లద్దాఖ్‌లో కఠిన వాతావరణం... ఆస్పత్రుల్లో చైనా సైనికులు..!

ABN , First Publish Date - 2020-09-19T17:43:28+05:30 IST

శీతా కాలం ఇంకా మొదలు కాకుండానే.. చైనాకు చలి దెబ్బల పడుతున్నాయి. ఓవైపు.. సముద్రమట్టానికి ఎంతో ఎత్తున ఉండే ప్రాంతం మరోవైపు.. పడిపోతున్న ఉష్ణోగ్రత.. వెరసి చైనాకు సైనికులకు కఠిన పరీక్షలు పెడుతున్నాయి. పాంగాంగ్ సరస్సు వద్ద వ్యూహాత్మక ప్రాముఖ్యం కలిగిన ఎత్తైన ప్రాంతాల్లో(ఫింగర్స్‌) కొన్నింటిపై పాగా వేసిన చైనా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది.

లద్దాఖ్‌లో కఠిన వాతావరణం... ఆస్పత్రుల్లో చైనా సైనికులు..!

న్యూఢిల్లీ: శీతా కాలం ఇంకా మొదలు కాకుండానే.. చైనాకు లద్దాఖ్‌లోని వాతావరణం చుక్కులు చూపిస్తోంది. ఓవైపు సముద్రమట్టానికి ఎంతో ఎత్తున ఉండే ప్రాంతం.. మరోవైపు క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రత.. వెరసి చైనాకు సైనికులకు కఠిన పరీక్షలు పెడుతున్నాయి. పాంగాంగ్ సరస్సు వద్ద వ్యూహాత్మక ప్రాముఖ్యం కలిగిన ఎత్తైన ప్రాంతాల్లో(ఫింగర్స్‌) కొన్నింటిపై పాగా వేసిన చైనా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది.


ఇప్పటికే ఫింగర్ 4 వద్ద కొందరు సైనికులు అనారోగ్యం పాలవడంతో  వారిని ఫింగర్‌ 6 వద్ద ఉన్న వైద్య శిబిరానికి తరలించినట్టు భారత వర్గాలు చెబుతున్నాయి. చైనా సైనికులను వైద్య సిబ్బంది చికిత్స కోసం ఫీల్డ్ ఆస్పత్రికి తరలిస్తుండటం భారత్ సైనికుల కంట పడిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వ్యాఖ్యానించాయి. 


పాంగాంగ్ సరస్సుకు సమీపంలో ఎత్తైన గుట్టలను ఫింగర్స్‌గా పిలుస్తున్న విషయం తెలిసిందే. వీటి గుండా ప్రయాణించే సరిహద్దు విషయంలో భారత, చైనాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. అంతే కాకుండా.. ఎత్తున ఉండే ఈ ఫింగర్స్‌పై పాగా వేస్తే.. ఆ ప్రాంతం మొత్తంపై నిఘా పెట్టేందుకు సులువవుతుంది. ఈ క్రమంలోనే  భారత్, చైనాలు ఒకరిపైఒకరు పైచేయి సాధించేందుకు ఫింగర్స్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. 


సముద్ర మట్టానికి దాదాపు 17 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతాలు.. వాతావరణం రీత్యా సైన్యానికి కఠిన సవాళ్లు విసురుతాయని సైన్యాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. రాబోయే వారాల్లో భారత, చైనా సైన్యం వాతావరణంతో పోరాడాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఇంత కంటే ఎత్తున ఉండే షియాచిన్ గ్లేషియర్ ప్రాంతంలోనూ భారత్ సైన్యం కాపలా కాస్తున్న విషయాన్ని భారత్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. 


అయితే చైనా వ్యూహాల గురించి పూర్తి అవగాహన ఉన్న భారత్.. లద్దాఖ్‌లో సుదీర్ఘ కాలం పాటు తన సైన్యాన్ని కొనసాగించేందుకు  సిద్ధమైంది. అక్కడి కఠిన వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఉపకరించే అక్లమెటైజేషన్ ప్రక్రియను భారత సైనికులు పూర్తి చేసుకున్నారు. అంతే కాకుండా.. రాబోయే శీతా కాలం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. సైన్యానికి అవసరమైన రవాణా సదుపాయాలు, వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. 


రాబోయే కాలంలో అక్కడ కాపుకాస్తున్న ఇరు దేశాల సైన్యాలూ ఎటువంటి కార్య కలాపాలకు దిగకుండా, ఎక్కుడున్న వారు అక్కడే కదలకుండా ఉండిపోవడమే మంచిదని మాజీ సైన్యానిధికారి ఎఫ్టెనెంట్ జనరల్ బీకే సింగ్ సూచించారు. ‘అక్కడి వాతావరణం ఇరు దేశాల సైన్యాలకు ఒకేరకమైన సవాళ్లను విసురుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-19T17:43:28+05:30 IST