Abn logo
May 13 2021 @ 08:17AM

హైదరాబాద్ సిటీలో అంబులెన్స్ కష్టాలు.. కుప్పకూలుతున్న జనాలు!

హైదరాబాద్‌ సిటీ : ఆమె నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలు. ఎంతో మంది కరోనా రోగుల ప్రాణాలను కాపాడారు. తనకు ఆపద వస్తే అందుబాటులో ఉంటాయని భావించిన సౌకర్యాలేవీ ఆ వైద్యురాలి దరికి చేరలేదు. అస్వస్థతకు గురైన తన అమ్మమ్మను అంబులెన్స్‌లో తరలించేందుకు ఆమె పడిన కష్టాలు అంతా ఇంతా కాదు. పలుమార్లు 108కు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడం, బుకింగ్‌ చేసిన క్యాబ్‌లను నిర్వాహకులు రద్దు చేయడంతో ఆ వైద్యురాలికి చివరకు ఆటోనే దిక్కయ్యింది. తన అమ్మమ్మ ప్రాణాలను కాపాడేందుకు ఆటోలోనే కింగ్‌ కోఠి ఆస్పత్రికి చేరేసరికి గోల్డెన్‌ అవర్‌ మొత్తం పోయింది. 90 వరకు ఉన్న అమ్మమ్మ పల్స్‌రేట్‌ ఏకంగా 42కు చేరింది. అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లే సరికి పల్స్‌రేట్‌ పూర్తిగా పడిపోయింది. చివరకు ఆ వైద్యురాలి ఒడిలోనే అమ్మమ్మ కన్నుమూసిన ఘటన మంగళవారం జరిగింది. కేవలం అంబులెన్స్‌ రాకపోవడం వల్లే తన తల్లి మినాక్షీ (62) చనిపోయిందని కూతురు కల్యాణి వాపోయింది.


కుటుంబీకుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలో నివాసం ఉండే మీనాక్షి (62) మనవరాలు డాక్టర్‌ హిమజ అమీర్‌పేటలోని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రిలో వైద్యురాలు. మీనాక్షి రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా రెగ్యులర్‌గా ఫోన్‌లో మాట్లాడుతూ వైద్య సలహాలు ఇచ్చింది. నేచర్‌క్యూర్‌ ఆస్పత్రిలో నైట్‌ డ్యూటీ చేసిన డాక్టర్‌ హిమజ మంగళవారం ఉదయం నేరుగా కూకట్‌పల్లిలోని తన అమ్మమ్మ దగ్గరకు వెళ్లింది. పల్స్‌ రేటులో హెచ్చుతగ్గులను గమనించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని భావించింది. దాంతో 108కు ఫోన్‌ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. ఆస్పత్రి వరకంటే బుక్‌ అయిన క్యాబ్‌లను కూడా నిర్వాహకులు రద్దు చేసుకున్నారు. చివరకు ఆటోలోనే కూకట్‌పల్లి నుంచి 9.45గంటలకు బయలుదేరితే కింగ్‌కోఠి ఆస్పత్రికి చేరే సరికి మధ్యాహ్నం 12గంటలయ్యింది.

కింగ్‌కోఠిలో అడ్మిషన్‌కు ఆలస్యమే..

కింగ్‌కోఠి ఆస్పత్రికి చేరగానే డాక్టర్‌ హిమజకు కొండంత ధైర్యం వచ్చింది. తన అమ్మమ్మకు ధైర్యం చెప్పింది. ‘అమ్మమ్మా.. హాస్పిటల్‌కు వచ్చేశాం.. నీకేం కాదు. ఇక్కడ నీకు నేనే దగ్గరుండి వైద్యం చేపిస్తా. నా ఫ్రెండ్స్‌ కూడా ఇక్కడ డాక్టర్స్‌గా ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఉండు అమ్మమ్మా.. అంటూ తన ఒడిలో పడుకున్న అమ్మమ్మకు డాక్టర్‌ హిమజ భరోసానిచ్చింది. ఆస్పత్రికి వచ్చినా కానీ వెంటనే అడ్మిట్‌ చేసుకోలేదు. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతుండడంతో 15నిమిషాల తర్వాత బయటే ఉన్న ఆక్సిజన్‌ కాన్సండ్రేటర్‌ నుంచి ఆక్సిజన్‌ హిమజ పెట్టింది. వెంటనే ఆమె ఆస్పత్రిలోకి వెళ్లి అడ్మిషన్‌కు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్‌ రూమ్‌ వద్ద చెప్పి స్లిప్‌ తీసుకుంది. సిబ్బంది వచ్చి ఆక్సిజన్‌ సాచురేషన్‌ లెవెల్స్‌ చూడగా.. 45 కంటే తక్కువగా ఉన్నాయి. అయితే అప్పటికే కామాక్షి కరోనా పరీక్ష చేస్తే నెగటివ్‌గానే ఉన్నది. అత్యవసర కేసు కావడంతో అక్కడి వైద్యులు గాంధీ లేదా ఉస్మానియాకు వెళ్లాలంటూ సూచించారు. గాంధీలో బెడ్స్‌ లేని కారణంగా ఉస్మానియాకు రాయించుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రికి అక్కడి నుంచి అంబులెన్స్‌లోనే తీసుకెళ్లారు. అయినా ఫలితం దక్కలేదు.


అమ్మమ్మను కాపాడుకోలేకపోయా..

నేను డాక్టర్‌ను అయ్యుండి మా అమ్మమ్మను కాపాడుకోలేకపోయా.! సకాలంలో వైద్యం అందించలేకపోయాను. గోల్డ్‌న్‌ అవర్‌ మొత్తం ఆటోలోనే పోయింది. ఆస్పత్రికి రాగానే వెంటనే అడ్మిట్‌ కాలేదు. రిజిస్ర్టేషన్‌ చేయడానికి కూడా ఆలస్యమైంది. ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్తే తొలుత కొవిడ్‌ కేసని సందేహించగా, నెగటివ్‌ పేషెంట్‌ అంటే పట్టారు. క్యాజువలిటీలోనే కళ్ల ముందే మా అమ్మమ్మ కన్నుమూసింది. మా అమ్మమ్మ చాలా ఇష్టం. వైద్యం అందితే ఇంకా చాలా ఏళ్లు బతికేది. - హిమాక్షి మనుమరాలు, నేచర్‌క్యూర్‌ ఆస్పత్రి వైద్యురాలు హిమజ.


108అంబులెన్స్‌ వస్తే అమ్మ బతికేది

108కి ఎన్నిసార్లు ఫోన్‌ చేయాలి. చేసి చేసి అలసట వచ్చిందే కానీ అంబులెన్స్‌ రాలేదు. అంబులెన్స్‌ కోసం ఎదురుచూసి చివరకు ఆటోలో నా కూతురు మా అమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఈ పరిస్థితుల్లో పిలిస్తే వస్తదనుకున్న అంబులెన్స్‌ కూడా రాలేదు. 108 కొడితే అంబులెన్స్‌ వస్తే మా అమ్మ బతికేది. సిటీలోనే అంబులెన్స్‌ రాని పరిస్థితి ఉంటే ఇక ఊళ్లల్లో ఉండే వారి పరిస్థితేందీ..? - హిమాక్షి కూతురు కళ్యాణి, బేగంపేట.

Advertisement