మా నాన్నగారి ఉద్యోగం నాకు రాదా?

ABN , First Publish Date - 2020-03-10T06:43:45+05:30 IST

నేనొక పెంపుడు కూతురును. అయితే నన్ను పెంచుకున్న మా నాన్నగారు 2004లో గుండెపోటుతో చనిపోయారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. సమస్య ఏమిటంటే, ఆయన నన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నారే...

మా నాన్నగారి ఉద్యోగం నాకు రాదా?

నేనొక పెంపుడు కూతురును. అయితే నన్ను పెంచుకున్న మా నాన్నగారు 2004లో గుండెపోటుతో చనిపోయారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. సమస్య ఏమిటంటే, ఆయన నన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నారే గానీ, చట్టబద్ధంగా దత్తత తీసుకోలేదు. వారికి పిల్లలు లేరు. నా చదువు, పోషణ వారే చూశారు. మా నాన్నగారి సర్వీసు రికార్డుల్లో నా పేరు ఉంది. అయితే ఆయన చనిపోయిన తర్వాత ప్రభుత్వం, ఆ ఉద్యోగాన్ని మా అమ్మకే ఇచ్చింది. అప్పటికి నా వయస్సు ఏడేళ్లు. ఇకపోతే మా అమ్మ, మా నాన్న స్వార్జితమైన ఆస్తి మొత్తాన్ని మా పిన్ని కొడుకుల పేరిట రాసివ్వాలని చూస్తోంది. ఇప్పుడు నేను మేజర్‌ను కాబట్టి మా నాన్న ఉద్యోగం నాకు వచ్చే అవకాశం లేదా? ఆయన ఆస్తి నా పేరుకు మారే అవకాశం లేదా?

- డి.నీలిమ, గుంటూరు


ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ఉద్యోగంలో ఉండగానే చనిపోతే, ఆ ఉద్యోగికి రావలసిన సర్వీస్‌ బెనిఫిట్స్‌ అన్నీ తన వారసులకు లభిస్తాయి. ముఖ్యంగా భార్య బతికి ఉన్నట్లయితే ఆమెకు చెందుతాయి. వారికి సంతానం లేదనీ, మిమ్మల్ని చట్టపరంగా కాకుండా ఒక కూతురుగా మాత్రమే పెంచుకున్నారనీ అన్నారు. మీ పేరు మీ నాన్న సర్వీస్‌ రికార్డుల్లో ఉండడం మంచిదే. అయితే, ఆయన ఉద్యోగానికి అవసరమైన అర్హతలు మీ అమ్మకు ఉన్నప్పుడు మీ నాన్న ఉద్యోగం ఆమెకే చెందుతుంది. ఒకవేళ మీ అమ్మగారే ఆ ఉద్యోగం మీకు ఇవ్వడానికి అనుమతి ఇస్తే తప్ప ఆ ఉద్యోగం మీకు రాదు. పైగా మీ నాన్న చనిపోయినప్పుడు మీ వయసు ఏడేళ్లే కనుక మీకు ఉద్యోగం ఇవ్వడం అసలే వీలు పడదు. ఇప్పుడు మీరు మేజర్‌ అన్న కారణంగా ఆ ఉద్యోగాన్ని మీకు ఇవ్వడమూ కుదరదు. పైగా, మీ నాన్న పెన్షన్‌ బెనిఫిట్స్‌, సర్వీస్‌ బెనిఫిట్స్‌ అన్నీ చట్టబద్దంగా మీ అమ్మగారికే చెందుతాయి. మిమ్మల్ని చట్టబద్ధంగా దత్తత తీసుకోలేదు. అయినా, మీ సర్టిఫికెట్‌లో మీ అమ్మా నాన్నల పేర్లు రాసి ఉన్నట్లయితే, ఆ పేర్ల ఆధారంగా మీరు దత్తపుత్రికగా నిరూపించుకోవలసి ఉంటుంది. ఇకపోతే, మీ అమ్మగారు ఉన్నంత వరకూ తన అధీనంలో ఉన్న ఆస్తిని మరెవరి పేరిటా వీలునామా రాయకపోతే... ఆ స్థిర చరాస్తులు అప్పుడు మీకు చెందు తాయి. న్యాయపరంగా మీ అమ్మ తన భర్త ద్వారా పొందిన స్థిరాస్తులు, తాను ఉద్యోగం చేస్తూ సంపాదించుకున్న చరాస్తులను ఎవరికైనా ధారాదత్తం చేసే పూర్తి అధికారం ఆమెకు ఉంది. ఆమెను చ ట్టరీత్యా డిమాండ్‌ చేసే అధికారం మీకు లేదు.

- ఒడ్నాల శ్రీహరి, న్యాయవాది, హైదరాబాద్‌

Updated Date - 2020-03-10T06:43:45+05:30 IST