అమరావతి.. సమర సంక్రాంతి

ABN , First Publish Date - 2022-01-17T04:59:24+05:30 IST

ఏకైక రాజధాని అమరావతి సమర నినాదంతో సంక్రాంతి పర్వదినాన్ని రైతులు జరుపుకున్నారు.

అమరావతి.. సమర సంక్రాంతి
అమరావ తిని ఏకైక రాజధాని గా ప్రకటించాలని బెలాన్‌లు ఎగురవేస్తున్న రాజధాని రైతులు, మహిళలు

వంటా వార్పు, గాలి పటాలు ఎగురవేసి నిరసనలు 

761వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళనలు

తుళ్లూరు, జనవరి 16: ఏకైక రాజధాని అమరావతి సమర నినాదంతో సంక్రాంతి పర్వదినాన్ని రైతులు జరుపుకున్నారు. దీక్షా శిబిరాల వద్ద వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అమరావతి ఆందోళనలు ఆదివారంతో 761 రోజుకు చేరుకున్నాయి. సంక్రాంతి, కనుమ పర్వదినాలను రైతులు, మహిళలు దీక్షా శిబిరాల వద్ద రోడ్లపైనే సమర సంక్రాంతి పేరుతో జరుపుకున్నారు. ఇళ్ల ముందు రంగవల్లులు దిదుద్దకోవాల్సిన మహిళలు శిబిరాల వద్ద ముగ్గులు వేసి నిరసనలు వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం వంటావార్పు కార్యక్రమం పేరుతో రోడ్లపైనే భోజనాలు చేశారు. ఆదివారం కనుమ రోజు వెలగపూడి శిబిరం వద్ద దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తుళ్లూరు శిబిరం వద్ద  మహిళలు.. పొంగళ్లు పెట్టారు. సేవ్‌ అమరావతి - సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని గాలిపటాలు, బెలూన్లపై రాసి ఎగురవేసి నిరసనలు తెలిపారు. పాలకుల తీరుతో మూడో ఏడు ఇలా సంక్రాంతిని రోడ్డు మీద నిర్వహించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో రాజధాని రైతులు, మహిళలతో పాటు సీపీఐ రాష్ట్ర సహాయక కార్యవర్గ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-17T04:59:24+05:30 IST