ముంచడమే అజెండా!?

ABN , First Publish Date - 2020-10-16T08:28:56+05:30 IST

హైకోర్టుకు ఆమడ దూరంలో రోడ్డుపై 50 మీటర్ల పొడవునా కొంతమేరకు నీళ్లు నిలిచాయి. అంతే...

ముంచడమే అజెండా!?

అమరావతిపై అర్థంలేని ‘శాడిజం’

వందేళ్లలో ఎప్పుడూ వరద చేరలేదు

ఇకపై చేరితే... సర్కారే కారణం!

రాజధాని రైతుల ఆవేదన, ఆక్రోశం

కృష్ణా నది కరకట్ట భద్రత గాలికి

బ్యారేజీ వద్ద కావాలనే అధిక నిల్వ

వాగుల్లో పూడిక తీసింది ఎక్కడ?

ఎత్తిపోతల పంపులూ నడపరా?

పనులన్నీ ఆపేసి ‘వరద’ సృష్టి


ఇది కొండవీటి ఎత్తిపోతల పథకం. దీనిని సక్రమంగా నడిపితే... రాజధాని ప్రాంతానికి ముంపు ముప్పే ఉండదు. ఇటీవల రైతులు వెళ్లి ఆందోళన చేసిన తర్వాతగానీ... మోటార్లు ఆన్‌ చేయలేదు. ‘ముంపు’ సృష్టించాలనే అలా చేశారా?


ఇది ఉండవల్లిలోని కొండవీటి వాగు వంతెన వద్ద పేరుకుపోయిన తూటికాడ! ఇలా వాగులో అనేక చోట్ల తూటికాడ పెరిగింది. పూడిక చేరింది. అవి తొలగిస్తే నీటి ప్రవాహం సాఫీగా సాగుతుందని, స్వల్ప ముంపు కూడా ఉండదని  రైతులు చెబుతున్నారు. మరి... తూటికాడను అలా వదిలేయడంలో అధికారుల ఉద్దేశం ఏమిటి?



‘‘కృష్ణా నదికి అతి భారీ వరదలు వచ్చినప్పుడు కూడా మా గ్రామాల్లోకి నీళ్లు రాలేదు. ఇకపై ఎక్కడైనా, ఎప్పుడైనా మా ప్రాంతం ముంపునకు గురైతే... అది వైసీపీ సర్కారు అజెండాలో భాగంగానే జరిగిందని కచ్చితంగా చెప్పవచ్చు. మమ్మల్ని ముంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది’’... ఇదీ రాజధాని గ్రామాల ప్రజలు కుండబద్దలు కొట్టి చెబుతున్న మాట! ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వమే ముంచేందుకు ఎత్తులు వేస్తోందని వారు ఎందుకు చెబుతున్నారు? వారి మాటల్లో వాస్తవం ఎంత? ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం!



(మంగళగిరి, తుళ్లూరు,గుంటూరు, తెనాలి): హైకోర్టుకు ఆమడ దూరంలో రోడ్డుపై 50 మీటర్ల పొడవునా కొంతమేరకు నీళ్లు నిలిచాయి. అంతే... ‘హైకోర్టు ఆవరణ మొత్తం జలమయమై పోయింది’ అంటూ జగన్‌ మీడియాలో వార్తలు! ఇంకెక్కడో రాజధాని నిర్మాణ పనుల్లో భాగంగా తీసిన గోతుల్లో నిలబడిన నీళ్ల ఫొటోలు తీసి... హైకోర్టు పరిస్థితి ఇదీ అంటూ వ్యాఖ్యానాలు! తాజా వరదలు, వర్షాలకు తూర్పు గోదావరి జిల్లా అతలాకుతలమైనా, ఆ విషయాన్ని వదిలేసిన రాజమండ్రి ఎంపీ... తప్పుడు, పాత ఫొటోలు ట్విట్టర్‌లో పెట్టి, ‘రాజధాని మునిగిపోతోంది’ అంటూ వాపోవడం! ఇక... సోషల్‌ మీడియాలో వైసీపీ మద్దతుదారుల సంగతి సరేసరి! ‘‘అమరావతి గ్రామాలు మునిగిపోతున్నాయని చెప్పేందుకు ఎందుకీ ఆరాటం? ఏమిటీ శాడిజం?’’ అని రాజధాని ప్రాంత ప్రజలు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.


