జాతర తలపించేలా.. ‘గిరి’ పులకించేలా!

ABN , First Publish Date - 2021-12-07T05:41:12+05:30 IST

సోమవారం ఉదయం బాలాయపల్లి మండలం వెంగమాంబపురం నుంచి మహాపాదయాత్ర ప్రారంభమైంది. వెంగమాంబపురం, అక్కసముద్రం గ్రామాల్లో అమరావతి రైతులు పొలాల్లోకి దిగి వరినాట్లు వేశారు.

జాతర తలపించేలా..  ‘గిరి’ పులకించేలా!
వెంకటగిరి పట్టణంలో సోమవారం సాయంత్రం జరిగిన అమరావతి రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్న జనం

వెంకటగిరిలో పెల్లుబుకిన ప్రజాభిమానం 

మహా పాదయాత్రకు ఘన స్వాగతం

సంఘీభావం తెలిపిన ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ రైతు నాయకులు


స్వాగతిస్తూ పదం కలిపిన జనపద కళారూపాలు.. పోటెత్తి వెంట నడిచిన ప్రజాభిమానం.. న్యూఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌ రైతుల సంఘీభవం.. పోలేరమ్మ జాతరను తలపించేలా కిక్కిరిసిన వెంకటగిరి వీధులు.. రాష్ట్రాన్ని కాపాడు తల్లీ అంటూ పోలేరమ్మకు ఉద్యమకారుల వేడుకోలు... తమ ఇంటి ఆడపడుచులులా నేత చీరలతో సత్కరించిన అన్నదాతలు.. వరినాట్లు వేసి మద్దతు కోరిన రాజధాని రైతులకు మీ వెంటే మేమంతా అంటూ నినదించిన స్థానిక స్వరాలు.. మీ ఉద్యమానికి మా వంతు అంటూ భారీగా విరాళాలు అందజేసిన దాతలు.. వెరసి సోమవారం అమరావతి రైతుల మహా పాదయాత్రకు ప్రజలు నీరాజనం పలికారు.

 

వెంకటగిరి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సోమవారం ఉదయం బాలాయపల్లి మండలం వెంగమాంబపురం నుంచి మహాపాదయాత్ర ప్రారంభమైంది. వెంగమాంబపురం, అక్కసముద్రం గ్రామాల్లో అమరావతి రైతులు పొలాల్లోకి దిగి వరినాట్లు వేశారు. ‘‘మీది, మాది ఒకటే రాష్ట్రం.. ఒకటే రాజధాని కావడానికి సహకరించండి..’’ అంటూ అక్కడున్న రైతులను అభ్యర్థించారు. అమరావతి అక్కాచెల్లెళ్ల కలుపుగోలుతనం చూసి స్థానిక శ్రామిక మహిళలు కదిలిపోయారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుందన్నారు. అక్కడి నుంచి సాగిన పాదయాత్ర 11.30 గంటలకు వెంకటగిరి పొలిమేరల్లోకి చేరుకుంది. అప్పటికే అక్కడ ఎదురుచూస్తున్న కళాబృందాలు పాదయాత్రను ఘనంగా స్వాగతించాయి. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ రైతు వాహనమైన ట్రాక్టర్‌ను నడుపుతూ ముందు దారిచూపగా భారీగా తరలివచ్చిన ప్రజలు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో పాదయాత్ర పట్టణంలోని పలు వీధుల గుండా సాగింది. రాజధాని రైతులకు సంఘీభావం తెలపడానికి ప్రజలు ఇళ్లు వదలి వీధుల్లోకి వచ్చారు. మంగళహారతులు పట్టి, పూలవర్షం కురిపించారు. బాణసంచాలు,  బ్యాండు మేళాలు, డప్పులు, వివిధ కళారూపాల విన్యాసాలతో పాదయాత్ర అట్టహాసంగా సాగింది. రాజధాని రైతులు పోలెరమ్మను దర్శించి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలపడంతోపాటు ఉద్యమానికి విరాళాలు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల, ఆయన స్నేహితులు కలిసి 9 లక్షల రూపాయల విరాళాలు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త హరిశ్చంద్ర ప్రసాద్‌ రూ.10,00,116 విరాళం అందజేశారు. వల్లభనేని మధుసూదన్‌, రంగినేని కాంతారావు, దూరాటి వెంకయ్యనాయుడు, కె.వెంకటేశ్వరులు, వెంకటగిరి రైతులు పాదయాత్ర చేస్తున్న రాజధాని ఆడపడుచులను వెంకటగిరి చీరలతో సత్కరించారు.


అంతర్రాష్ట్ర రైతుల మద్దతు

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీరట్‌కు చెందిన రైతు నాయకులు సర్జయ్‌ చౌదరి, అభిషేక్‌, గౌరవ్‌ ఉత్తమ్‌, అమిత్‌లు, ఢిల్లీ ఉద్యమ నాయకులు రాకేష్‌ టికాయత్‌ మేనళ్లులు అమరావతి రైతుల పాదయాత్రలో కలిసి సంఘీభావం వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో రైతుల భూములు లాక్కొని ఇప్పుడు ఇలా అన్యాయం చేయడం దుర్మార్గమన్నారు. సుస్థిర రాజధాని లేకుంటే రాష్ట్ర ప్రగతి ఏమవుతుందని ప్రశ్నించారు. ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. అన్ని రాష్ట్రాల రైతు సంఘాల మద్దతుతో పోరాడుతామన్నారు. టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని రామారావు, దెందులూరు కృష్ణమనేని ప్రభాకర్‌్‌, నెలవల సుబ్రమణ్యం, పాశిం సునీల్‌, నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, బీజేపీ నాయకులు ఎస్‌ఎ్‌సఆర్‌ నాయుడు తదితరులు రాజధాని రైతుల వెంట నడిచారు. వెంకటగిరిలో సోమవారం  పాదయాత్రకు లభించిన ప్రజాదరణ తమలో ఉత్సహాన్ని, ధైర్యాన్ని నింపిందని అమరావతి జేఏసీ నాయకులు అన్నారు. కాగా 36వ రోజు అయిన సోమవారం మహా పాదయాత్ర 14 కి.మీ సాగింది.







Updated Date - 2021-12-07T05:41:12+05:30 IST