‘అమరరాజా’ ఉద్యోగులకు.. కరోనా కాలంలో ప్రత్యేకంగా హెల్త్ స్క్రీనింగ్ యాప్

ABN , First Publish Date - 2020-05-16T00:08:06+05:30 IST

కరోనా కాలంలో తమ సంస్థలో పనిచేసే దాదాపు 16వేల మంది ఉద్యోగుల హెల్త్ స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు అమరరాజా గ్రూప్ ప్రకటించింది.

‘అమరరాజా’ ఉద్యోగులకు.. కరోనా కాలంలో ప్రత్యేకంగా హెల్త్ స్క్రీనింగ్ యాప్

తిరుపతి: కరోనా కాలంలో తమ సంస్థలో పనిచేసే దాదాపు 16వేల మంది ఉద్యోగుల హెల్త్ స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు అమరరాజా గ్రూప్ ప్రకటించింది. ఈ వెబ్ యాప్ ఆన్‌లైన్ స్క్రీనింగ్ సాధనంగా ఉపయోగపడుతుంది. కరోనా గురించి ఎటువంటి సమాచారం కావాలన్నీ దీనిలో లభిస్తుంది. అలాగే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ), ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూ‌హెచ్‌వో), ఆరోగ్య మంత్రిత్వశాఖ(జీఓఐ) అందించిన మార్గదర్శకాలను కూడా ఉద్యోగులకు అందుబాటులో ఉంచుతుంది. ‘అమరరాజా పీపుల్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టం’(ఏఆర్‌పీఎస్‌ఎమ్‌ఎస్) అనే ఈ వెబ్‌ యాప్‌ను డాక్సివా వారి సహకారంతో అభివృద్ధి చేశారు. సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ప్రతిరోజూ ఈ యాప్‌లో కనిపించే ప్రశ్నలకు సమాధానాలు పొందుపరచాలి. తద్వారా వారందరి ఆరోగ్యపరిస్థితిపై ఓ అంచనాకు రావచ్చు. దీని ఆధారంగా ఉద్యోగులకు ఆటోమేటిక్‌గా ఈ-వర్క్ పాస్ లభిస్తుంది. ఈ సందర్భంగా అమరరాజా గ్రూప్ ప్రెసిడెంట్ గల్లా విజయనాయుడు స్పందిస్తూ.. ‘మా సంస్థ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. కొత్తగా సిద్ధం చేసిన యాప్, అలాగే గతంలో రెడీ చేసిన WE@AR డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా ఉద్యోగులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Updated Date - 2020-05-16T00:08:06+05:30 IST