Abn logo
Aug 4 2021 @ 03:11AM

పరిశ్రమలపై పగబడతారా?

కొత్తవి తేలేరు... ఉన్నవి నిలుపుకోలేరు

ఉపాధినిచ్చే సంస్థలపై కక్ష వద్దు

రాజకీయ, కార్మిక వర్గాల హితవు

అమరరాజాపై ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో సంచలనం


తిరుపతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ వేధింపులు, కక్ష సాధింపులు భరించలేక ‘అమరరాజా’ సంస్థ పొరుగు రాష్ట్రంవైపు చూస్తోందన్న విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరీ ముఖ్యంగా ఈ సంస్థ కార్యకలాపాలకు కేంద్రమైన చిత్తూరు జిల్లాలో దీనిపై తీవ్ర చర్చ జరిగింది. ‘మీకో దండం... ఇక్కడ ఉండం’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై కార్మిక, రాజకీయ వర్గాల స్పందన ఇది...


మాకు అదే ఆధారం

నేను, నా భార్య ఇద్దరం 2012 నుంచి అమరరాజా పరిశ్రమలో పనిచేస్తున్నాం. ఏ చీకూచింత లేకుండా కుటుంబం గడవడానికి, ఇంటిల్లిపాదీ ప్రశాంతంగా ఉండడానికీ కారణం ఆ పరిశ్రమే. అమరరాజా కంపెనీ ఇచ్చిన రుణంతోనే చిత్తూరులో సొంత ఇల్లు కూడా కట్టుకోగలిగాం. మా ఇద్దరు పిల్లల్ని కూడా కంపెనీ ఏర్పాటు చేసిన స్కూల్లోనే చదివించుకుంటున్నాం. ఎవరికైనా ఇంతకంటే ఏం కావాలి?

కృష్ణమూర్తి, భూమిరెడ్డిగారిపల్లె, యాదమరి మండలం.


ఉన్న ఒక్కటీ మూయిస్తారా?

చిత్తూరు జిల్లాలో సహకార చక్కెర ఫ్యాక్టరీ, విజయ డెయిరీ, న్యూట్రిన్‌ ఫ్యాక్టరీ వంటివి మూతబడడంతో వేలమంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇపుడు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న అమరరాజా ఫ్యాక్టరీని మూసివేయాలని ప్రభుత్వం యత్నించడం మంచిది కాదు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకు రావాల్సిన ప్రభుత్వం ఉన్న పరిశ్రమలను మూసి వేసే విధంగా చర్యలు చేపట్టడం రాష్ట్రానికి నష్టం చేకూరుస్తుంది.

- ఈదల వెంకటాచలంనాయుడు (చిత్తూరు గాంధీ)


తరలిపోకుండా చూడాలి!

అమరరాజా బ్యాటరీస్‌ పరిశ్రమ తిరుపతి ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తోంది. యాజమాన్యంతో ప్రభుత్వం చర్చించి పరిశ్రమ పక్క రాష్ట్రానికి తరలిపోకుండా చర్యలు తీసుకోవాలి.

ఎంఏ గఫూర్‌, సీపీఎం నేత


కాపాడుకోవాలి

రూ. 17 కోట్ల రుణంతో ప్రారంభమైన అమరరాజా ఇపుడు రూ. వేల కోట్ల టర్నోవర్‌ చేసే స్థాయికి ఎదిగింది. ప్రభుత్వం చేతగాని తనంతో చిత్తూరు జిల్లాకు రావాల్సిన రిలయన్స్‌ పరిశ్రమను ఇప్పటికే పోగొట్టుకున్నాం. అమరరాజా ఫ్యాక్టరీని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.


చింతా మోహన్‌, మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్‌ నేత


కొత్తవి తేలేక...

కొత్త పరిశ్రమలు రాబట్టుకునే చొరవలేక, ఉన్న పరిశ్రమలను నిలుపుకోలేక, ముందుచూపు లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.


శాంతారెడ్డి, బీజేపీ జాతీయ నాయకురాలు


పునరాలోచించాలి

కాలుష్యం ముసుగులో అమరరాజాను వేధించడం సరికాదు. జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగాను 20- 30 వేల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. తమిళనాడుకు కర్మాగారాన్ని తరలించే విషయంపై యాజమాన్యం కూడా పునరాలోచించాలి.

- కందారపు మురళి, చిత్తూరు జిల్లా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి


రాజకీయ కక్షలు వద్దు

ఉపాధిని అందించే కర్మాగారాలపై రాజకీయ కక్షలు విరమించుకోవాలి. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి పాలకులు కృషి చేయాలి.

- ఎ.రామానాయుడు, సీపీఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి


ఇందుకేనా అధికారం?

సీఎం జగన్మోహన్‌ రెడ్డి అభివృద్ధిని పక్కనపెట్టి... ఆయనతో  విబేధించిన వారిపై కక్ష సాధించేందుకే అధికారంలోకి వచ్చినట్టు కనిపిస్తోంది. 

- కిరణ్‌ రాయల్‌, జనసేన నాయకుడు


సేవా, ఉపాధికి కేంద్రం

అమరరాజా ఫ్యాక్టరీల వ్యవస్థాపకులు గల్లా రామచంద్రనాయుడు రాజకీయాలకు అతీతమైన వ్యక్తి. ఫ్యాక్టరీలు స్థాపించి ఉపాధి కల్పించడంతోపాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి వారిపై రాజకీయ కక్షసాధింపులకు దిగడం ప్రభుత్వానికి మంచిదికాదు.

దొరబాబు, టీడీపీ ఎమ్మెల్సీ