చైనా మృతులకు డబుల్‌

ABN , First Publish Date - 2020-04-09T07:42:53+05:30 IST

అప్పుడు అల్‌కాయిదా కన్నీరు పెట్టించింది. ఇప్పుడు... కరోనా కలకలం సృష్టిస్తోంది. అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌ నగరం విలవిలలాడుతోంది. ‘సెప్టెంబరు 11’ దాడి తర్వాత న్యూయార్క్‌ను పెను విషాదం...

చైనా మృతులకు డబుల్‌

  • న్యూయార్క్‌లో శవాల గుట్టలు
  • 6,268కు చేరిన మృతుల సంఖ్య
  • ఒక్క రోజులోనే 779 మంది మృతి
  • అంత్యక్రియలకు పది రోజుల నిరీక్షణ
  • నాడు ఉగ్రదాడిలో ఈ నగరంలో
  • 2,753 మంది దాకా మృత్యువాత
  • యూర్‌పలో కేసులు 7.50 లక్షలు
  • నిలకడగా బ్రిటన్‌ ప్రధాని ఆరోగ్యం



న్యూయార్క్‌, ఏప్రిల్‌ 8: అప్పుడు అల్‌కాయిదా కన్నీరు పెట్టించింది. ఇప్పుడు... కరోనా కలకలం సృష్టిస్తోంది.   అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌ నగరం విలవిలలాడుతోంది. ‘సెప్టెంబరు 11’ దాడి తర్వాత న్యూయార్క్‌ను పెను విషాదం చుట్టుముట్టింది. కరోనా మరణాల తీవ్రత ‘ఉగ్ర’ విలయాన్నీ మించిపోయింది. నాటి దాడిలో మొత్తం 2,977 మంది అమెరికా పౌరులు చనిపోగా, వారిలో 2,753 మంది న్యూయార్క్‌వాసులే ఉన్నారు. కానీ, మంగళవారం నాటికి ఈ ఒక్క నగరంలోనే 6,268 మందిని కరోనా బలిగొంది. ఒక్క రోజులోనే న్యూయార్క్‌లో 779 మంది మృత్యువాతపడ్డారు. కరోనా ఉత్పాతం విరుచుకుపడిన ఈ 3, 4 నెలల్లో ఒక్క రోజులోనే ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. అమెరికాలో నమోదయిన పదివేలు పైచిలుకు మృతుల్లో సగానికి పైగా ఈ సిటీలోనే సంభవించాయి. ఇంతమందిని సమాధి చేయడానికి శ్మశానవాటికల్లో చోటు చాలడం లేదు. ఒక్కో మృతదేహం సమాధికి తొమ్మిది నుంచి పది రోజులు పడుతోందని వారంతా వాపోతున్నారు. ఇప్పటికే పాజిటివ్‌గా తేలిన వారు మినహా కొత్తగా వచ్చే కేసులు తగ్గిపోవడం, ఐసీయూకు తరలించేవారి సంఖ్య కూడా తక్కువగానే ఉండటం ఒక్కటే న్యూయార్క్‌వాసులకు కొంత ఊరటనిస్తోంది. భౌతిక దూరం పాటించడం, ఇళ్లకే ప్రజలు పరిమితం కావడమనేది ఫలితాలు ఇస్తుండటమే దీనికి కారణమని గవర్నర్‌ ఆండ్రూ వివరించారు. ఇప్పటికి అమెరికాలో 12వేలమంది చనిపోగా, 3.80 లక్షలమందికి పాజిటివ్‌ తేలింది. 


ఆగని మృత్యుఘోష 

లండన్‌: యూర్‌పలో కరోనా కేసుల సంఖ్య 7.50 లక్షలకు చేరింది. అత్యధికంగా స్పెయిన్‌లో 1.46 లక్షలు, ఇటలీలో 1.35 లక్షలు నమోదయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన వెంటిలేటర్‌పై లేరని వైద్యులు తెలిపారు. ఒక్కరోజులో నమోదయిన 800 మరణాలతో అక్కడ ఇప్పటికి 6,200 మంది మరణించారు. స్పెయిన్‌లో 24 గంటల్లో 743 మంది మరణించారు. ఇరాన్‌లో కొత్తగా 121 మరణాలు బుధవారం సంభవించగా, మృతులు నాలుగు వేలకు చేరారు. 


Updated Date - 2020-04-09T07:42:53+05:30 IST