననీ, సుశిక్షితులైన వివేకవంత పౌరులనీ మలచడమే లక్ష్యంగా అవిశ్రాంతంగా పనిచేసి దేశవ్యాప్తంగా అనేకమందికి ఆచరణాత్మక స్ఫూర్తిని అందించిన పెరియార్ ఇ. వి. రామసామి మార్గంలో నేడు తెలుగు నేలపై వివిధ స్రవంతుల్లో పని చేస్తున్న అభ్యుదయ ప్రగతిశీల మానవవాద శక్తులన్నీ అడుగులు వేయాల్సిన సమయం ఇది. 

(నేడు పెరియార్ 142వ జయంతి)

గౌరవ్ సాంస్కృతిక కార్యకర్త, రామచంద్రాపురం

Updated Date - 2021-09-16T06:07:13+05:30 IST