అంబరాన ‘శంబర’ం

ABN , First Publish Date - 2021-01-27T05:25:28+05:30 IST

శంబర పోలమాంబ సిరిమానోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. పోలీసుల మూడంచెల భద్రత మధ్య సంప్రదాయబద్ధంగా సిరిమాను ఊరేగింపు మొదలైంది. చివరి వరకు అమ్మవారి నామస్మరణ నడుమ భక్తుల కోలాహలంతో ముందుగా సాగింది

అంబరాన ‘శంబర’ం
శంబర గ్రామంలో ఊరేగింపు సమయంలో భక్తుల కోలాహలం

పటిష్టభద్రత మధ్య సిరిమానోత్సవం 

అడుగడుగునా కొవిడ్‌ ఆంక్షలు

కాలినడకనే శంబర చేరుకున్న భక్తులు

లక్ష మందికి పైగా దర్శనం

రెండు గంటలు ఆలస్యంగా సిరిమాను ఊరేగింపు

మక్కువ/ సాలూరు/ సాలూరు రూరల్‌, జనవరి 26: శంబర పోలమాంబ సిరిమానోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. పోలీసుల మూడంచెల భద్రత మధ్య సంప్రదాయబద్ధంగా సిరిమాను ఊరేగింపు మొదలైంది. చివరి వరకు అమ్మవారి నామస్మరణ నడుమ భక్తుల కోలాహలంతో ముందుగా సాగింది. సిరిమానోత్సవ సమయానికి భక్తులు వెల్లువలా తరలివచ్చారు. లక్ష మందికి పైగా ఉత్సవాన్ని తిలకించినటు దేవస్థానం ఈవో ఎల్‌.నగేష్‌ తెలిపారు. ఊరేగింపు ప్రారంభించడంలో జాప్యం జరిగింది. తొలుత మధ్యాహ్నం2గంటలకు ప్రారంభి స్తామని ఈవో చెప్పారు. రెండు గంటలు ఆలస్యంగా సాయంత్రం నాలుగు గంటలకు మొదలైంది. ఈ ఏడాది 35 అడుగుల సిరిమానును సిద్ధం చేశారు. తొలుత గ్రామ వీధుల్లో అమ్మవారి ఘటాలను ఊరేగించారు. వాటికి భక్తులు పూజలు చేశారు. అనంతరం జన్ని పేకాపు రామారావు సిరిమానును అధిరోహించారు. ఆయనను చదురుగుడి నుంచి సాడేపు కుటుంబీకులు భుజాలపై మోసుకు వచ్చి సిరిమానుపై కూర్చొండబెట్టారు. ఆసమయానికి మంగళ వాయిద్యాల మధ్య ఘటాలు సిరిమాను దగ్గరకు చేరుకున్నాయి. ఘటాలతో కలిసి సిరిమాను తొలుత గిరడ వారింటికి వెళ్లింది. అక్కడ పూజలయ్యాక కుప్పిలి, పూడి వారిళ్లకు సిరిమాను చేరుకుంది. వీరి పూజలయ్యాక ఘటాలు దక్షిణ దిక్కుగా, సిరిమాను తూర్పు దిక్కుగా వెళ్లాయి. ఘటాలు, సిరిమాను మళ్లీ పణుకు వీధిలో కలుసుకున్నాయి. అక్కడ పొడిపిరెడ్డి కుటుంబీకులు, తీళ్ల వారి వారసులుగా అక్యాన కుటుంబీకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిరిమాను వెనక్కు వచ్చి గొల్లవీధి, కొత్తవీధి మీదుగా పెద్దమ్మ గుడి వద్దకు చేరింది. అక్కడి నుంచి వెనుతిరిగి నడివీధికి చేరుకొని ఆగిపోయింది. సిరిమానోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓఎస్డీ ఎన్‌.సూర్యచంద్రరావు, డీఎస్సీ సుభాష్‌ ఆధ్వర్యంలో పోలీసులు రోప్‌పార్టీతో పాటు భారీ భద్రత కల్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఐటీడీఏ పీవో రోణంకి కూర్మనాథ్‌, సబ్‌ కలెక్టర్‌ విధేఖరేల పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. 

కాలినడకన భక్తులు

కొవిడ్‌ ఆంక్షల నడుమ జాతర జరిగింది. భక్తుల రద్దీని నియంత్రించడానికి బస్సులు, ఆటోలు తదితర వాహనాలను నిలువరించారు. వాహన సౌకర్యం లేకపోయినా మక్కువ, మామిడిపల్లి తదితర ప్రాంతాల వరకు ఆటోలు, బస్సులు, జీపుల్లో భక్తులు చేరుకున్నారు. అక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్ల వరకు నడిచారు. సిరిమానోత్సవం జరిగే సమాయానికి భక్తుల సంఖ్య దాదాపు లక్షకు దాటింది. ఉదయం అమ్మవారి దర్శనానికి స్వల్పసంఖ్యలో భక్తులు వచ్చారు. పది గంటల తరువాత రద్దీ పెరిగింది. సిరిమానోత్సవ సమయానికి శంబర వీధులు సందడిగా, రద్దీగా కనిపించాయి. శంబరకు పెద్దసంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ కరోనా నిబంధనల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి 15 వేల మందిలోపు హాజరయ్యారని, 9 వేల లడ్డు ప్రసాదం, మూడు వేల పులిహోర  పొట్లాలు విక్రయించామని ఈవో లక్ష్మీనగేష్‌ తెలిపారు. 



Updated Date - 2021-01-27T05:25:28+05:30 IST