Abn logo
Oct 18 2020 @ 00:18AM

భయాల ముసురులో అమెరికా!

Kaakateeya

ట్రంప్‌ ఓడిపోతే, సజావుగా పదవీ విరమణ చేస్తారా అన్న సందేహం అందరినీ వేధిస్తోంది. ఆయన ఏదోరకంగా అధ్యక్ష పదవిలోనే ఉండటానికే ప్రయత్నిస్తారని రాజకీయ విశ్లేషకులు భయపడుతున్నారు. అందుకు నిదర్శనాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కరోనా వైరస్‌ భయంతో అమెరికన్లు, తపాలా ద్వారా ఓటు (voting by mail) వేయడానికి సిద్ధపడుతుంటే దానికి అడ్డమైన అడ్డంకులూ కల్పిస్తున్నారు. ఆ రకమైన ఓటింగులో మోసం జరుగుతుందంటూ తన అనూయాయులకు నిత్యం నూరిపోస్తున్నారు. కొద్ది ఓట్ల మెజారిటీతో ప్రతిపక్షం నెగ్గే రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలను ప్రకటించనీయకండా కోర్టు కెక్కి, చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి తనే నెగ్గినట్టు ప్రకటింప చేసుకోవడానికి  ప్రయత్నిస్తారు.


వచ్చేనవంబర్‌ మూడో తేదీన అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగుస్తాయి. మామూలుగా అయితే, అమ్మయ్య! పీర్లు గుండాన పడ్డాయనుకోవచ్చు. అయితే ఈ సారి అలా అనుకోవచ్చా అన్నది బిలియన్‌ డాలర్ల ప్రశ్న. పీర్లు గుండాన పడ్డాయి అంటే, ‘ఏదోవిధంగా పని ముగిసింది’ అని, లేదా ‘అనుకున్న దానికంటే వ్యతిరేకంగా పని ముగిసింది’ అని అర్థం. ఈ సారి ఈ రెండూ నిజం కాకపోవచ్చు. 2020 ఎన్నికలలో డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున జోసెఫ్‌ బైడెన్ – కమలాదేవి హారిస్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పోటీ చేస్తున్నారు. కమలాదేవి హారిస్‌ తల్లి తమిళనాడు నుంచి అమెరికాకు వలస వచ్చిన సైంటిస్టు. అమెరికన్‌ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఇండో-అమెరికన్‌, దేశంలో రెండో పెద్ద పదవికి పోటీ చేయడం భారతీయులుగా మనమందరం గర్వించదగ్గ విషయం. రిపబ్లికన్‌ పార్టీ తరఫున ప్రస్తుతం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో ఉన్న డోనాల్ట్‌ ట్రంప్‌, మైక్‌పెన్స్‌ మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఈ మాటలు గుర్తు చేయడం అవసరమనిపిస్తోంది-– ‘ప్రజాస్వామ్యం పరిపూర్ణ స్థితికి చేరుకునేసరికి అధ్యక్షుడి కార్యాలయం ప్రజల అంతరాత్మకు సన్నిహితమవుతుంది. ఒక దివ్యదినాన, సాధారణ ప్రజలు వారి అభిరుచికి చేరువయ్యే తరుణంలో పరమమూర్ఖుడు, స్వయంమోహితుడు, బుద్ధిహీనుడూ శ్వేతభవనం హస్తగతం చేసుకుంటాడు(H. L. Mencken, July 26, 1920 – The Baltimore Evening Sun) అని వంద ఏళ్ళ క్రితం మెంకెన్‌ అన్న మాటలు నిజం అవుతున్నాయి. 2016 ఎన్నికలలో ట్రంప్‌కు సుమారు 630 లక్షల ఓట్లు, హిల్లరీ క్లింటన్‌కు సుమారు 660 లక్షల ఓట్లు వచ్చాయి. అయినా ట్రంప్ అధ్యక్షుడయ్యాడు. అమెరికా ప్రజలు నేరుగా అధ్యక్షుణ్ణి ఎన్నుకోరు. ప్రతి రాష్ట్రం నుంచి ‘ఎలెక్టోర్’లను ఎన్నుకుంటారు. ఈ ఎలెక్టోర్‌లు మొత్తం 538మంది. వీళ్ళు సాధారణంగా ఏ పార్టీకి కట్టుబడిన వాళ్ళో ఆ పార్టీ అభ్యర్థికే ఓటు వేస్తారు. ఉదాహరణకు, క్యాలిఫోర్నియాలో 55 మంది ఎలొక్టోర్‌లు ఉంటారు. ఆ రాష్ట్రంలో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి నెగ్గితే, ఆ 55ఓట్లు అతగాడికే వస్తాయి. అన్ని రాష్ట్రాలోనూ కలిపి ఉన్న 538 ఓట్లలో, ఎవరికి 270 ఎలెక్టోర్‌ ఓట్లు వస్తాయో ఆ వ్యక్తి అధ్యక్షుడవుతాడు. ఇది కొంచెం తికమక వ్యవహారమే. గత 220 ఏళ్ళల్లో మూడుసార్లు మాత్రమే ఈ పద్ధతి బెడిసికొట్టింది. ఆఖరిసారిగా 1876లో రిపబ్లికన్‌ రూథర్‌ఫర్డ్‌ హేస్‌ను, ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందు రెండు పార్టీల వాళ్ళూ తికమకలు పడి అధ్యక్షుడిగా ఒప్పుకున్నారు. ఇప్పుడు ట్రంప్‌ దేశాన్ని మళ్లీ ఆ దుస్థితికి తీసుకెళతాడెమోననే భయం ఉంది.


