హోదా తేలేకే.. మూడు ముక్కలాట

ABN , First Publish Date - 2021-08-02T05:56:35+05:30 IST

ప్రత్యేక హోదా తెస్తామని అధికారం చేపట్టిన జగన్‌ దానిని విస్మరించి, ప్రజల దృష్టిని మరల్చేందుకే మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని అమరావతి రైతులు ఆరోపించారు.

హోదా తేలేకే.. మూడు ముక్కలాట
తుళ్లూరులో ఆందోళనలు చేస్తున్న రైతులు

592వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు

తుళ్లూరు ఆగస్టు 1: ప్రత్యేక హోదా తెస్తామని అధికారం చేపట్టిన జగన్‌ దానిని విస్మరించి, ప్రజల దృష్టిని మరల్చేందుకే మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని అమరావతి రైతులు ఆరోపించారు. మూడు రాజధానులతో అభివృద్ధి జరగదని, కేంద్రం మెడలు ఒంచి ప్రత్యేకహోదా తీసుకు వస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన సీఎం జగన్‌ కేంద్రం వద్ద  మోకరిల్లారన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారంతో 592వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు శిబిరాల నుంచి మహిళలు, రైతులు, రైతు కూలీలు మాట్లాడుతూ అమరావతిని నాశనం చేయడానికే మూడు రాజధానుల ప్రతిపాదన అని తెలిపారు. 33 వేల ఎకరాలు ఇస్తే అమరావతిని అభివృద్ధి చేయడం చేతకాక పాలకులు మూడు ముక్కల ఆట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు కావాలని పెయిడ్‌ ఆర్టిస్టుల చేత దీక్షలు చేయించడం సిగ్గు చేటన్నారు. తుళ్లూరు, అనంతవరం, నెక్కల్లు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, దొండపాడు, రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం, వెలగపూడి, మందడం, ఐనవోలు, పెదపరిమి తదితర గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. 


Updated Date - 2021-08-02T05:56:35+05:30 IST