పందేరానికి సిద్ధం!

ABN , First Publish Date - 2020-04-09T09:21:51+05:30 IST

పందేరానికి సిద్ధం!

పందేరానికి సిద్ధం!

కాంట్రాక్టర్లకు రూ.300 కోట్లు

అడ్వాన్సుల రూపంలో చెల్లింపు?.. టిడ్కోలో అంతా రెడీ

లాక్‌డౌన్‌లోనూ అధికారులను రప్పించిన వైనం

పెండింగ్‌ బిల్లులు వదిలి పనులు చేయని వారికి పైసలు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కరోనా సందట్లో ‘పందేరాల’ సడేమియాకు తెరలేపారు. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ పేరిట అస్మదీయ కంపెనీలకు రూ.300 కోట్లు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. అది కూడా ఆగమేఘాలమీద అగ్రిమెంట్లు పూర్తిచేసి! ‘టిడ్కో’లో జరుగుతున్న చిత్రమిది. ఒకవైపు... కరోనాతో ఆదాయం పడిపోయిందని ఉద్యోగుల జీతాలను సగమే ఇచ్చి, మరోవైపు తమకు కావాల్సిన కంపెనీలకు అడ్వాన్సులు చెల్లిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం జీ+3 భవన సముదాయాల నిర్మాణం చేపట్టింది. టిడ్కో ద్వారా ఈ పనులు మొదలయ్యాయి. జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన కంపెనీలు ఈ కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. ఎన్నికల తర్వాత... వైసీపీ అధికారంలోకి వచ్చింది. రివర్స్‌ టెండరింగ్‌ పేరిట ఈ ఇళ్లకు మళ్లీ టెండర్లు పిలిచారు.  రివర్స్‌ టెండరింగ్‌లో భాగంగా రూ.6వేల కోట్లతో టెండర్లు ఖరారు చేశారు. ఈ లెక్కన రూ.600 కోట్లను కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సు చెల్లించవచ్చు. అందులో సగం, అంటే రూ.300 కోట్లు కట్టబెట్టేందుకు హుటాహుటిన పావులు కదిపారు. ఆగమేఘాల మీద అగ్రిమెంట్ల ప్రక్రియ పూర్తి చేయించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన ఏపీ టిడ్కో ఉన్నతాధికారులను బుధవారం విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయానికి రప్పించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... బుధవారం ఒక్కరోజులోనే కాంట్రాక్ట్‌ కంపెనీలతో అగ్రిమెంట్ల ప్రక్రియ చాలావరకు ముగిసింది. మిగిలిన దానిని గురువారం పూర్తి చేయనున్నారు. 


పాతవి తేల్చకుండానే... 

గతంలో ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో జరిగిన పలు ప్రాజెక్టులను చేపట్టిన ప్రఖ్యాత సంస్థలకు రూ.1500 కోట్ల నుంచి రూ.1800 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. వాటి ఊసెత్తకుండా అసలు పనులే ప్రారంభించని వారికి అడ్వాన్స్‌లు  చెల్లిస్తుండటం గమనార్హం. దీని వెనుక అధికార పార్టీకి చెందిన కొందరి ఒత్తిళ్లు పని చేస్తున్నట్లు తెలిసింది. మొబిలైజేషన్‌ అడ్వాన్సుల చెల్లింపునకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం గమనార్హం. దీనిపై వివరణ కోరేందుకు ఏపీ టిడ్కో ఉన్నతాధికారులను సంప్రదించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Updated Date - 2020-04-09T09:21:51+05:30 IST