అంబేడ్కర్‌ స్మృతివనం.. ఇక చకచకా..

ABN , First Publish Date - 2021-06-16T05:30:00+05:30 IST

అంబేడ్కర్‌ స్మృతివనం.. ఇక చకచకా..

అంబేడ్కర్‌ స్మృతివనం.. ఇక చకచకా..
స్మృతివనంపై అధికారులతో కలెక్టర్‌ నివాస్‌ సమీక్ష

స్వరాజ్య మైదానాన్ని సిద్ధం చేయండని కలెక్టర్‌ నివాస్‌ ఆదేశాలు

ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యామ్నాయ మార్గాలు

రైతుబజార్‌ కోసం కృష్ణలంక కాల్వగట్టు పరిశీలన

విజయవాడ, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : అంబేడ్కర్‌ స్మృతివనంవైపు అడుగులు పడుతున్నాయి. సమస్యలను పరిష్కరించి స్వరాజ్య మైదానాన్ని సిద్ధం చేసేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ఈ మేరకు కలెక్టర్‌ జె.నివాస్‌ పలు మార్గదర్శకాలను నిర్దేశించారు. స్వరాజ్య మైదాన ప్రాంగణంలోని శిథిల ఇరిగేషన్‌ క్వార్టర్స్‌ను వారంలోగా తొలగించాలని ఆదేశించారు. ఇరిగేషన్‌ క్వార్టర్స్‌లోని వివిధ శాఖల భవనాలకు ప్రత్యామ్నాయం చూడాలని సూచించారు. రైతు బజార్‌ను కృష్ణలంక కాల్వగట్టుకు తరలించేందుకు పరిశీలించమని నిర్దేశించారు. కలెక్టర్‌ నివాస్‌, జేసీలు మాధవీలత, శివశంకర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, ఎస్‌ఈ నరసింహమూర్తి, తదితర ఇతర ఉన్నతాధికారుల సమావేశం బుధవారం క్యాంపు కార్యాలయంలో జరిగింది. స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహంతో పాటు మెమోరియల్‌ పార్క్‌ అధ్యయన కేంద్రం వంటివి ఏర్పాటు చేసేందుకు పనులు ముమ్మరం చేయాలని, భవనాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. భూమి అప్పగింత విషయంపై కలెక్టర్‌ కొన్ని ప్రతిపాదనలు చేశారు. 

కార్యాలయాల మార్పు

స్వరాజ్య మైదానంలోని కార్యాలయాలను వారంలో తొలగించి సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ అధికారులకు కలెక్టర్‌ సూచించారు. పలు కార్యాలయాలకు ప్రత్యామ్నాయ ఆలోచనలను తెలియజేశారు. శిథిల స్థితికి చేరి నిరుపయోగంగా ఉన్న ఇరిగేషన్‌ క్వార్టర్స్‌ను తొలగించాలని చెప్పారు. రైతు బజార్‌ను కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని కాల్వగట్టు లేదా సీతానగర్‌ కట్ట ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని మార్కెటింగ్‌ అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి నాటికి స్మృతివనాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని, ఆ దిశగా ప్రతి యంత్రాంగం సిద్ధం చేయాలని ఆదేశించారు. 


Updated Date - 2021-06-16T05:30:00+05:30 IST