Abn logo
Sep 22 2021 @ 21:02PM

రాహుల్‌కు, ప్రియాంకకు అనుభవం లేదు: కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన నాటి నుంచి మౌనంగానే ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్.. బుధవారం ఒక్కసారిగా తన ఆగ్రహాన్ని వెల్లడించారు. సిద్ధూని పంజాబ్ ముఖ్యమంత్రిని కానివ్వను అంటూ ఓ వైపు చెప్తూనే కాంగ్రెస్ హై కమాండ్‌పై సున్నిత విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతలైనా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు రాజకీయంగా అనుభవం లేదని, వారిని సలహాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.


మరో ఆరు నెలల పదవీ కాలం ఉండగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. నిజానికి మూడు వారాల క్రితం తన రాజీనామా గురించి సోనియాకు వివరించే క్రమంలో ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ సోనియా సూచించినట్లు సమాచారం. అయితే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ మనసు మార్చుకునే ప్రసక్తే లేదని అమరీందర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.


‘‘వాళ్లు దిగిపొమ్మన్నారు, నేను దిగిపోయాను. ఒక సైనికుడిగా నా పని ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు’’ అన్న అమరీందర్ ఇంకా మాట్లాడుతూ ‘‘ఎమ్మెల్యేల్ని విమానాల్లో గోవాకు తీసుకెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాకు అలాంటివి తెలియవు. గమ్మిక్కిలు, అడ్డదారుల్లో నేను వెళ్లను. గాంధీ వారసులకు నా విధానం ఏంటో తెలుసు. కాకపోతే రాహుల్, ప్రియాంకలకు అంతగా అనుభవం లేదు. సలహాదారులు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption