ఎయిర్‌టెల్‌పై అమెజాన్ ఆసక్తి

ABN , First Publish Date - 2020-06-05T05:59:41+05:30 IST

దేశీయ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో వాటా కొనుగోలుకు అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌టెల్‌లో 5 శాతం వాటాను రూ.15,000 కోట్లకు కొనుగోలు చేసే అవకాశం...

ఎయిర్‌టెల్‌పై అమెజాన్ ఆసక్తి

  • 5శాతం వాటా కొనుగోలుకు సన్నాహాలు
  • డీల్‌ విలువ రూ.15,000 కోట్లు ?


న్యూఢిల్లీ: దేశీయ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో వాటా కొనుగోలుకు అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌టెల్‌లో 5 శాతం వాటాను రూ.15,000 కోట్లకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇరువర్గాల మధ్య ప్రాథమిక చర్చలు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు అమెజాన్‌ నిరాకరించింది. ఎయిర్‌టెల్‌ సైతం అదేం లేదని అంటోంది. ‘మా వినియోగదారులకు అత్యుత్తమ వీడియో కంటెంట్‌ తదితర సేవలను అందించేందుకు మా కంపెనీ నిత్యం డిజిటల్‌, ఓటీటీ ప్లేయర్స్‌తో కలిసి పనిచేస్తుంటుంది. అంతకుమించి వెల్లడించడానికి ఏమీ లేద’ని కంపెనీ పేర్కొంది.


ఎయిర్‌టెల్‌కు కలిసొచ్చే డీల్‌

దేశంలో మూడో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఎయిర్‌టెల్‌కు 30 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. నాలుగేళ్ల క్రితం దేశంలో నెం.1 టెలికాం కంపెనీగా ఉన్న ఎయిర్‌టెల్‌కు.. రిలయన్స్‌ జియో ఎంట్రీతో కష్టాలు మరింత పెరిగాయి. క్రమంగా మార్కెట్‌ వాటాను కోల్పోతూ వచ్చింది. ఫేస్‌బుక్‌ సహా పలు అంతర్జాతీయ కంపెనీల ఇన్వె స్ట్‌మెంట్లతో మరింత బలోపేతమవుతున్న జియో తో పోటీపడేందుకు ఎయిర్‌టెల్‌కు అమెజాన్‌ వంటి టెక్‌ దిగ్గజ పెట్టుబడులు ఎంతైనా అవసరమని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. 


టెలికాంలో పోటీ మరింత తీవ్రం?  

భారత టెలికాం మార్కెట్లోకి ప్రవేశించేందుకు అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలు తహతహలాడుతున్నాయి. ఫేస్‌బుక్‌ ఇప్పటికే జియోలో రూ.43 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో 10 శాతం వాటా దక్కించుకుంది. మైక్రోసాఫ్ట్‌ సైతం జియోలో వాటాపై ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది. దాంతో గూగుల్‌.. వొడాఫోన్‌ ఐడియాలో వాటా కోసం ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు నెలకొన్నాయి. తాజాగా అమెజాన్‌ కూడా ఈ జాబితాలోకి చేరింది. ఈ టెక్‌ దిగ్గజాల పెట్టుబడుల దన్నుతో మున్ముందు టెలికాం కంపెనీల మధ్య పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. వాటి సేవల విస్తరణకూ దోహదపడనుందంటున్నారు. 


షేరు జూమ్‌ 

గురువారం బీఎ్‌సఈలో ట్రేడింగ్‌ ముగిసేసరికి ఎయిర్‌టెల్‌ షేరు ధర 3.89 శాతం ఎగబాకి రూ.573.15కు చేరుకుంది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.3.12 లక్షల కోట్లకు పెరిగింది. 


భారత్‌పై అమెజాన్‌ ప్రత్యేక దృష్టి

అమెజాన్‌కు అత్యంత కీలక మార్కెట్లలో భారత్‌ ఒకటి. దేశంలో ఈ-కామర్స్‌ సేవలను విస్తరించేందుకు కంపెనీ ఇప్పటికే 650 కోట్ల డాలర్ల పెట్టుబడులను ప్రకటించింది. అంతేకాదు, అలెక్సా పేరుతో వాయిస్‌ యాక్టివేటెడ్‌ ఇంటరాక్టివ్‌ స్పీకర్లు, అమెజాన్‌ ప్రైమ్‌ పేరుతో వీడియో స్ట్రీమింగ్‌ ఇంకా మొబైల్‌ వ్యాలెట్‌, క్లౌడ్‌ సేవలు సైతం అందిస్తోంది. 130 కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్‌లో ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు  టెలికాం రంగ ప్రవేశ ప్రయత్నాలూ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది.  


11న భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ బోర్డు భేటీ 

ఇండస్‌ టవర్స్‌తో విలీనంపై తుది నిర్ణయం తీసుకునేందుకు భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ బోర్డు ఈ నెల 11న సమావేశం కానుంది. విలీనం పూర్తవుతుందా లేదా అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ విలీన ప్రక్రియ నుంచి ఏ క్షణమైనా తప్పుకునేందుకు లేదా ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు ఇరు వర్గాలకు హక్కుం ది. ముగ్గురి భాగస్వామ్యంతో ఏర్పాటైన ఇండస్‌ టవర్స్‌లో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌కు 42 శాతం వాటా ఉంది. బ్రిటిష్‌ టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ పీఎల్‌సీ 42 శాతం, వొడాఫోన్‌ ఐడియా ఇండియా 11.15 శాతం వాటా కలిగి ఉన్నాయి. 


Updated Date - 2020-06-05T05:59:41+05:30 IST