అంతేకాదు... ఏదిఏమైనా అమరావతి ముంపు ప్రాంతమని ‘రుజువు’ చేసేందుకు, తాము అనుకున్నది ‘సాధించేందుకు’ ఉద్దేశపూర్వకంగా కొన్ని చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ‘‘కరకట్ట నిర్మించిన తర్వాత వందేళ్లలో ఎప్పుడూ మా గ్రామాల్లోకి నీళ్లు రాలేదు. వచ్చాయంటే మాత్రం అందుకు ప్రభుత్వమే కారణమవుతుంది’’ అని తేల్చి చెబుతున్నారు.


కరకట్టతోనే ఆటలు...

గత వందేళ్లలో కృష్ణా నదికి ఒక్కసారి మాత్రమే 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. అది.. 2009లో. అప్పుడు కూడా అమరావతిలోకి చుక్క నీరు రాలేదు. ఇది... కరకట్ట కల్పించిన భద్రత. ఇప్పుడు, ఆ కరకట్టకే ‘గండి’ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి ఎగువన, దిగువన ఉన్న 109 కిలోమీటర్ల పొడవునా ఉన్న కుడి కరకట్ట గండ్ల మయంగా మారింది. బ్రిటిష్‌ కాలంలోనే దీని నిర్మాణం జరిగింది. వైఎస్‌ సర్కారు బ్యారేజీకి దిగువన 65 కిలోమీటర్ల పొడవునా ఉన్న కరకట్టను రూ.111 కోట్లతో బలోపేతం చేసింది. దిగువన అమరావతి వైపున ఉన్న కరకట్టను పట్టించుకోలేదు. చంద్రబాబు సర్కారు అమరావతి ప్రాంతానికి రక్షణ కల్పించే 14 కిలోమీటర్ల కరకట్టను బలోపేతం చేసేందుకు రూ.200 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. టెండర్లు పిలిచే దశలో ఎన్నికల కోడ్‌ రావటంతో పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుత సర్కారు ఇప్పుడు దీనిని గాలికి వదిలేసింది.


కరకట్ట వెంబడి ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక లస్కరును కాపలాగా పెట్టాలి. ఎక్కడైనా కరకట్ట బలహీన పడినా, మట్టికోతకు గురైనా వెంటనే మరమ్మతులు చేయించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఏటా వరదల సమయంలో కరకట్ట భద్రతను పర్యవేక్షించి, బలోపేతానికి అవసరమైన తాత్కాలిక చర్యలు కూడా తీసుకోవడంలేదు. ఇది మాత్రమే కాదు! బ్యారేజీకి ఎగువన అక్రమంగా నీటిని తోడేందుకు పలుచోట్ల అక్రమంగా కరకట్ట అడుగు నుంచి పైప్‌లైన్లు వేశారు. అధికారులు వీటిని కూడా తొలగించడంలేదు. వీటి ద్వారా నీరు లీకేజీ మొదలై, కట్టకు గండిపడే అవకాశాలు తోసిపుచ్చలేం. మొత్తం కృష్ణా కరకట్ట భద్రతను పర్యవేక్షించేందుకు 22 మంది లస్కర్లు, నలుగురు ఏఈలు, 8 మంది వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు, మరికొందరు ఐసీ అసిస్టెంట్‌లు ఉండాలి. కానీ... 22 మంది లస్కర్లకుగాను ఏడుగురు మాత్రమే ఉన్నారు.


ఒకే ఒక్క వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌, ఒక ఐసీ అసిస్టెంట్‌, ముగ్గురు ఏఈలే విధుల్లో ఉన్నారు. ఇదీ... కరకట్ట భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యం! ‘‘భారీ వరదలు వచ్చినప్పుడు ఎక్కడైనా కరకట్టకు గండిపడితే, రాజధాని గ్రామాల్లోకి నీరు వచ్చి చేరుతుంది. అప్పుడు... దీనిని ముంపు ప్రాంతంగా రుజువు చేయవచ్చు. అందుకే, ప్రభుత్వం కరకట్ట భద్రతను నిర్లక్ష్యం చేస్తోందనే అనుమానాలు తలెత్తుతున్నాయి’’ అని రాజధాని ప్రాంత రైతులు పేర్కొంటున్నారు. 


