కరోనాతో సేల్స్ పడిపోయాయనుకున్నారా.. ఒక్కసారి ఈ లెక్కలు చూడండి..!

ABN , First Publish Date - 2020-10-21T22:07:06+05:30 IST

కరోనా నేపథ్యంలో సగటు జీవి ఆర్థిక పరిస్థితి కోలుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ ఈ-కామర్స్ కంపెనీల ఆఫర్ల కోసం జనం ఎగబడ్డారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సేల్స్‌లో...

కరోనాతో సేల్స్ పడిపోయాయనుకున్నారా.. ఒక్కసారి ఈ లెక్కలు చూడండి..!

నాలుగు రోజుల్లో రూ.26,000 కోట్ల అమ్మకాలు

పండుగ సేల్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రికార్డ్

కరోనా నేపథ్యంలో సగటు జీవి ఆర్థిక పరిస్థితి కోలుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ ఈ-కామర్స్ కంపెనీల ఆఫర్ల కోసం జనం ఎగబడ్డారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సేల్స్‌లో రికార్డ్ స్థాయి అమ్మకాలే ఇందుకు సాక్ష్యం. బిగ్‌బిలియన్ డేస్‌తో ఫ్లిప్‌కార్ట్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ పేరుతో అమెజాన్ తీసుకొచ్చిన పండుగ ఆఫర్లకు ఆశించిన స్పందనే వచ్చింది. సేల్స్ మొదలైన నాలుగు రోజుల్లోనే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌.. రెండింటిలో కలిపి రూ.26,000 కోట్ల అమ్మకాలు జరిగినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేశాయి. అక్టోబర్ 15 నుంచి 22 వరకూ అందుబాటులో ఉన్న ఈ సేల్స్‌లో అమ్మకాలు 4.7 బిలియన్ డాలర్లు చేరుకోవచ్చనేది ట్రేడ్ వర్గాల అంచనా.


అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ మాట్లాడుతూ.. ఈ సేల్‌లో భాగంగా మొత్తం 1,100 రకాల కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ సేల్‌లో అత్యధికంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అమ్ముడుపోయినట్లు ఆయన చెప్పారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలైన 48 గంటల్లో లక్షా 10,000 ఆర్డర్లు వచ్చినట్లు తెలిపారు. ఇందులో.. 66 శాతం ఆర్డర్లు చిన్నచిన్న పట్టణాల నుంచి వచ్చినవే అని వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఇప్పటివరకూ జరిగిన సేల్‌లో సగానికి పైగా ఉత్పత్తులు వర్క్ ఫ్రం హోం విభాగంలోనివేనని వెల్లడించారు. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. నాలుగు రోజుల సేల్‌లో ఈ-కామర్స్ కంపెనీలు 25 నుంచి 30 శాతం పుంజుకున్నట్లు తెలిపారు. గత సంవత్సరం ప్రకటించిన ఇదే తరహా వార్షిక అమ్మకాల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20,000 కోట్ల అమ్మకాలు జరిగాయి.

Updated Date - 2020-10-21T22:07:06+05:30 IST