2016లో ట్రంప్‌ నెగ్గుతారని ఎవరూ అనుకోలేదు. ఆ మాటకొస్తే ట్రంపే అనుకోలేదు. రష్యన్‌ మాఫియా సహాయంతో హఠాత్తుగా ఆయన అధ్యక్షుడయ్యారు. ఒకసారి అధ్యక్ష పదవి రుచి చూశాక ట్రంప్‌లో దురాశ రేకెత్తింది. మళ్ళీ మరోసారి, వీలయితే రాజ్యాంగాన్ని తలదన్ని మూడోసారి, ఇంకా వీలయితే ఆజన్మాంతం(అతడి హీరో పుతిన్‌ లాగా!) అధ్యక్షుడవుదామన్న కోరిక పుట్టింది. అధికారం వ్యక్తిని అవినీతిపరుణ్ణి చేస్తుంది. సంపూర్ణాధికారం పూర్తిగా భ్రష్టుణ్ణి చేస్తుందని నానుడి! ట్రంప్‌ విషయంలో అది ముమ్మాటికీ నిజం. 


ప్రముఖ చరిత్రకారులు ట్రంప్‌ను రోమన్‌ చక్రవర్తులు కలిగులా తోనూ, నీరో తోనూ పోల్చారు. కలిగులాకి తన చుట్టూ ఉన్నవాళ్ళని అవమానించడం, నొప్పించడం సరదా. అతడికి రోమన్‌ సంప్రదాయక విలువలంటే అసహ్యం. ఎందుకంటే, ఆ విలువలు కులీనపాలనకి కావలసిన హోదా, ప్రతిష్ఠలకు అడ్డొస్తాయి. మహత్మోన్మాదంతో స్త్రీలను విలాస వస్తువులుగా పరిగణించడం అతడికి మామూలు! ట్రంప్‌కు కూడా ఆ రకమైన అభిప్రాయాలే ఉన్నాయి. తనను పొగడని సెనేటర్లని ‘రాజద్రోహులు’ అని వాఖ్యానించారు. కలిగులా  మంత్రిగా తన గుర్రాన్ని పెట్టుకుందామనుకున్నాడట! ట్రంప్‌ తన మంత్రివర్గంలో తెలివి గలవాళ్ళని తరిమేసి పూర్తిగా గుర్రాల లాంటి వారినే ఉంచుకున్నారు. వాళ్ళు నిత్యం అతణ్ణి పొగుడుతుంటారు తప్ప మంచి సలహాలు ఇవ్వటానికి సాహసించరు. పోతే, ట్రంప్‌ను నీరోతో పోల్చడం మరీ అన్యాయం. రోమ్‌ నగరం తగలబడుతూ ఉంటే, నీరో ఫిడేలు వాయిస్తూ కూచున్నాడుట గానీ, అతడు అగ్ని మీద ఆజ్యం పోయలేదు. అమెరికాలో పేదలు, నల్లవాళ్ళు, ముదుసలులూ, కరోనా వైరస్‌తో ఈగల్లా చనిపోతూ ఉంటే, ట్రంప్‌ కిమ్మనకుండా కూర్చుని, ‘భయపడకండి, ఈ వైరస్‌ దానంతటదే పోతుంది. ఎండాకాలం రాగానే అది ఇట్టే మాయమైపోతుంది చూడండి’ అంటూ ప్రపంచ ప్రఖ్యాత వైద్యనిపుణులను పక్కకి నెట్టేసి సర్వం తెలిసినవాడిలా ప్రవర్తిస్తున్నారు ఇప్పటికీ. ట్రంప్‌ను రోమన్‌ చక్రవర్తులతో పోల్చటం వాళ్ళకు అన్యాయం చేయడమే! పోనీ, శిశుపాలుడితో పోల్చవచ్చేమోనని అనుకుంటే ట్రంప్‌ అతడికి వేయి రెట్లు మించిపోయాడు. ‘అక్షాంతిరీర్ష్యా అసూయాతు దోషారోపు గుణేష్వతి,’ అనేది అమరకోశంలోని ఓ శ్లోకం. పరులసంపదను(తెలివితేటలను) ఓర్వలేకపోవడం ఈర్ష్య. ఇతరులలో మంచితనం ఉన్నా అది చూడలేక దుర్గుణాలనే ఆపాదించడం అసూయ’ అని దాని అర్థం. ట్రంప్‌ ఉపన్యాసాలు వింటే ఈ రెండు లక్షణాలూ ఆయనలో పుష్కలంగా కనిపిస్తాయి. 


