బిగిసిన పిడికిళ్లు

ABN , First Publish Date - 2021-01-21T06:58:20+05:30 IST

అమరావతే అంతిమ లక్ష్యం అంటూ రాజధాని రైతులు, కూలీలు, మహిళలు నినదించారు.

బిగిసిన పిడికిళ్లు
రాజధాని గ్రామాల్లో సంకల్ప యాత్రలో రైతులు, వారికి మద్దతుగా పాల్గొన్న రాజకీయపార్టీల నాయకులు

400వ రోజు  మార్మోగిన అమరావతి నినాదం

 ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ

 ఐక్యత చాటిన రాజధాని ప్రాంత రైతులు, కూలీలు

 పూర్తిస్థాయిలో విపక్ష పార్టీల మద్దతు


అమరావతే అంతిమ లక్ష్యం అంటూ రాజధాని రైతులు, కూలీలు, మహిళలు నినదించారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అనే ఉద్యమ నినాదాలు రాజధాని గ్రామాల్లో మార్మోగాయి. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల ర్యాలీలతో హోరెత్తించారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం బుధవారం 400వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి సంకల్ప ర్యాలీ నిర్వహించారు. తుళ్లూరులో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ర్యాలీ సాయంత్రం 4.30 గంటల వరకు గ్రామగ్రామాన సాగింది.


గుంటూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : అడుగడుగునా నిర్బంధాలను ఎదుర్కొంటూనే అమరావతి రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమం బుధవారానికి 400వ రోజుకు చేరుకుంది. ఢిల్లీ రైతుల నిరసన దీక్షల స్ఫూర్తితో అమరావతి రైతులు బైక్‌, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో రైతులు, రైతు కూలీలు, మహిళలు ర్యాలీలో పాల్గొని కులాలకు అతీతంగా తమ ఐక్యతను ఎలుగెత్తి చాటారు. అమరావతి పరిరక్షణ జేఏసీ నేతృత్వంలో సాగిన ఈ సంకల్ప యాత్రలో రైతులకు సంఘీభావంగా వైసీపీ మినహా అన్నీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. తుళ్లూరులో ర్యాలీకి ఎంపీ గల్లా జయదేవ్‌, టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నేత పోతుల మహేష్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్లమాను, హరిశ్చంద్రాపురం, బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, లింగాయపాలెం, వెలగపూడి మీదగా మందడం వరకు సాగింది. ఎంపీ గల్లా జయదేవ్‌ ట్రాక్టర్‌ నడిపి రైతుల్లో స్ఫూర్తిని నింపారు. తెనాలి శ్రావణ్‌కుమార్‌, ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు, మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ, దళిత జేఏసీ నేత గడ్డం మార్టిన్‌, పువ్వాడ సుధాకర్‌ ర్యాలీ ఆసాంతం ద్విచక్ర వాహనాలు నడుపుతూ రైతులకు మద్దతు తెలిపారు. సీపీఎం నేత బాబూరావు, జనసేన నేత పోతిన మహేష్‌, బీజేపీ నేతలు జమ్ముల శ్యామ్‌కిషోర్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌  తులసిరెడ్డి, మహిళా నేతలు సుంకర పద్మశ్రీ, గద్దె అనురాధ, కేశినేని శ్వేత, అన్నాబత్తిన జయలక్ష్మి తదితరులు ర్యాలీలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. 

Updated Date - 2021-01-21T06:58:20+05:30 IST