జీవనసంధ్యలో అంబేడ్కర్

ABN , First Publish Date - 2020-12-04T05:35:45+05:30 IST

‘ఇవాళ దళిత సమాజం (ఉప)కుల చీలికలతో రోగగ్రస్తమైంది. అంబేడ్కర్ ప్రారంభించిన దళిత చైతన్య ప్రస్థానం ముందుకు పోవడానికి బదులు వెనక్కి పోతున్నట్టుగా కనపడుతున్నది.ఇది అంబేడ్కర్ వాదులందరినీ....

జీవనసంధ్యలో అంబేడ్కర్

‘ఇవాళ దళిత సమాజం (ఉప)కుల చీలికలతో రోగగ్రస్తమైంది. అంబేడ్కర్ ప్రారంభించిన దళిత చైతన్య ప్రస్థానం ముందుకు పోవడానికి బదులు వెనక్కి పోతున్నట్టుగా కనపడుతున్నది.ఇది అంబేడ్కర్ వాదులందరినీ కలవరపరచాల్సిన విషయం’


బాబాసాహెబ్ అంబేడ్కర్ తన జీవిత ప్రస్థానం ఆఖరి రోజులలో చాలా ఆవేదనకు గురయ్యారు. అనారోగ్యంతో బాధపడుతూనే పట్టుదలతో బౌద్ధ ధర్మం గురించిన తన ఉద్గ్రంథ రచనను పూర్తి చేశారు. ఇదే కాలంలో దేశ రాజకీయాలు ఆయనకు తీవ్ర నిరాశా నిస్పృహలు కలిగించాయి. 1952లో మొదటి సార్వత్రక ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.


1954 మేలో ఒక ఉపఎన్నికలో పోటీ చేసి మళ్ళీ ఓడిపోయారు. ఈ రెండుసార్లూ రిజర్వుడు నియోజక వర్గాల నుంచే అంబేడ్కర్ పోటీ చేశారు. ఈ పరిణామాల తర్వాత పార్లమెంటు, శాసనసభల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్లను రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు 1955 డిసెంబరు 27న ఎస్సీ ఫెడరేషన్ అఖిలభారత మహాసభ తీర్మానం ఆమోదించింది. తాను స్థాపించిన పార్టీ ఎస్సీ ఫెడరేషన్‌ని రద్దు చేస్తూ 1956 అక్టోబర్ 14న నిర్ణయం తీసుకున్నారు. కులం ప్రస్తావన లేని రిపబ్లికన్ పార్టీ స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అది రూపుదాల్చకముందే మరణించారు.


1956 మార్చి 18న ఆగ్రాలో అంబేడ్కర్ ఒక ఉపన్యాసం ఇచ్చారు. చివరిదశలో ఆయన చేసిన ముఖ్య ఉపన్యాసాల్లో ఇది ఒకటి. చాలా కాలం హిందీలోనే ఉండిపోయిన ఈ ఉపన్యాస పాఠాన్ని దళిత ఉద్యమ నాయకుడు యస్‌ఆర్ దారాపురి 2016లో ఇంగ్లీషులోకి అనువదించారు. ఆయన ఉత్తరప్రదేశ్‌కి చెందిన విశ్రాంత ఐపియస్ అధికారి. అంబేడ్కర్ ఉపన్యాసానికి ముందుమాటలో దారాపురి ఇలా రాశారు: ‘ఇందులో అంబేడ్కర్ తన అనుభవాలు, భవిష్యత్ వ్యూహం గురించి చెప్పారు. అయితే ఈ విషయాలను దళితులు మరిచిపోయారని ఆవేదనతో చెప్పాల్సివస్తున్నది. ఇవాళ దళిత సమాజం అంబేడ్కర్ కుల నిర్మూలన ఎజెండా, బౌద్ధ మత దీక్ష స్వీకరణ నుంచి దూరమైపోయింది. సూత్రరహితమైన, అవకాశవాద దళిత రాజకీయాలు ఆయన చెప్పిన సామాజిక, ధార్మిక ఉద్యమాన్ని వెనక్కి నెట్టేశాయి. ఇవాళ దళిత సమాజం (ఉప)కుల చీలికలతో రోగగ్రస్తమైంది. అంబేడ్కర్ ప్రారంభించిన దళిత చైతన్య ప్రస్థానం ముందుకు పోవడానికి బదులు వెనక్కి పోతున్నట్టుగా కనపడుతున్నది. ఇది అంబేడ్కర్ వాదులందరినీ కలవరపరచాల్సిన విషయం’. ఈ ఉపన్యాసం అనేక ఆలోచనలను, ప్రశ్నలను మనముందు ఉంచింది. 


