Abn logo
Oct 25 2021 @ 00:13AM

అమరావతి.. అభివృద్ధి అంటే నచ్చదు

నెక్కల్లు శిబిరంలో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు

677వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు

తుళ్ళూరు, అక్టోబరు 24: అమరావతి అన్నా.. అభివృద్ధి అన్నా పాలకులకు నచ్చడంలేదని రాజధాని రైతులు మండిపడ్డారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తోన్న ఉద్యమం ఆదివారంతో 677వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ సీఎం జగన్‌రెడ్డి మూడు  రాజధానుల ప్రతిపదన వెనుక అమరావతిని నాశనం చేయడమనే కుట్ర దాగుందన్నారు. దాదాపు పది వేల కోట్లతో అమరావతిలో అభివృద్ధి పనులు జరిగితే ఏమీ జరగనట్లు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. అబద్ధాలు ఆడటానికైనా ఒక హుద్దు ఉండాలని తెలిపారు. రాజధాని అమరావతిని కాదన్నారంటే ఐదు కోట్ల మంది భవిషత్‌ను కాదన్నట్లేనన్నారు. భూములు ఇచ్చి రోడ్డు పడ్డామని రైతులు వాపోయారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.  

అమరావతి కోసం మహా పాదయాత్ర

అమరావతిని రక్షించుకోవడమే కర్తవ్యంగా మహాపాదయాత్ర చేపడుతున్నట్లు అమరావతి జేఏసీ కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ తెలిపారు. ఆదివారం వెలగపూడి రైతు జేఏసీ కార్యాలయంలో జరిగిన రాజఽధాని రైతులు, రైతు కూలీలు, మహిళలు, దళిత యువజన, ముస్లిం మైనార్టీ జేఏసీల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి వరకు జరిగే మహాపాద యాత్రను జయప్రదం చేసుకునేందుకు అందరూ సన్నద్ధంగా ఉండాలన్నారు. నవంబరు ఒకటిన అమరావతిలోని రాష్ట్ర ఉన్నత న్యాయం స్థానం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. 45 రోజులు సాగే యాత్రలో యాభై మంది ముస్లిం యువత కొనసాగుతుందని ముస్లిం మైనార్టీ జేఏసీ నేత షేక్‌ జానీ తెలిపారు. సమావేశంలో జేఏసీ కో కన్వీనర్‌ గద్దె తిరుపతిరావు, రైతు జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తుళ్లూరులోని అన్నపూర్ణ భవనంలో ఆదివారం 9వ దళిత జేఏసీ సమావేశం జరిగింది. అమరావతిని రక్షించుకోవటం కోసం కట్టుబడి పని చేస్తామని దళిత రైతులు, జేఏసీ సభ్యులు తెలిపారు.