ప్రియురాలి ప్రియుడి హత్య కేసులో ఫైనల్‌గా ఏం తేలిందంటే..

ABN , First Publish Date - 2020-12-15T11:51:01+05:30 IST

ప్రియురాలి ప్రియుడిని హతమార్చిన ఘటనలో

ప్రియురాలి ప్రియుడి హత్య కేసులో ఫైనల్‌గా ఏం తేలిందంటే..

హైదరాబాద్/అల్వాల్‌ : ప్రియురాలి ప్రియుడిని హతమార్చిన ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను సోమవారం అల్వాల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ గంగాధర్‌ వెల్లడించారు. హస్మత్‌పేట్‌ ప్రాంతానికి చెందిన కనకరాజు పదేళ్లుగా ఓ వివాహితతో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. వారికి ఒక బాబు కూడా జన్మించాడు. సదరు మహిళను కనకరాజు మచ్చబొల్లారంలోని అంజనాపురి కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంచాడు. ఆ ఇంటి ఎదురుగానే  ఆటో డ్రైవర్‌ శ్రీకాంత్‌రెడ్డి కూడా నివసిస్తున్నాడు. కాగా కనకరాజు ప్రియురాలితో శ్రీకాంత్‌రెడ్డికి కూడా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండుమూడు పర్యాయాలుగా సదరు మహిళ శ్రీకాంత్‌రెడ్డితో ఇల్లు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లింది. ఈ విషయం తెలిసిన కనకరాజు శ్రీకాంత్‌రెడ్డిని పలుమార్లు బెదిరించాడు.


అయినప్పటికీ అతని ప్రియురాలు, శ్రీకాంత్‌రెడ్డి ఇటీవల ఖమ్మం జిల్లాలోని పాల్వంచ ప్రాంతానికి మరోసారి పారిపోయారు. విషయం తెలుసుకున్న కనకరాజు, ప్రియురాలి సోదరుడు చంద్రశేఖర్‌ 40 రోజుల క్రితం వారిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. జవహర్‌నగర్‌లోని దమ్మాయిగూడలో కనకరాజుకు చెందిన అపార్టుమెంట్‌ పెంట్‌హౌజ్‌లో శ్రీకాంత్‌ను బంధించాడు. వారికి కాపలాగా ఆయన దగ్గర పని చేసే ప్రసాద్‌, రమణ మేస్ర్తీలను ఉంచాడు. శ్రీకాంత్‌రెడ్డిని చిత్ర హింసలకు గురి చేశాడు. అయినప్పటికీ శ్రీకాంత్‌రెడ్డి కనకరాజు ప్రియురాలితోనే ఉంటాని తేల్చి చెప్పాడు. దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నాడన్న కారణంగా శ్రీకాంత్‌రెడ్డిని ఈనెల 6న తాడుతో కాళ్లు, చేతులు వెనుకకు విరిచి కట్టి, మరో తాడుతో ఉరేసి హత్య చేశాడు. అనంతరం కనకరాజు స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో శ్రీకాంత్‌రెడ్డి మృతదేహాన్ని హస్మత్‌పేట్‌ శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. కనకారాజు శ్మశాన వాటిక నిర్వాహకుడు రాజే్‌షతో అప్పటికే మాట్లాడుకుని ఒక గొయ్యిని తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.


అయితే రెండు నెలలుగా శ్రీకాంత్‌రెడ్డి కనిపించడం లేదంటూ అతని సోదరుడు స్టీఫెన్‌రెడ్డి అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరుడు కనపించకపోవడానికి కనకరాజు, చంద్రశేఖర్‌లే కారణమని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరిపై నిఘా పెట్టారు. ఎస్‌వోటీ పోలీసుల సహాయంతో వారిని పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. హత్యలో భాగస్వాములైన ప్రధాన నిందితుడు కనకరాజు, చంద్రశేఖర్‌, ప్రసాద్‌, రమణ, శ్మశాన వాటిక నిర్వాహకుడు రాజే్‌షలపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రెండు తాడులు, ఆరు సెల్‌ఫోన్లు, కారును పోలీసులు సీజ్‌ చేశారు.


Updated Date - 2020-12-15T11:51:01+05:30 IST