ఎన్ని కుట్రలు పన్నినా అమరావతిని ముంచలేరు!

ABN , First Publish Date - 2020-10-18T09:07:22+05:30 IST

ఎన్ని కుట్రలు పన్నినా అమరావతిని ముంచలేరు!

ఎన్ని కుట్రలు పన్నినా అమరావతిని ముంచలేరు!

ఇప్పటికైనా అసత్య ప్రచారాలు ఆపాలి

305వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు


గుంటూరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహానగరం చిన్నపాటి వర్షాలకే ముంపునకు గురవుతోంది. అమరావతి చుట్టూ కృష్ణా నది ఉన్నా ఏ ఒక్క రాజధాని గ్రామంలోకైనా చుక్క నీరు వచ్చిందా అంటూ రాజధాని రైతులు వైసీపీ నేతలను నిలదీశారు. పరిపాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు  రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారానికి 305వ రోజుకు చేరాయి. అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచాలంటూ కృష్ణమ్మకు కృష్ణాయపాలెం రైతులు సారె సమర్పించి వేడుకున్నారు. అలానే, ఐనవోలు శివాలయంలో రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రులు ప్రారంభంతో దీక్షా శిబిరాల వద్ద దుర్గమ్మ ప్రతిమలు నెలకొల్పి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు ఎన్ని కుట్రలు చేసినా.. తలకిందులుగా తపస్సు చేసినా అమరావతిని ముంచలేరని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా ముంపు అంటూ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఆ దుర్గమ్మతల్లి రాక్షస సంహారం చేసి ధర్మ సంస్థాపన చేసిన విధంగా.. అమరావతి కోసం పోరాడి దానిని నిలుపుకొంటామని మహిళా రైతులు తెలిపారు.  

Updated Date - 2020-10-18T09:07:22+05:30 IST