Abn logo
Aug 1 2020 @ 18:55PM

అమర్ సింగ్‌కు, అమితాబచ్చన్‌కు చెడింది ఇక్కడే....

న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యుడు, సీనియర్ రాజకీయ వేత్త అమర్ సింగ్ శనివారం సింగపూర్‌లో తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన సమాజ్‌వాదీలో నెంబర్ 2 గా వ్యవహరించారు. సమాజ్‌వాదీ పార్టీ నేతే అయినప్పటికీ అన్ని పార్టీల అగ్రనేతలతోనూ సన్నిహిత సంబంధాలే ఉండేవి. కేవలం రాజకీయ రంగమే కాదు... వ్యాపారం, సినిమా... ఇలా అన్ని రంగాల వ్యక్తులతోనూ ఆయన సన్నిహిత సంబంధాలు నెరిపేవారు.


సినిమా రంగానికి చెందిన బిగ్‌బీ అమితాబచ్చన్ తో అయితే... ఆయనకు మరింత చనువుండేది. చాలా కాలం పాటు వారిద్దరూ అత్యంత సన్నిహితంగా మెలిగారు. అయితే... కొన్నాళ్ల తర్వాత అమితాబ్‌కు, అమర్ సింగ్‌ మధ్య తీవ్రమైన అగాధం ఏర్పడింది. 


అగాధం ఎందుకు ఏర్పడింది అంటే....

అది 90 వ దశకం (1990) ప్రథమార్థం. బిగ్‌బీ అమితాబచ్చన్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. చేయిచ్చి ఆదుకునేవాడు ఒక్కడు లేడు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా రిక్తహస్తాలే చూపించాయి. ఆయన సంస్థ ABCL దివాళా తీసింది. కరెక్ట్‌గా ఆ సమయంలోనే వ్యూహకర్త అమర్ సింగ్ అమితాబ్‌ జీవితంలోకి ప్రవేశించారు. అప్పుడు అమర్ సింగే అమితాబచ్చన్‌ను ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకున్నారు.


ఈ విషయాన్ని ఒకానొక సమయంలో అమర్‌సింగే స్వయంగా వెల్లడించారు కూడా. ఆ సమయంలో సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతో రాయ్‌తో అమితాబచ్చన్‌కు అమర్ సింగ్ స్నేహం కుదిర్చారు. అప్పటి నుంచి అమితాబ్ కీర్తి ప్రతిష్ఠలు అన్ని రకాలుగా  సహారా సంస్థకు బాగా ఉపయోగపడ్డాయి. అమితాబ్ కూడా కాస్త నిలదొక్కుకున్నారని ప్రచారం జరిగింది. అయితే వీరిద్దరి బంధాన్ని అమర్ సింగ్ తుంచేశారని కూడా వార్తలొచ్చాయి అప్పట్లో. 


ఎన్నికల్లో ఎస్పీ ఘోర ఓటమి చవి చూసింది. ఆ ఓటమికి ములాయం సింగ్, అఖిలేశే కారణమంటూ అమర్ సింగ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. దీంతో పార్టీ ఆయన్ను తొలగించింది. ఈ సమయంలోనే అమితాబచ్చన్ భార్య జయాబచ్చన్ కూడా అదే పార్టీలో రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో జయ బచ్చన్ తనకు మద్దతుగా పార్టీని వీడతారని అమర్ విశ్వసించారు. కానీ అలా జరగలేదు. ఇందుకు పూర్తి భిన్నంగా, పార్టీ వైఖరి ప్రకారం జయా బచ్చన్ అమర్ సింగ్‌పై తీవ్ర విమర్శలకు దిగారు.


ఆ కారణంగానే అమర్‌ను జయ బచ్చన్ లక్ష్యంగా చేసుకొని... విమర్శలకు దిగేవారు. దీంతో అమర్ తీవ్రంగా నొచ్చుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆ తర్వాత జయ బచ్చన్‌కు, ఐశ్వర్య రాయ్‌‌కు మధ్య ఉన్న విభేదాలను కూడా అమర్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాకుండా బచ్చన్ కుటుంబానికి చెందిన సినిమాల గురించి, జయా బచ్చన్ సభలో మాట్లాడిన వాటి గురించి కూడా ట్వీట్ చేసి సంచలనం రేపారు. 


అమితాబచ్చన్‌కు బహిరంగ క్షమాపణలు చెబుతూ... పశ్చాత్తాపపడిన అమర్ సింగ్

అమర్ సింగ్ ఆరోగ్యం బాగా దెబ్బతింది. కిడ్నీలు చెడిపోయాయి. దీంతో ఆయనకు సింగపూర్‌లో ఓ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి చేశారు. ఈ సమయంలోనే అమర్ సింగ్ అమితాబచ్చన్ ప్రస్తావన తీసుకొచ్చారు.

‘‘ఈ రోజు నా తండ్రి జయంతి. అమితాబ్ నుంచి నాకు ఓ సందేశం వచ్చింది. ఇప్పుడు నేను మరణంతో పోరాడుతున్నాను. చివరి అంకంలో ఉన్నాను. వారి కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరాలు చేసినందుకు, అతిగా ప్రవర్తించినందుకు క్షమించమని నేను అమితాబ్‌ను కోరుతున్నాను. వారందర్నీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అంటూ అమర్ సింగ్ చరమాంకంలో తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement
Advertisement