కోడి మేతకు కట్టడి!

ABN , First Publish Date - 2020-04-03T08:40:05+05:30 IST

కోడి మేతకు కట్టడి!

కోడి మేతకు కట్టడి!

లాక్‌డౌన్‌తో అందని సోయా.. నిలిచిన మహారాష్ట్ర దాణా

నిండుకున్న నిల్వలతో కలత.. మేపలేక అమ్మేస్తున్న వైనం


విశాఖపట్నం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : కోళ్ల రైతును కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు మాంసానికి గిరాకీ లేకపోవడంతో ధర తగ్గిపోయింది. ఇప్పుడు కోడికి మేత కరువైంది. కోళ్ల దాణాకు కీలకమైన సోయాకు కొరత రావడమే దీనికి కారణం. సోయా, మొక్కజొన్న, మరికొన్ని రకాల ముడి పదార్థాలు కలిపి కోళ్ల దాణా తయారుచేస్తారు. దీంట్లో సోయానే కీలకమైనది. అయితే లాక్‌డౌన్‌ ప్రభావంతో మహారాష్ట్ర నుంచి  సోయా రవాణా నిలిచిపోయింది. మొక్కజొన్నతో కూడిన దాణా వేస్తే తింటాయిగానీ బరువు పెరగవు. ఈ నేపథ్యంలో కోళ్ల రైతులు ఆందోళనలో ఉన్నారు. రెండున్నర నెలలపాటు అమ్మకాలు లేక కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో పడింది. పీకలలోతు నష్టాలు చవిచూడడంతో పెంపకంలో భారీ కోత వేశారు. పది వేల కోళ్లు పెంచాల్సిన చోట రెండు నుంచి మూడు వేల వరకు పిల్లలను తీసుకువచ్చారు. చికెన్‌ తింటే కరోనా వస్తుందని భయపడి దూరంగా ఉన్న ప్రజలు గడచిన పది రోజుల నుంచి మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించడంతో రేటు పెరిగింది. మార్కెట్‌ ఫర్వాలేదనుకుంటున్న సమయంలో లాక్‌డౌన్‌ వచ్చిపడింది. దీంతో సరిహద్దులు మూసుకొని బయట రాష్ట్రాల నుంచి రావాల్సిన దాణా నిలిచిపోయింది. పోనీ మొక్కజొన్న మేతగా వేద్దామంటే.. ధరలు కొండెక్కాయి. పది రోజుల క్రితం వరకు రూ.1100 వరకు వుండే మొక్కజొన్న బస్తా ఇప్పుడు రూ.1700కు చేరింది. సోయా లేకపోవడంతో దిక్కుతోచని రైతులు, కంపెనీలు ప్రస్తుతం మొక్కజొన్నపై పడ్డారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసేంత వరకు కోళ్లను బతికించుకోవాలంటే మొక్కజొన్న మేతగా వేయడం తప్పదని రైతులు అంటున్నారు.     కాగా, దాణా కొరత తలెత్తడంతో కొందరు రైతులు ఫారాల్లోని కోళ్లను ధర తగ్గించి విక్రయించేస్తున్నారు. నగరంలో కిలో రూ.150 వరకు వెళ్లిన చికెన్‌ ధర.. ఈ పరిణామంతో మళ్లీ రూ.110కు తగ్గింది. కాగా కోళ్ల ఫారాల్లో పనిచేసేందుకు కూలీలు కూడా రావడం లేదు. సమీప ప్రాంతాల నుంచి వచ్చే కూలీలను కరోనా నేపథ్యంలో ఫారాలు వుండే గ్రామాల ప్రజలు అడ్డుకుంటున్నారు. చికెన్‌, గుడ్లకు త్వరలో కొరత వచ్చే అవకాశం ఉందని  తగరపువలసకు చెందిన కోళ్ల రైతు ఒకరు వాపోయారు. 

Updated Date - 2020-04-03T08:40:05+05:30 IST