గ్రీన్‌ టెక్నాలజీల్లో అమరరాజా పెట్టుబడులు

ABN , First Publish Date - 2021-06-15T08:51:41+05:30 IST

ఇంధన, మొబిలిటీ రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా లిథియం అయాన్‌ బ్యాటరీస్‌ టెక్నాలజీతో సహా గ్రీన్‌ టెక్నాలజీల్లో అమరరాజా బ్యాటరీస్‌ పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటి వరకూ వైస్‌ చైర్మన్‌గా ఉన్న జయదేవ్‌ గల్లా సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు

గ్రీన్‌ టెక్నాలజీల్లో అమరరాజా పెట్టుబడులు

‘ఎనర్జీ అండ్‌ మొబిలిటీ‘ వ్యూహంతో ముందుకు 

చైర్మన్‌గా జయదేవ్‌ గల్లా 

కంపెనీలో కొత్త రక్తం

ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా హర్షవర్ధన్‌, విక్రమాదిత్య


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఇంధన, మొబిలిటీ రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా లిథియం అయాన్‌ బ్యాటరీస్‌ టెక్నాలజీతో సహా గ్రీన్‌ టెక్నాలజీల్లో అమరరాజా బ్యాటరీస్‌ పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటి వరకూ వైస్‌ చైర్మన్‌గా ఉన్న జయదేవ్‌ గల్లా సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. వ్యవస్థాపక చైర్మన్‌గా దాదాపు 36 ఏళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వహించిన రామచంద్ర గల్లా ఈ బాధ్యతల నుంచి ఆగస్టు తర్వాత తప్పుకుంటారు.


గ్రీన్‌ టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు కంపెనీ ఉన్నత స్థాయి బాధ్యతల్లో కొత్త రక్తాన్ని ఎక్కిస్తున్నారు. కొత్త తరానికి చెందిన హర్షవర్థన్‌ గౌరినేని, విక్రమాదిత్య గౌరినేని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా పగ్గాలు చేపడతారు. కీలక రంగాల్లో వృద్ధిని మరింత పెంచడానికి ‘ఎనర్జీ అండ్‌ మొబిలిటీ’ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు అమరరాజా బ్యాటరీస్‌ వెల్లడించింది. ఉత్పత్తుల పోర్టుఫోలియో, కొత్త ప్రాంతాలకు విస్తరణ ద్వారా లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీల వ్యాపారంలోనూ విలువను గరిష్ఠం చేయడంపై దృష్టి కేంద్రీకరించనుంది. 


వ్యూహాత్మక బిజినెస్‌ యూనిట్‌: లిథియమ్‌ సెల్‌, బ్యాటరీ ప్యాక్‌, ఈవీ చార్టర్లు, ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థలు, అడ్వాన్స్‌డ్‌ హోమ్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌, సంబంధిత ఉత్పత్తులు, సేవలతో కొత్తగా ఎనర్జీ వ్యూహాత్మక బిజినెస్‌ యూనిట్‌ను కంపెనీ ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ వ్యాపార అవకాశాలను క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత కంపెనీని ఎనర్జీ అండ్‌ మొబిలిటీ కంపెనీగా తీర్చిదిద్దాలని బోర్డు నిర్ణయించిందని అమరరాజా బ్యాటరీస్‌ వైస్‌ చైర్మన్‌ జయదేవ్‌ గల్లా తెలిపారు. అనేక విభాగాల్లోని లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీల్లో అమరరాజా కీలక పాత్ర పోషిస్తున్నందున ఈ రంగంలో కూడా పెట్టుబడులను కంపెనీ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.


ఆటోమోటివ్‌, పారిశ్రామిక, టెలికాం, డేటా సెంటర్స్‌ వంటి విభాగాల నుంచి గిరాకీ కొనసాగనున్నందున భారత్‌లో లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీల వ్యాపారం కూడా అభివృద్ధి చెందగలదని కంపెనీ భావిస్తోంది.  కాగా 36 ఏళ్లపాటు కంపెనీకి మార్గదర్శకత్వం వహించిన వ్యవస్థాపక చైర్మన్‌ రామచంద్ర గల్లా.. చైర్మన్‌గా మళ్లీ తనను నియమించడానికి ఇష్టపడకపోవడంతో ఆ బాధ్యతలను బోర్డు జయదేవ్‌ గల్లాకు అప్పగించింది. అయితే.. ఆగస్టులో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వరకూ చైర్మన్‌గా రామచంద్ర గల్లా కొనసాగుతారు. వచ్చే ఐదు నుంచి పదేళ్లలో గ్రీన్‌ టెక్నాలజీలపై కంపెనీ 100 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టే వీలుందని సమాచారం.

Updated Date - 2021-06-15T08:51:41+05:30 IST