కరోనా వచ్చిందని ఫోన్ చేస్తే.. రెండు రోజుల తర్వాత అంబులెన్స్‌!

ABN , First Publish Date - 2020-08-04T22:05:39+05:30 IST

డోన్‌ పట్టణంలోని ఓ రిటైర్డు రైల్వే ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 108 అంబులెన్సులో ఆయనను తరలించేందుకు వైద్య అధికారులకు ఫోన్‌ చేశారు.

కరోనా వచ్చిందని ఫోన్ చేస్తే.. రెండు రోజుల తర్వాత అంబులెన్స్‌!

సకాలంలో వైద్యంపై బాధితుల్లో ఆందోళన

డోన్‌లో పెరుగుతున్న మరణాలు 

హోం క్వారంటైన్‌ బాధితులకు అందని కిట్లు 


డోన్‌(కర్నూలు): డోన్‌ పట్టణంలోని ఓ రిటైర్డు రైల్వే ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 108 అంబులెన్సులో ఆయనను తరలించేందుకు వైద్య అధికారులకు ఫోన్‌ చేశారు. రెండు రోజుల తర్వాత అంబులెన్స్‌ వస్తుందని సమాధానం వచ్చింది. ఆ రెండు రోజులు ఆయన హోం క్వారంటైన్‌లోనే ఉండిపోయాడు. సరైన వైద్యం అందక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రెండు రోజుల తర్వాత వచ్చిన అంబులెన్సులో కర్నూలు కొవిడ్‌ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సకాలంలో అంబులెన్స్‌ వచ్చి ఉంటే ప్రాణం నిలబడేదని కుటుంబ సభ్యుల ఆవేదన చెందుతున్నారు. డోన్‌ పట్టణంలో కరోనా మరణాలు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. 20 రోజుల్లో పట్టణంలోని 20 మంది దాకా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. పట్టణంలో మొదటి కరోనా మరణం జరిగిన వీధిలో ఇప్పటికి ముగ్గురు మృతి చెందారని సమాచారం. 


హోం క్వారంటైన్‌ కిట్లు ఎక్కడ? 

గుత్తి రోడ్డులో పాజిటివ్‌ నిర్ధారణ అయిన ఓ వ్యక్తి హోం క్వారంటైన్‌లో ఉంటున్నాడు. అతనికి జిల్లా కేంద్రం నుంచి ఫోన్‌ చేసి హోం క్వారంటైన్‌ కిట్‌ అందిందా? అని అడిగారు. దానికి ఆయన ఆశ్చర్యపోయాడు. తనకు కిట్‌ ఇవ్వలేదని తేల్చి చెప్పాడు. పట్టణంలో చాలామంది హోం క్వారంటైన్‌ బాధితులకు కిట్లు అందడం లేదు. ఈ కిట్లు ఏమవుతున్నాయో అర్థం కావడం లేదు. 


వికటిస్తున్న హోం ఐసొలేషన్‌

పట్టణంలోని కొత్తపేటలో ఓ యువకుడిని హోం ఐసొలేషన్‌లో ఉంచారు. ఇంట్లో రెండు రూములు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆ యువకుడి నుంచి తండ్రికి, తల్లికి, అక్కకు కూడా పాజిటివ్‌ వచ్చింది. చివరికి అత్యవసర కేసులను కూడా హోం ఐసొలేషన్‌లో ఉంచుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. పట్టణంలో ఎంత మంది హోం ఐసొలేషన్‌లో ఉంటున్నారు? వారికి వైద్యసేవలు అందుతున్నాయా లేదా..? అనే వాటిపై పర్యవేక్షణ లేదన్న విమర్శలు ఉన్నాయి.

Updated Date - 2020-08-04T22:05:39+05:30 IST