పేటెంట్ రూల్స్‌పై భారత్ ప్రతిపాదనకు అమెరికా మద్దతు

ABN , First Publish Date - 2021-05-07T08:52:59+05:30 IST

కరోనా టీకాలకు పేటెంట్‌ నిబంధనల నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇవ్వాలన్న భారత్‌, దక్షిణాఫ్రికా నిర్ణయానికి అమెరికా మద్దతు తెలిపింది. మహమ్మారిపై ప్రపంచమంతా కలిసి చేస్తున్న పోరాటంలో ఇదొక మేలి మలుపు అని అభివర్ణించింది. తద్వారా, నిరుపేద దేశాలకు అందుబాటు ధరలకే మరిన్ని టీకాలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది.

పేటెంట్ రూల్స్‌పై భారత్ ప్రతిపాదనకు అమెరికా మద్దతు

వాషింగ్టన్‌: కరోనా టీకాలకు పేటెంట్‌ నిబంధనల నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇవ్వాలన్న భారత్‌, దక్షిణాఫ్రికా నిర్ణయానికి అమెరికా మద్దతు తెలిపింది. మహమ్మారిపై ప్రపంచమంతా కలిసి చేస్తున్న పోరాటంలో ఇదొక మేలి మలుపు అని అభివర్ణించింది. తద్వారా, నిరుపేద దేశాలకు అందుబాటు ధరలకే మరిన్ని టీకాలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. ఫార్మా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. సుదీర్ఘ చర్చల తర్వాత అమెరికా తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభం నెలకొంది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే, ఇప్పుడు అసాధారణ చర్యలు తీసుకోవడం తప్పనిసరి. మేధో సంపత్తి హక్కులను పరిరక్షించాలని అమెరికా గట్టిగా భావిస్తుంది. కానీ, మహమ్మారిని అంతం చేయాలన్న ఉద్దేశంతో టీకాలకు మాత్రం వాటిని మినహాయించడానికి మద్దతు ఇస్తోంది’’ అని అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరీన్‌ తాయ్‌ తెలిపారు. ఈ మినహాయింపునకు మద్దతుగా 100 మందికిపైగా డెమొక్రిటిక్‌ కాంగ్రెస్‌ సభ్యులు, పదిమంది సెనేటర్లు బైడెన్‌కు లేఖ రాశారు. అమెరికా తీసుకున్న నిర్ణయంపై భారత్‌, ఫ్రాన్స్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ హర్షం వ్యక్తం చేశాయి. 


Updated Date - 2021-05-07T08:52:59+05:30 IST