విదేశీ మార్కెట్లపై అమర రాజా కన్ను

ABN , First Publish Date - 2020-07-31T07:29:22+05:30 IST

అమర రాజా బ్యాటరీస్‌ విదేశీ మార్కెట్లపై దృష్టి సారించనుంది.

విదేశీ మార్కెట్లపై అమర రాజా కన్ను

  • ఈ ఏడాది చివరకు మూడో కార్ల బ్యాటరీ యూనిట్‌ 
  • టవర్‌ మేనేజిమెంట్‌ వ్యాపారంపై దృష్టి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమర రాజా బ్యాటరీస్‌ విదేశీ మార్కెట్లపై దృష్టి సారించనుంది. కొత్త ఉత్పత్తులు, ఆకర్షణీయ మార్కెట్లలోకి ప్రవేశించడం ద్వారా వ్యాపార కార్యకలాపాలను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. కొత్త సామర్థ్యాలు ప్రస్తుత ఏడాదిలో అందుబాటులోకి  రానున్నాయి. . కొత్త టెక్నాలజీలను వినియోగించడంపై దృష్టి  పెడతామని అమర రాజా బ్యాటరీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జయదేవ్‌ గల్లా అన్నారు. ప్రస్తుత కార్యకలాపాలను విస్తరించడానికి అంతర్జాతీయ ఒప్పందాలను కంపెనీ కుదుర్చుకోనుంది. ఆటోమోటివ్‌ బ్యాటరీల వ్యాపారంలో అమరన్‌, పవర్‌జోన్‌ బ్రాండ్‌లు ప్రాచుర్యం పొందాయి. ఈ బ్రాండ్‌లకు మార్కెట్‌లో గణనీయమైన వాటా ఉంది. కొత్త ఉత్పత్తులు, అప్లికేషన్ల ద్వారా మరింత విస్తరిస్తామని వివరించారు. 


ఈ ఏడాదిలో కొత్త సామర్థ్యాలు..

కొత్త సామర్థ్యాలు ప్రస్తుత ఏడాదిలో అందుబాటులోకి రానున్నాయి. చిత్తూరు తయారీ సదుపాయంలో ప్యాసింజరు కార్ల బ్యాటరీల కోసం మూడో యూనిట్‌ సిద్ధమవుతోంది. 2020-21 చివరి నాటికి ఈ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. బ్యాటరీ పనితీరులో ప్లేట్లు కీలకమైనవి. స్టాంపిడ్‌ గ్రిడ్‌ టెక్నాలజీతో ప్లేట్లను తయారు చేయనున్నాం. దీనికి సంబంధించిన కొత్త యూనిట్‌ సిద్ధమవుతోందని అమర రాజా వెల్లడించింది. దేశంలోని వాహనాల్లో బ్యాటరీ పనితీరును అంచనా వేయడానికి భారీ వాహన టెస్టింగ్‌ కార్యక్రమాన్ని కంపెనీ చేపట్టనుంది. కంపెనీ తయారీ యూనిట్‌లో 9.25 మెగావాట్ల పైకప్పు సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేశామని.. మరో 8.4 మెగావాట్ల పైకప్పు సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం ఈ ఏడాదిలో అందుబాటులోకి రానుందని పేర్కొంది. 


టెలికాం టవర్‌ మేనేజిమెంట్‌లోకి..

కంపెనీ టెలికాం టవర్‌ మేనేజిమెంట్‌ కార్యకలాపాల్లోకి ప్రవేశించింది. కంపెనీ అభివృద్ధి చేసిన ఐఓటీ ఆధారిత ఇంటెలిజెంట్‌ టెలికాం మానిటర్‌ సిస్టమ్‌ సొల్యూషన్‌ ద్వారా సెల్‌ఫోన్‌ టవర్ల పనితీరును పర్యవేక్షిస్తారు. ఈ విభాగం భవిష్యత్తులో మరింత ఆదాయాన్ని ఆర్జించే కీలక విభాగంగా ఆవిర్భవించగలదని కంపెనీ భావిస్తోంది. ఆదాయం, లాభాన్ని పెంచుకోవడానికి కంపెనీ కొత్త మార్గాలను అన్వేషిస్తునే ఉంటుంది. ప్లాంట్‌ సామర్ధ్యాలను మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటామని జయదేవ్‌ అన్నారు.

Updated Date - 2020-07-31T07:29:22+05:30 IST