Abn logo
Sep 19 2021 @ 14:21PM

పంజాబ్ సీఎం పదవిని తిరస్కరించా : అంబికా సోనీ

న్యూఢిల్లీ : పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని కాంగ్రెస్ పార్టీ తనను కోరిందని ఆ పార్టీ సీనియర్ నేత అంబికా సోనీ చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను తాను తిరస్కరించానని తెలిపారు. చండీగఢ్‌లో పార్టీ సమావేశం జరుగుతోందని, పార్టీ ప్రధాన కార్యదర్శి, పరిశీలకులు అందరు ఎమ్మెల్యేల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలుసుకుంటున్నారని చెప్పారు. 


అంబికా సోనీ ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ, పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని కాంగ్రెస్ తనను కోరిందన్నారు. ఈ ప్రతిపాదనను తాను తిరస్కరించానన్నారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదించారా? అని విలేకర్లు అడిగినపుడు అంబిక స్పందిస్తూ, తాను తన అభిప్రాయాన్ని చెప్పానన్నారు. సోనియా గాంధీ తన అభిప్రాయాలను తెలుసుకున్నారని చెప్పారు. 


పంజాబ్ ముఖ్యమంత్రిగా ఓ సిక్కు నేత కావాలనేది 50 ఏళ్ళ నుంచి తన గట్టి అభిప్రాయమని చెప్పారు. సిక్కులను ముఖ్యమంత్రిగా చేయగలిగిన ఏకైక రాష్ట్రం మన దేశంలో పంజాబ్ మాత్రమేనని తెలిపారు. పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రిని తమ పార్టీ ఆదివారం నిర్ణయించే అవకాశం ఉందన్నారు. 


ఇదిలావుండగా పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత, తదుపరి నేతను ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం ఆదివారం జరిగే అవకాశం ఉంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, పంజాబ్ వ్యవహారాల కాంగ్రెస్ ఇన్‌ఛార్జి హరీశ్ రావత్, కేంద్ర పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, హరీశ్ చౌదరి ఈ సమావేశానికి హాజరవుతారు. 


ఇవి కూడా చదవండిImage Caption