అమరావతి: రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోజుకొక రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. అమరావతి పరిరక్షణ కోసం రైతులు చేస్తున్న ఉద్యమం 352వ రోజు కొనసాగుతోంది. మంగళగిరి మండలం, కృష్ణాయపాలెంలో రాజధాని రైతులు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు ‘నేను ఉన్నాను అని అప్పుడు అన్నారండి.. ఇప్పుడు జగన్ చూడ్డంలేదు, వినడంలేదు.. మాట్లాడడంలేదని’ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం అడుగుతుంటే సంకేళ్లు వేశారన్నారు. అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్ది ఆనాడు రాజధాని కోసం 30వేల ఎకరాలు కావాలని చెప్పారని, అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారన్నారు. ఏపీ రాజధానిగా అమరావతే కావాలని, అంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు.