ఆమ్‌బడ్స్‌మన్

ABN , First Publish Date - 2020-03-26T05:30:00+05:30 IST

నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఐస్ ల్యాండ్... ఈ నాలిగింటిని శ్కాండినేవియన్ దేశాలంటారు. ఇవి సుపరిపాలనకు పేరందిన దేశాలు. సహకార ప్రాతిపదికపై నవ సంఘ...

ఆమ్‌బడ్స్‌మన్

శ్కాండినేవియన్ దేశాలలో అవినీతి నిర్మూలనకు ఒక కొత్త పద్ధతిని అవలంభించారు. సరాసరి పార్లమెంటుకు మాత్రమే ఉత్తరవాది కాగల పద్ధతిపై ఒక ఉన్నతోద్యోగిని ‘ఆమ్‌బడ్స్‌మన్’ అనే పేరుతో నియమించడమే ఈ కొత్త పద్ధతి.


నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఐస్ ల్యాండ్... ఈ నాలిగింటిని శ్కాండినేవియన్ దేశాలంటారు. ఇవి సుపరిపాలనకు పేరందిన దేశాలు. సహకార ప్రాతిపదికపై నవ సంఘ నిర్మాణం వీటి పరమ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో అవి చాలవరకు విజయాన్ని సాధించాయి.


జాతీయాభ్యున్నతికి ఎవరేమి ప్రయత్నాలు చేసినా, పథకాలను అమలుపరిచినా, అవినీతికి తావులేని సుపరిపాలన ముఖ్యావసరం. లేకపోతే, ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నట్టు ధనవంతులు మరింత ధనికులు కావడం, పేదవారు మరింత పేదరికంలో పడిపొవటం తటస్థిస్తుంది. శ్కాండినేవియన్ దేశాలలో అవినీతి అసలే లేదనలేము గాని, ఇతర చోట్ల కానవచ్చే దాని కంటే చాలా తక్కువ. తక్కిన దేశాలతో పోల్చినప్పుడు తమ దేశాలలో అవినీతి తక్కువన్న సంతృప్తితో దాన్ని శ్కాండినేవియన్ నాయకులు నిర్లక్ష్యం చేయడం లేదు. సమూలంగా దాన్ని రూపుమాపడానికి నిరంతరం యత్నిస్తున్నారు. శ్కాండినేవియన్ దేశాలలో అవినీతి నిర్మూలనకు ఒక కొత్త పద్ధతిని అవలంభించారు. సరాసరి పార్లమెంటుకు మాత్రమే ఉత్తరవాది కాగల పద్ధతిపై ఒక ఉన్నతోద్యోగిని ‘ఆమ్‌బడ్స్‌మన్’ అనే పేరుతో నియమించడమే ఈ కొత్త పద్ధతి.


ఎవరైనా సరే ఈ ప్రత్యేకాధికారికి ఫిర్యాదు చేసుకోవచ్చు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఫిర్యాదు చేసుకోవాలంటే, అతని లేఖను జైలు అధికారులు ‘సెన్సార్’ చేయరాదు. తనకు ఫిర్యాదు చేయకపోయినా, ఎవరికైనా అన్యాయం జరిగినట్టు విన్నా, ఎవరైనా అవినీతికి పాల్పడినట్టు తెలిపినా, తనంతగా ఆయన ఆ విషయాన్ని గురించి దర్యాప్తు చేయవచ్చు. దేశ రక్షణకు, భద్రతకు సంబంధించిన రహస్య పత్రాలు మినహాగా, తన దర్యాప్తుకు అవసరమైన అన్ని రికార్డులను ఆయన పరిశీలించవచ్చు. శాసనాలలో గాని లోపాలున్నట్టు తన దర్యాప్తుల సందర్భంలో ఆయనకు కానవస్తే వాటి తొలగింపుకు చర్య గైకొనవలసిందిగా ఆయన పార్లమెంటుకు నివేదించవచ్చు. సాక్ష్య మివ్వడానికి రావలసిందిగా ఎవనికైనా సరే సమనులు పంపడానికి ఆయనకు హక్కువున్నది. స్వయంగా ‘డిఫెన్స్’ పెట్టుకొనలేని వారికి న్యాయవాదుల ఖర్చులను ప్రభుత్వమే భరించాలని చెప్పడానికి సయితం ఆయనకు అధికారం వున్నది.


శ్కాండినేవియన్ దేశాలలోని ‘ఆమ్‌బడ్స్‌మన్’ నియామకం పద్ధతి సత్ఫలితాల నిస్తున్నదని న్యూజిలాండ్ దాన్ని అనుసరిస్తున్నది. ఇది మన దేశానికి కూడా పూర్తిగా అనుసరణీయమని మా నమ్మకం. నిజానికి ఈ విషయంలో మనం అకారణంగా ఆలస్యం చేసినామేమో!

1963 అక్టోబర్ 10 ఆంధ్రజ్యోతి సంపాదకీయం

‘ఆమ్‌బడ్స్‌మన్’ నుంచి

Updated Date - 2020-03-26T05:30:00+05:30 IST