సమ్మర్‌ అలవెన్స్‌పై సందిగ్ధం

ABN , First Publish Date - 2022-02-09T06:35:24+05:30 IST

గ్రామీణులకు ఆర్థిక చేయూతనిస్తున్న ఉపాధి హామీ పథకం కేంద్ర కనుసన్నల్లోకి వెళ్లింది. ఉపాధిపనులు గుర్తించడం నుంచి మార్పులు, చేర్పుల వరకు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షించనుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తూ వచ్చినా టీజీఏ సాఫ్ట్‌ వేర్‌ను తొలగించారు.

సమ్మర్‌ అలవెన్స్‌పై సందిగ్ధం
జిల్లాలో ఉపాధిహామీ కూలీలు

- కేంద్రం కనుసన్నల్లో ఉపాధిహామీ 

- ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌లో కనిపించని ఆప్షన్‌ 

- వేసవిలో ఉదయం, సాయంత్రం పనులకు అవకాశం

 - పని కల్పించకుంటే, నిరుద్యోగ భృతికి అవకాశం

- జిల్లాలో 2.22 లక్షల మంది ఉపాధి కూలీలు 

  (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

గ్రామీణులకు ఆర్థిక చేయూతనిస్తున్న ఉపాధి హామీ పథకం  కేంద్ర కనుసన్నల్లోకి వెళ్లింది. ఉపాధిపనులు గుర్తించడం నుంచి మార్పులు, చేర్పుల వరకు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షించనుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తూ వచ్చినా టీజీఏ సాఫ్ట్‌ వేర్‌ను తొలగించారు. ఇప్పుడు నేషనల్‌ ఎన్‌పర్‌మెటిక్‌ సెంటర్‌ (ఐఎన్‌ఐసీ) సర్వర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారానే ఉపాధిహామీ పనులు వివరాలు పొందుపరుస్తూ పనులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలుగు నెలల పాటు ఉపాధిహామీ కూలీలకు అందించే సమ్మర్‌ అలవెన్స్‌పై సందిగ్ధం నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2.22లక్షల మంది కూలీలు పథకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. వేసవి కాలంలో ఉపాధిహామీ కూలీలు వేడిని తట్టుకొని పని చేయాల్సి ఉంటుంది. పని కూడా తగ్గుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పనిగంటలు తగ్గించి వేసవి అలవెన్స్‌ను  ప్రభుత్వం అందిస్తుంది.  ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి 25 శాతం, ఏప్రిల్‌, మే 30 శాతం, జూన్‌లో 20 శాతం సమ్మర్‌ అలవెన్స్‌ అందించేవారు. అయా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ద్వారా అలవెన్స్‌ వివరాలు పొందుపర్చేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రూపొందించిన ఎన్‌ఐసీ  సాప్ట్‌వేర్‌  ద్వారా పనులు చేపడుతున్న క్రమంలో సమ్మర్‌ అలవెన్స్‌ ఆప్షన్‌ లేదు. జనవరిలోనే వెలువడాల్సిన సమ్మర్‌ అలవెన్స్‌ ఉత్తర్వులు ఇప్పటి వరకు వెలువడలేదు.  ఫిబ్రవరి నుంచి పూర్తిగా కొత్త విధానం కేంద్రం పర్యవేక్షణలోనే కొనసాగుతోంది. ఉపాధి హామీ పథకంలో ఎవరైనా కూలీ పని అడిగినా 14 రోజుల్లో పని కల్పించాల్సి ఉంటుంది. లేని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లించాలి. కానీ గ్రామాల్లో ఈ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదు. ప్రస్తుతం ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో పనుల వివరాలు కూడా పూర్తిగా తెలుస్తుంది.  వేసవిలో ఉపాధిహామీ కూలీలకు ఇబ్బందులు కలగకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు కల్పించనున్నారు. వేతనాలు కూడా నేరుగా కూలీల ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. ఉపాధిహామీలో వస్తున్న మార్పులు ఆశాజనకంగా ఉన్నా సమ్మర్‌ అలవెన్స్‌ ఆప్షన్‌ లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

జిల్లాలో 1,00,365 జాబ్‌కార్డులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిత్యం ఉపాధిహామీ పనులకు కూలీలు వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వీరికి 1,00,365 జాబ్‌ కార్డులను జారీ చేశారు. వీటి పరిధిలో 2 లక్షల 22 వేల 578 మంది కూలీలు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 3600 మందికి కొత్తగా జాబ్‌ కార్డులు అందించారు. ఇందులో 6190 శ్రమశక్తిసంఘాలు ఉండగా వీటి పరిధిలో లక్షా 20 వేల 63 మంది కూలీలు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 51,657 కుటుంబాల్లో 78,431 మంది కూలీలకు ఉపాధి అందించారు. 2021-22 లేబర్‌ బడ్జెట్‌లో 46 లక్షల పనిదినాల్లో 39.99 లక్షల పనిదినాలు కల్పించారు. ఉపాధిహామీ కూలీ రూ.245 ఉండగా జిల్లాలో సరాసరి రూ.202.57 పొందుతున్నారు. ఇప్పటి వరకు రూ.50.39 కోట్ల కూలీని అందుకున్నారు. జిల్లాలో సరాసరి పనిదినాలు 48.20 లక్షలు ఉండగా వంద రోజుల పనిచేసిన కుటుంబాలు 7,245 ఉన్నాయి. జిల్లాలో కంపోస్ట్‌ షెడ్‌లు, వైకుంఠధామాలు, వ్యవసాయ కల్లాలు, పశువులపాకలు, గొర్రెలు, మేకల పాకల నిర్మాణాలు, ఫాంపాండ్‌లు, సోప్‌పిట్‌లు, ప్రకృతి వనాలు, నర్సరీలు వంటి పనుల్లో కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు.

 యాక్షన్‌ ప్లాన్‌ రెడీ 

2022- 23 సంవత్సరానికి యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేశారు. 35,38,705 పనిదినాలు కల్పించడానికి నిర్ణయించారు. రూ.121.37 కోట్లు బడ్జెట్‌ రూపొందించారు. రూ.360 కోట్ల విలువైన పనులను గుర్తించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూలీలకు బోయినపల్లి మండలంలో 2,04,929 పనిదినాలు, చందుర్తి మండలం 2,66,564, ఇల్లంతకుంట 3,27,255, గంభీరావుపేట 4,80,057, కోనరావుపేట  3,89,398, ముస్తాబాద్‌ 3,93,648, రుద్రంగి 1,10,488, తంగళ్లపల్లి 3,87,636, వీర్నపల్లి 2,63,812, వేములవాడ మండలం 67,268, వేములవాడ రూరల్‌ 1,76,259, ఎల్లారెడ్డిపేటలో 4,71,391 పనిదినాలు కల్పించాలని యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. 


Updated Date - 2022-02-09T06:35:24+05:30 IST