వైద్యులకేదీ రక్షణ!

ABN , First Publish Date - 2020-04-03T09:11:05+05:30 IST

వైద్యులకేదీ రక్షణ!

వైద్యులకేదీ రక్షణ!

పీపీఈలు లేవు.. డిస్పోజబుల్‌ గౌన్లే

ఈఎన్‌టీ డాక్టర్లకే ఎన్‌-95 మాస్క్‌లు

గట్టిగా అడిగితే సస్పెండ్‌ చేస్తామని సిబ్బందికి ఉన్నతాధికారుల బెదిరింపు


అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ఇది కరోనా సమయం.. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తోటి వారిని తాకాలంటేనే జనం భయపడిపోతున్నారు. అలాంటిది ఇది అంటువ్యాధి అని.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వైరస్‌ సోకుతుందని తెలిసినా.. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది మాత్రం మానవతా దృక్పథంతో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బంది రక్షణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏపీలో కరోనా ప్రభావం మొదలై నెల కావస్తున్నా ఇంకా వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ), ఎన్‌-95 మాస్కులు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో ఎక్కడ తమకు వైరస్‌ సోకుతుందోనన్న ఆందోళనతో వైద్య సిబ్బంది భయంభయంగా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరోగ్యశాఖ అధికారులు వాటి కొనుగోలుపై దృష్టి పెట్టలేదు. విజయవాడ, తిరుపతి, నెల్లూరు, విశాఖలోని కరోనా ఆస్పత్రుల్లో ఎయిడ్స్‌ రోగులకు శస్త్రచికిత్స చేసే సమయంలో, డెలవరీల సమయంలో ఉపయోగించే సాధారణ డిస్పోజబుల్‌ గౌన్లను సిబ్బందికి ఇస్తున్నారు. దీనివల్ల పూర్తిస్థాయిలో రక్షణ ఉండదని వైద్యులు వాపోతున్నారు. ఎన్‌-95 మాస్కులు లేవని సాధారణ మాస్కులు ఇస్తున్నారు. ఈఎన్‌టీ డాక్లర్లకు మాత్రమే ఎన్‌-95 మాస్కులు, పీపీఈలు ఇస్తున్నారు. ప్రస్తుతం పాజిటివ్‌ వచ్చిన రోగులకు చికిత్స చేయడానికి ఒక డాక్టర్‌, స్టాఫ్‌నర్స్‌, ఎఫ్‌ఎన్‌వో లేదా ఎంఎన్‌వో, క్లీనింగ్‌ సిబ్బంది ఇలా నలుగురు మాత్రమే ఐసోలేషన్‌ గదిలోకి వెళ్తున్నారు. అంటే నాలుగు షిఫ్టుల్లో కలిపి 16 మంది ఉంటారు. వారికి కూడా ఎన్‌-95 మాస్కులు, పీపీఈలు ఇవ్వడంలేదు. ఐసొలేషన్‌ వార్డుల్లోకి వెళ్లే సిబ్బందికి త్రీ లేయర్‌, సాధారణ గౌన్లను మాత్రమే ఇస్తున్నారు. 16 మంది సిబ్బందికి కలిపి 2 కిట్లు మాత్రమే ఇస్తున్నారు. వాటిలో 12 గౌన్లు మాత్రమే ఉంటాయి. విజయవాడ, విశాఖ లాంటి చోట్ల ఈ పరిస్థితిపై గట్టిగా ప్రశ్నించిన సిబ్బందిని సస్పెండ్‌ చేస్తామని డీఎంఈ, సూపరింటెండెంట్లు బెదిరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


కళ్లు తెరవని కార్పొరేషన్‌..

రాష్ట్రంలో మార్చి నుంచే కరోనా నివారణ చర్యలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి  రాష్ట్రంలో ఎన్‌-95 మాస్కులు, పీపీఈ కొరత ఉంది. ఈ విషయాన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, డీఎంఈ అధికారులు అనేకసార్లు కార్పొరేషన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. కానీ వారు మాత్రం ఆర్డర్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారు. ఒకవైపు ఐసొలేషన్‌ వార్డుల్లో ఎన్‌-95, పీపీఈలు లేవని వైద్యులు ఆందోళన చెందుతుంటే.. డీహెచ్‌, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో ఐసొలేషన్‌ వార్డులు లేవు కాబట్టి అక్కడ సిబ్బందికి క్లాత్‌ మాస్కులు సరిపోతాయని ఉన్నతాధికారులు స్పష్టంగా చెబుతున్నారు. ఏపీవీవీపీ కమిషన్‌ ఓ అడుగు ముందుకేసి హెచ్‌డీఎస్‌ ఫండ్స్‌ నుంచి క్లాత్‌ మాస్కులు, బ్లూ కలర్‌ డ్రెస్‌లు కుట్టించి వైద్యులకు అందించాలని సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీచేశారు. సాధారణంగా కరోనా అనుమానితులు తొలుత దగ్గరల్లోని ఆస్పత్రులను ఆశ్రయిస్తారు. వారిని పరీక్షించే వైద్యులు క్లాత్‌ మాస్క్‌లు వాడడం వల్ల వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది. కాబట్టి పీహెచ్‌సీ, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో కొంత మందికైనా ఎన్‌-95, పీపీఈలు ఇవ్వాలని వైద్యులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2020-04-03T09:11:05+05:30 IST