Abn logo
Sep 26 2021 @ 00:14AM

కొలువుతీరిన జడ్పీ పాలక మండలి

జడ్పీ చైర్మనగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆకేపాటి అమరనాథరెడ్డి

చైర్మన్‌గా ఆకేపాటి అమరనాథరెడ్డి

వైస్‌ చైర్మన్లుగా శారద, బాలయ్య

కోఆప్షన్‌ సభ్యులుగా కరీముల్లా, అన్వర్‌బాషా

ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయరామరాజు 

కడప(ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 25 : రెండేళ్ల తరువాత జిల్లా పాలక మండలి కొలువుతీరింది. జడ్పీ చైర్మన్‌గా ఆకేపాటి అమరనాథరెడ్డికి పట్టాభిషేకం చేశారు. శనివారం జిల్లా పరిషత్‌ సభాభవన్‌లో ఎన్నికల పరిశీలకులు బీఎం దివాన్‌మైదీన్‌ పర్యవేక్షణలో జడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం, జిల్లాపరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కోఅప్షన్‌ సభ్యుల ఎన్నిక జడ్పీ ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయరామరాజు అధ్యక్షతన జరిగాయి. జిల్లాలో 50 స్థానాలకు గాను బ్యాలెట్‌ పేపర్లు తడిచిపోవడంతో జమ్మలమడుగు జడ్పీటీసీ ఎన్నిక వాయిదా వేశారు. లింగాల జడ్పీటీసీ మృతిచెందారు. దీంతో 48 మంది చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మొదట రాజుపాళెంకు చెందిన జడ్పీటీసీ సభ్యురాలు జె.అంజనీకుమారి ప్రమాణస్వీకారం చేశారు. చివరగా ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుడు అమరనాథరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. 10 నుంచి 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 12 గంటల నుంచి 1 గంట మధ్య ఉపసంహరణకు గడువిచ్చారు. ఖాజీపేటకు చెందిన ఎ.కరీముల్లా, రైల్వేకోడూరుకు చెందిన షేక్‌ అన్వర్‌బాషా మాత్రమే నామినేషన్లు వేశారు. పోటీ లేకపోవడంతో వారిద్దరిని కో-ఆప్షన సభ్యులుగా పరిగణిస్తున్నట్లు మధ్యాహ్నం 1 గంటకు కలెక్టర్‌ ప్రకటించారు. వీరిచేత కూడా ప్రమాణస్వీకారం చేయించారు.


చైర్మన్‌ ఎన్నిక 

మధ్యాహ్నం 3 గంటలకు చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నికను ప్రారంభించారు. ప్రమాణస్వీకారం అనంతరం 45 మంది జడ్పీటీసీ సభ్యులు ఉండడంతో కోరం ఉన్నట్లు జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. జడ్పీ చైర్మన్‌గా ఆకేపాటి అమరనాథరెడ్డి పేరును రామాపురం జడ్పీటీసీ సభ్యుడు ఎం.వెంకటరమణ ప్రతిపాదించగా వేంపల్లె జడ్పీటీసీ సభ్యుడు ఎం.రవికుమార్‌రెడ్డి బలపరిచారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో అమరనాథరెడ్డి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వైస్‌చైర్‌పర్సన్‌ -1గా ప్రొద్దుటూరు జడ్పీటీసీ సభ్యురాలు జె.శారదను, రాజుపాళెం జడ్పీటీసీ సభ్యురాలు అంజనీకుమారి ప్రతిపాదించగా, ఎర్రగుంట్ల జడ్పీటీసీ సభ్యుడు టి.బాలయ్య బలపరిచారు. అలాగే వైస్‌చైర్మన్‌-2గా పెండ్లిమర్రి జడ్పీటీసీ సభ్యుడు పిట్టు బాలయ్యను సీకేదిన్నె జడ్పీటీసీ సభ్యుడు నరేన్‌ రామానుజులరెడ్డి ప్రతిపాదించగా వల్లూరు జడ్పీటీసీ సభ్యుడు వెంకటసుబ్బయ్య బలపరిచారు. సభ్యులందరూ ఆమోదం తెలపడంతో జిల్లాపరిషత్‌ చైర్మన్‌గా అమరనాథరెడ్డి, వైస్‌చైర్మన్లుగా శారద, బాలయ్య ఎన్నికైనట్లు కలెక్టర్‌ ప్రకటించారు. అనంతరం వీరితో కలెక్టర్‌ ప్రమాణస్వీకారం చేయించి ధ్రువీకరణ పత్రాలు అందించారు.


ప్రమాణస్వీకారోత్సవంలో పదనిసలు

జడ్పీటీసీల ప్రమాణస్వీకారంలో పదనిసలు చోటుచేసుకున్నాయి. కొందరు సొంతంగా ప్రమాణస్వీకారం చేస్తే మరికొందరు జడ్పీ సిబ్బంది చెబుతుంటే ప్రమాణస్వీకారం చేశారు. గాలివీడు జడ్పీటీసీ సభ్యురాలిగా 85 ఏళ్ల వయస్సున్న షేక్‌భాను ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె తెలుగులో రూపొందిన ప్రమాణాన్ని చదవలేకపోయారు. అలాగే చక్రాయపేట జడ్పీటీసీ సభ్యుడు టి.శివప్రసాద్‌రెడ్డి ప్రమాణస్వీకారం చివర్లో జై జగన్‌ అంటూ ముగించారు. ప్రమాణస్వీకారం కార్యక్రమం 39 నిమిషాల్లో ముగిసింది. జడ్పీటీసీ సభ్యుల్లో కొంత మంది నిరక్షరాస్యులు ఉన్నారు.


కొవిడ్‌ నిబంధనలు గాలికి

జడ్పీ పాలక మండలి ప్రమాణస్వీకారం సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలంటూ అధికారులు ఆదేశాలిచ్చారు. పలుమార్లు సభ్యులందరూ మాస్కుపెట్టుకోవాల్సిందంటూ సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ మాస్క్‌ పెట్టుకోవాలంటూ సూచిస్తూ కనిపించారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం మాస్కులు పెట్టుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. ప్రమాణస్వీకారోత్సవానికి డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ప్రభుత్వ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, జకియాఖానం, రమేష్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేడా మల్లిఖార్జునరెడ్డి హాజరయ్యారు. అయితే వీరులో ఇద్దరుముగ్గరు మాత్రమే మాస్కులు పెట్టుకున్నారు.


ఆదర్శ జిల్లాగా నిలుపుతా

- జడ్పీ చైర్మన ఆకేపాటి అమరనాథరెడ్డి

ముఖ్యమంత్రి ఆశీస్సులు, సూచనలు, జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా నిలుపుతానని జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి వెల్లడించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలకు జనం జైకొడుతున్నారన్నారు. ఎంపీ అవినాశరెడ్డి మాట్లాడుతూ జడ్పీచైర్మన్‌ అమరనాథరెడ్డి క్లిష్టపరిస్థితుల్లో కూడా జగన్‌ వెంట నడిచారన్నారు. డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. అమరనాథరెడ్డి రాజకీయ జీవితం ప్రతి వైసీపీ కార్యకర్తకు ఆదర్శంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ అమరనాథరెడ్డి ఎన్నిక కావడంపట్ల సామాన్య కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.