గోతుల్లోని నీళ్లూ ‘ముంపు’ ఖాతాలోనే

తెలుగుదేశం హయాంలో రాజధాని పనులు జోరుగా సాగాయి. రహదారులు, భవనాలు, ఇతర నిర్మాణాల కోసం చాటాచోట్ల గోతులు తీశారు. వైసీపీ వచ్చాక పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో... గోతులు గోతుల్లాగానే మిగిలిపోయాయి. ఈ గోతుల్లోకి వాన నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాల సమయంలో పక్కకు పొంగుతోంది. వైసీపీ నేతలు, మద్దతుదారులు దీనిని కూడా ‘ముంపు’గా చూపిస్తున్నారు. ఇక... అప్పట్లో రహదారుల నిర్మాణం కోసం తవ్విన మట్టిని పలుచోట్ల రోడ్డుకు అటూఇటూ పోశారు. ఏడాదిన్నరగా అమరావతిలో తట్టెడు మట్టిని కూడా ఎత్తిపోయలేదు. పాలవాగు, పొట్టేళ్లవాగు, అయ్యన్నవాగుల్లో పూడిక పేరుకుపోయింది.


ఈ వాగులపై పైపులతో నిర్మించిన కల్వర్టులు పూడిపోయాయి. అందువల్లే... రాయపూడి మీదుగా అమరావతికి వెళ్లే దారిలో, అది కూడా 50 మీటర్ల మేర రోడ్డుపై నీరు నిలిచిపోయింది. అధికారులు తలచుకుంటే... ఐదు నిమిషాల్లో మొత్తం నీరు ఖాళీ అయిపోయేది. కానీ, ‘ముంపును’ చూపేందుకే అలా వదిలేశారు. ఇక... పాలవాగు కృష్ణా నదిలో కలిసేచోట క్లస్టర్‌ గేటు పాడైపోయినా పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో వాగు నీరు కృష్ణా నదిలో కలవడంతో ఇబ్బంది తలెత్తి... రాయపూడి పరిధిలో కొంత నీరు కలుస్తోంది. రాజధాని పనులు యథాతథంగా జరిగి ఉంటే... మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా వాగుల్లో పూడికను తొలగించి, కల్వర్టులను నిర్మించే వారు. అప్పుడు చుక్క నీరు కూడా నిలిచేది కాదు. ఇప్పుడు పనులన్నీ ఆపివేసి, ‘ఇదిగో ముంపు’ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజధాని రైతులు మండిపడుతున్నారు. 


ఎందుకు ఎత్తిపోయరు?

రాజధాని గ్రామాలకు ఏకైక ముంపు ముప్పు... కొండవీటి వాగుతోనే. భారీ వర్షాల సమయంలో మాత్రమే కొండవీటి వాగు పొంగిపొర్లేది. ఈ వాగు కృష్ణా నది కంటే దిగువన ఉండటంతో పొలాలను ముంచెత్తేది. దీనిని నివారించేందుకు గత ప్రభుత్వం కొండవీటి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. 17 మోటర్ల ద్వారా ప్రకాశం బ్యారేజీకి 5వేల క్యూసెక్కులు నీటిని ఎత్తిపోయవచ్చు. మరో ఐదువేల క్యూసెక్కులను లాకుల ద్వారా బకింగ్‌హామ్‌ కెనాల్‌లోకి తరలించే అవకాశముంది. ఈ ఎత్తిపోతలతో కొండవీటివాగు ముంపు పూర్తిగా తప్పిపోయింది. అయినా సరే... ఏదో ఒక విధంగా ‘ముంపు’ చూపించాలనే ఉద్దేశంతో, ఎత్తిపోతలను సరిగా నిర్వహించడంలేదని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు.


‘‘రూ.250 కోట్లతో కొండవీటి ఎత్తిపోతలను నిర్మించారు. వాగు పొంగుతుందని తెలిసి కూడా మంగళవారం వరకు మోటర్లు ఆన్‌ చేయలేదు. మేం వచ్చి ఆందోళన చేసిన తర్వాతే స్విచ్చులు వేశారు. 20 రోజుల కిందట కూడా ఇలాగే చేశారు. అప్పుడు ఐదు మోటర్లు ఆన్‌ చేయగానే ముంపు మొత్తం పోయింది. ఇదంతా కుట్ర కాక మరేమిటి?’’ అని రాజధాని రైతులు ప్రశ్నించారు. ప్రస్తుతం కొండవీటి వాగులో అనేకచోట్ల గుర్రపు డెక్క, తూటికాడ విపరీతంగా పెరిగి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. పూడిక తీత జరిగితే నీరు సాఫీగా పోతుందని, ముంపు సమస్యను సృష్టించేందుకే ఈ పనులను చేపట్టడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు.


