115 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న మహాపాదయాత్ర

ABN , First Publish Date - 2021-12-01T03:00:52+05:30 IST

ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అమరావతి జేఏసీ చేపట్టిన మహాపాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటివరకూ ..

115 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న మహాపాదయాత్ర

నెల్లూరు: ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అమరావతి జేఏసీ నేతలు చేపట్టిన మహాపాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటివరకూ మొత్తం 115 కిలో మీటర్ల మేర ఈ పాదయాత్ర సాగింది. జిల్లాలో కూడా ఈ పాదయాత్రకు ప్రజలు సంఘీభావం ప్రకటించారు. పెద్ద ఎత్తున తరలివచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. అమరావతినే ఏపీకి రాజధానిగా కొనసాగించాలని మద్దతు తెలుపుతున్నారు. అయితే కొన్ని చోట్ల పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అమరావతి జేఏసీ నేతలు అంటున్నారు. పోలీసుల వైఖరి మార్చుకోవాలని కోరుతున్నారు. 


అమరావతి జేఏసీ నేత తిరుపతిరావు మాట్లాడుతూ ‘‘వాహనాలని, వసతి సౌకర్యాలని ఆపుతూ రాజకీయ కుతంత్రాలు పాల్పడుతున్నారు. రైతుల కొరకు చేస్తున్న ఈ యాత్రని ఆడ్డుకోవాలని అనుకోవడం సిగ్గుచేటు. దేవాలయం లాంటి అసెంబ్లీలో అమరావతి రాజధాని ఉండాలని మాట తప్పారు. మూడు రాజధానుల మీద రాజకీయాలు చేస్తున్నారు. అమరావతి ఉద్యమం రాష్ట్రవ్యాప్త ఉద్యమం కాబోతోంది. వేల ఎకరాల భూములిచ్చిన రైతులను దగాచేసే వీళ్లు తల్లినైన మోసం చేస్తారు.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


శివారెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ రోజు 11.5 కి.మీ పూర్తి చేశాం. 15 రోజుల నుంచి మాతో ప్రయాణం చేస్తున్న క్రీస్తు, ముస్లిం వాహనాలని పోలీసులు ఆపారు. పోలీసుల ఆంక్షలను ప్రజలు గమనిస్తున్నారు. పోలీసుల వాహనాలని నిరోధించగలిగారు. కానీ క్రీస్తు, ముస్లిం ప్రజల మనసుల్లో మమ్మల్ని తొలగించలేరు.’’ అని హెచ్చరించారు. 


రాయపాటి శైలజ మాట్లాడుతూ ‘‘మాకు బస ఇచ్చేవారిని బయపెట్టడం సిగ్గుచేటు. మీరెంత భయపెట్టినా అమరావతి ఉద్యమానికి గడప దాటి మహిళలు బయటకు వస్తున్నారు. రూ.వంద కోట్లు వచ్చాయని అబద్ధపు సోషల్ మీడియా ప్రకటనలు చేస్తున్నారు. అమరావతి రైతులు కూడబెట్టడానికి రావడంలేదు. కూడు పెట్టడానికి నడుస్తున్నారు.’’ అని అన్నారు. 




Updated Date - 2021-12-01T03:00:52+05:30 IST