భూమిలేని పేదకూలీల గురించి బాబా సాహేబ్‌ తన ప్రసంగంలో ఎంతో ఆవేదనను వ్యక్తం చేశారు. ‘నేను వారికోసం తగినంత చేయలేకపోయాను. వారు అనుభవిస్తున్న వేదనను, కష్టాలను నేను భరించలేకపోతున్నాను. భూమి లేకపోవడమే వారి వెతలకి మూలకారణం. దాని వలనే వారు అవమానాలకు, అణచివేతకు గురవుతున్నారు. తమని తాము ఉద్ధరించుకోలేకపోతున్నారు. నేను వారి కోసం కష్టిస్తాను. దీనిలో ప్రభుత్వం ఏదైనా ఆటంకాలు కలిగించినట్టయితే, నేను వారికి నాయకత్వం వహించి న్యాయ పోరాటాన్ని చేస్తాను. వారు భూమిని సాధించేందుకు అన్నివిధాల ప్రయత్నాలు చేస్తాన’ని పేర్కొన్నారు. 


‘అతి త్వరలో నేను బౌద్ధమతం స్వీకరించబోతున్నాను. బౌద్ధం స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంపై ఆధారపడిన అభ్యుదయ మతం. ఇది చాలా సంవత్సరాల పరిశోధనల తర్వాత నేను కనుగొన్న విషయం. బౌద్ధం స్వీకరించిన మీదట ఒక అంటరానివాడిగా మీతో నేను కలిసి జీవించలేను. అయితే ఒక నిజమైన బుద్ధిస్టుగా మీ ఉద్ధరణ కోసం నేను నా పోరాటాన్ని కొనసాగిస్తాను. మీరంతా నాతో పాటు బౌద్ధం స్వీకరించాలని నేను కోరను. ఈ మహత్తర ధర్మంలో దృఢవిశ్వాసం ఉన్నవారు మాత్రమే బౌద్ధం స్వీకరించి ఆ నియమాలను పాటించవచ్చున’ని తన అనుయాయులనుద్దేశించి పేర్కొన్నారు. 

‘ఉన్నతవిద్యను పొందాక వారు సమాజానికి సేవ చేస్తారని భావించాలి. ప్రభుత్వోద్యోగాలలో ఉన్నవారు తమ రాబడిలో 1/20 వంతు సమాజసేవకి వినియోగించాల్సిన బాధ్యత ఉంది. అప్పుడు మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుంది. అలా కాకపోతే ఒక్క కుటుంబం మాత్రమే లాభపడుతుంది. సమాజపు ఆశలన్నీ పల్లెనుంచి విద్యార్జనకోసం వెళ్ళినవారిపై కేంద్రీకృతమై ఉంటాయి. విద్యాధికుడైన సమాజసేవకుడు వారికొక వరం’ అని పేర్కొన్నారు. 


అంబేడ్కర్ తన ఉపన్యాసాన్ని ముగిస్తూ భవిష్యత్తుపై ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈరోజు నేను పెద్ద టెంటును మోస్తున్న స్తంభంలాగా ఉన్నాను. ఈ స్తంభం తన స్థానంలో నిలవలేని క్షణం గురించి నేను ఆందోళన పడుతున్నాను. నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నేను ఎప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానో తెలియదు. నిస్సహాయులు, నిరాశలో కూరుకుపోయిన కోట్లాది ఫ్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం నిలబడే యువకుడిని నేను కనుగొనలేకపోయాను. ఎవరైనా ఒక యువకుడు ఈ బాధ్యతని తీసుకోవటానికి ముందుకి వస్తే నేను నిశ్చింతగా కన్నుమూస్తాను’ అంటూ ఆవేదనాభరిత స్వరంతో ఆ ప్రసంగాన్ని ముగించారు.


ఇప్పటి దళిత సమాజాన్ని, దళిత రాజకీయాల్ని బాబాసాహేబ్‌ ప్రసంగం నేపథ్యంలో విశ్లేషిస్తే అంబేడ్కర్‌ ప్రారంభించిన ప్రస్థానం ముందుకు కాకుండా వెనక్కి పోతున్నట్లుగా కనిపిస్తోందని అన్న దారాపురి వాక్యాలు అర్థవంతంగా కనడబతాయి.



-ఎమ్.జయలక్ష్మి

విశ్రాంత ప్రభుత్వాధికారిణి

Updated Date - 2020-12-04T05:35:45+05:30 IST