అప్పుడూ ముంపు లేదు!.. మేరి శౌరి, తుళ్లూరు

కృష్ణా నదికి ఎప్పుడో 1977లో ఒకసారి, 2009లో ఒకసారి భారీ వరదను చూశాం. ఆ సమయంలోను గ్రామాల్లోకి నీరు రాలేదు. రాజధాని వచ్చినప్పటి నుంచి మా ప్రాంతం ముంపు అంటున్నారు. గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడైనా ఇక్కడ ఒక్క చుక్కనీరైనా నిలిచిందా... మా ప్రాంతాన్ని ముంచటానికి కిందకు నీళ్లు వదలకుండా చేసి ఇదంతా మునుగుతుందంటున్నారు. ఇక్కడికి వచ్చి చూసి నిజాలు మాట్లాడండి. 


కావాలనే అడ్డుకట్టలను తొలగించలేదు.. అల్లూరి సురేష్‌, నెక్కల్లు

గత ప్రభుత్వంలో రోడ్ల  పనులు దాదాపు 75శాతం పూర్తయ్యాయి. అ సమయంలో వాగులు ప్రవహించే ప్రాంతంలో కల్వర్టులు ఏర్పాటు చేశారు. వర్షాలు భారీగా పడుతున్నా వాటికి అడ్డుగా వేసిన కట్టలను తొలగించలేదు. దాని మూలానే వెంకటపాలెం వద్ద ఉన్న సీడ్‌ యాక్సిస్‌ వద్ద కాస్త నీరు ఆగింది. దానిని పెద్దగా చూపారు. విషయం తెలిసి మేము స్వచ్ఛందంగా వచ్చి జేసీబీలు, పలుగు, పారలతో తొలగించగానే 20 నిమిషాల్లో నీరంతా పోయింది. దీనిని హైకోర్టు మునిగినట్లు చూపించారు. రాజధానికి ఇవ్వక ముందు మా భూముల్లో ఏడాదికి రెండు పంటలు పండేవి. ఏనాడూ అవి మునగలేదు. ప్రభుత్వ లెక్కల్లో మాకు ఎన్నాడైనా వరద సాయం చేసినట్లు ఉందేమో చూపించండి. మీ రాజకీయ కుట్రల్లో మమ్మల్ని పావులు చేయవద్దు.


పంటకాల్వలను పూడ్చలేదు!..సాహెబ్‌ జాన్‌ షేక్‌, రాయపూడి

సీఆర్‌డీఏ ప్లాన్‌ ప్రకారం పాత పంట కాల్వలను మూసివేసి కొత్త కాల్వలు నిర్మించి వాటి గుండా కొండవీడు వాగులో డ్రైనేజ్‌ను కలపాలి.  రెండు సంవత్సరాల నుంచి పూడికలు తీయలేదు. అలానే రాజధానిలో రోడ్ల నిర్మాణం కోసం తీసిన మట్టిని దిబ్బలుగా పోసారు. అందువల్ల అక్కడక్కడ కాస్త నీరు నిలబడినట్లు కనిపిస్తోంది.


పాలవాగు కృష్ణానదిలో కలవాలి!..చిలక బసవయ్య, రాయపూడి

పాలవాగు అనంతవరం, వైకుంఠపురం, వడ్లమాను, నెక్కల్లు మీదుగా రాయపూడి వద్ద నిర్మించిన సూయిజ్‌ గేటు ద్వారా నదిలో కలవాలి. అయితే రెండు సంవత్సరాల క్రితం ఆ గేటు పాడైయ్యింది. ఎలుక దూరిందని ఇళ్లు తగలబెట్టుకున్నట్లుగా రాజకీయ కక్షలతో మా గ్రామాలను ముంచాలని చూస్తున్నారు. ఇంత జరుగుతున్నా కొండవీడు వాగు ఎత్తిపోతల పథకంలో ఒక్క పంపునే ఆన్‌ చేశారు. అన్నీ ఆన్‌ చేస్తే చుక్క నీరు ఉండదు.  


రాజధాని ప్రాంతంలో రహదారులు, కల్వర్టులు, డక్ట్‌ల కోసం తవ్విన గోతులను అలాగే వదిలేశారు. పనులకోసం తవ్విన మట్టి దిబ్బలను కూడా కదిలించలేదు. దీనివల్ల పలుచోట్ల వర్షపు నీరు నిల్వ ఉంటోంది. దీనిని ‘ముంపు’ అంటారా? కావాలనే ముంచడం అంటారా?


ప్రకాశం బ్యారేజీకి దిగువన అత్తలూరివారిపాలెం దగ్గర కృష్ణా కరకట్టకు కోతపడిన చిత్రం! అత్యంత కీలకమైన కరకట్ట భద్రతను ఎందుకు గాలికి వదిలేశారు?

Updated Date - 2020-10-16T08:28:56+05:30 IST