మళ్లీ అమరీందరే పంజాబ్ సీఎం: కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-08-26T02:13:20+05:30 IST

మరో బృందం పంజాబ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పర్గట్ సింగ్‌ను తాజాగా కలిసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ కావాలని ఆ బృందం కోరినట్లు సమాచారం. పంజాబ్‌లో ఎప్పటి నుంచో అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్నాయి..

మళ్లీ అమరీందరే పంజాబ్ సీఎం: కాంగ్రెస్

చండీగఢ్: వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే ఎదుర్కోబోతున్నట్లు, మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి కెప్టెనేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జీ హరీష్ రావత్ తెలిపారు. మంగళవారం 34 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం అమరీందర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని హరీష్ రావత్‌కు విజ్ణప్తి చేసిన మరుసటి రోజే ఇంత పెద్ద ప్రకటన రావడం పట్ల పార్టీలో పెద్ద చర్చకు దారి తీసింది.


‘‘వచ్చే ఎన్నికలకు నాయకత్వం వహించి కాంగ్రెస్ పార్టీని అమరీందర్ గెలిపిస్తారు. పని సరిగా జరగడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. అన్ని సమస్యలు త్వరలోనే సర్ధుమనుగుతాయి. ఎన్నికల్లోపు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఎమ్మెల్యేల బృందం చేసిన విజ్ణప్తిని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్తాను’’ అని రావత్ అన్నట్లు సమాచారం. అయితే పంజాబ్‌ సీఎంగా మళ్లీ అమరీందరే ఉండబోతున్నారని ఎమ్మెల్యేలతో రావత్ తేల్చి చెప్పారట.


కాగా, మరో బృందం పంజాబ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పర్గట్ సింగ్‌ను తాజాగా కలిసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ కావాలని ఆ బృందం కోరినట్లు సమాచారం. పంజాబ్‌లో ఎప్పటి నుంచో అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్నాయి. అయితే ఈసారి కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్‌లా మారిపోయేలా ఉంది. సీఎం అమరీందర్ వర్గం, పంజాబ్ కాంగ్రెస్ అధినేత సిద్ధూ వర్గాల మధ్య తరుచూ ఏవో వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ఎక్కువ కాలం సమయం లేకపోవడం.. ప్రస్తుత పరిస్థితి తొందరలో కొలిక్కి వచ్చేలా కనిపించకపోవడం కాంగ్రెస్‌కు చేదు అనుభవాల్ని ఇవ్వొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

Updated Date - 2021-08-26T02:13:20+05:30 IST