మహిళపై లాఠీ!

ABN , First Publish Date - 2021-03-09T06:21:16+05:30 IST

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి ప్రాంతానికి చెందిన మహిళా రైతులు సోమవారం విజయవాడ కనకదుర్గమ్మ వారు, గుణదల మేరీమాతను దర్శించుకునేందుకు బయలుదేరారు.

మహిళపై లాఠీ!

 మహిళా దినోత్సవం రోజునే పోలీసుల దాష్టీకం

ఆలయాలకు వెళుతున్న రాజధాని మహిళలపై ఆంక్షలు

ఎక్కడికక్కడ తనిఖీలు

ప్రకాశం బ్యారేజీపై నిలిపివేత

సచివాలయానికి బయలుదేరినవారిపై లాఠీచార్జి

పలువురు మహిళలకు గాయాలు

  

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. అంతా మహిళలను కొనియాడుతూ పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. కానీ అదే సమయంలో రాజధాని మహిళలకు తీవ్ర అవమానం జరిగింది. విజయవాడలోని దుర్గమ్మ గుడికి, గుణదల మేరిమాత చర్చికి బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆలయాలకు వెళుతున్నామని చెప్పినా వినిపించుకోలేదు. కన్నీరు పెట్టినా కనికరించలేదు..  పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో మహిళలు రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేపట్టారు.  


తుళ్లూరు, తాడేపల్లి టౌన్‌, తాడికొండ, మార్చి 8: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి ప్రాంతానికి చెందిన మహిళా రైతులు సోమవారం విజయవాడ కనకదుర్గమ్మ వారు, గుణదల మేరీమాతను దర్శించుకునేందుకు బయలుదేరారు. ప్రైవేటు వాహనాల్లో బయలుదేరిన వారిని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద వారిని దింపివేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది.. వెళ్లడానికి వీల్లేదంటూ  ఆపేశారు పోలీసుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజిపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న మహిళలను అరెస్టు చేశారు. అరెస్టు సందర్భంగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో దళిత జేఏసీ సభ్యురాలు కంభంపాటి శిరీష కిందపడి సొమ్మసిల్లిపోయింది. తోటి మహిళలు ఆమెను సపర్యలు చేయటంతో గంటన్నర తరువాత తేరుకుంది. పోలీసులు తమను గాయపరిచారంటూ మహిళలు ఆరోపించారు. అరెస్టు చేసిన మహిళలను మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  


రోడ్డుపైనే భోజనం

అనంతరం రాజధాని గ్రామం మందడంలో మహిళలు ధర్నాకు దిగారు. తమకు జరిగిన అన్యాయాన్ని సీఎంకు విన్నవించుకుంటామంటూ సచివాలయం వైపు బయలుదేరారు. కిలోమీటరు దూరంలో పోలీసులు మాల్కాపురం జంక్షన్‌ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడ కూడా పోలీసులు మహిళలను తోసేశారు. ఆ తోపులాటలో పలువురు మహిళలు గాయపడ్డారు. తనను పోలీసులు గోళ్లతో గాయపరిచనట్లు జేఏసీ నాయకురాలు రాయపాటి శైలజ పేర్కొన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా మహిళలు తారురోడ్డునే ఆకుగా చేసుకొని భోజనం చేశారు.  సాయత్రం వరకు పలుమార్లు సచివాలయం వైపు వెళ్లటానికి ప్రయత్నించారు. అనంతరం వెలగపూడి శిబిరానికి కవాతుగా బయలుదేరారు. అందుకు అనుమతి లేదని మరలా పోలీసులు అడ్డు చెప్పారు. పోలీసులు వేసిన ముళ్ల కంచెలను చేధించుకొని, బారికేడ్లను పక్కకు నెట్టి  మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెలగపూడి శిబిరానికి మహిళలు రైతులు చేరుకున్నారు. గాయాలపాలైన మహిళలను వెలగపూడి శిబిరంలో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, సినీనటి దివ్యవాణి, కృష్ణా జడ్పీ మాజీ ఛైర్మెన్‌ గద్దె అనురాధ, టీడీపీ  గుంటూరు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి పరామర్శించారు. మహిళలపై  జరిగిన దాడిని నిరసనగా సాయంత్రం రాజధాని గ్రామాల్లో కొవ్వొత్తులు వెలిగించి ప్రదర్శన జరిగిపారు. తాడికొండ మండలం మోతడక, తాడేపల్లి మండలం పెనుమాకలో నిరసన దీక్షలు కొనసాగాయి.   

Updated Date - 2021-03-09T06:21:16+05:30 IST