ఇప్పటికే ట్రంప్‌ 20,000 పైచిలుకు అబద్ధాలు చెప్పారు. చెప్పిన అబద్ధమే పదిసార్లు వల్లిస్తే జనం నమ్మేస్తారని ఎవరో నాజీ నాయకుడు అన్నాడట! అదే తంతు. ఉదాహరణకు అమెరికా దక్షిణ సరిహద్దులో కోట్లకికోట్లు ఖర్చుపెట్టి గోడ కట్టడం గురించో, అమెరికా ఆర్థికవ్యవస్థ తన హయాంలో ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందిందనో, లక్షాధికారుల కోసం తను ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పన్నుల చట్టం మహా గొప్పదనో, నల్లజాతి వాళ్ళు తనను బ్రహ్మాండంగా సమర్థిస్తున్నారనో, – ఇలాగ చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఆయన అబద్ధాలు! (ఇకపోతే, కరోనా వైరస్‌ చికిత్సలు, బూటకపు వైద్యం గురించి చెప్పటం దండగే అవుతుంది.)


ట్రంప్‌ ఇప్పటికీ గొప్పగా చెప్పుకోతగిన ఆరోగ్యపథకానికి రూపకల్పన చేయలేదు, ఉన్నది ఊడగొట్టడానికి ప్రయత్నాలు చేయడం తప్ప. సరైన వలస చట్టమనేదే లేదు. శ్వేతేతర జాతుల వలసవాసులను నానామాటలూ అనడం, వాళ్ళని ముప్పతిప్పలు పెట్టడం, నల్లవాళ్ళను, ఆసియా ఖండవాసులను, ముఖ్యంగా ముస్లింలను బాహాటంగా అసహ్యించుకోవడం ఆయనకు బాగా అలవాటు. తెల్లవాళ్ళు తప్పు చేయరనే భ్రమ కల్పించి బహిరంగంగా వాళ్ళను సమర్థిస్తూ అమెరికన్లలో జాతిద్వేషాన్ని, జాత్యహంకారాన్ని విపరీతంగా పెంచేశారు. 


ట్రంప్‌ ఓడిపోతే, సజావుగా పదవీ విరమణ చేస్తారా అన్న సందేహం అందరినీ వేధిస్తోంది. ఆయన ఏదోరకంగా అధ్యక్ష పదవిలోనే ఉండటానికి ప్రయత్నిస్తారని రాజకీయ విశ్లేషకులు భయపడుతున్నారు. అందుకు నిదర్శనాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కరోనా వైరస్‌ భయంతో అమెరికన్లు, తపాలా ద్వారా ఓటు (voting by mail) వేయడానికి సిద్ధపడుతుంటే దానికి అడ్డమైన అడ్డంకులూ కల్పిస్తున్నారు. తపాలాశాఖను ఉద్దేశ్యపూర్వకంగా బలహీనపరచడమే గాక ఆ రకమైన ఓటింగులో మోసం జరుగుతుందంటూ తన అనూయాయులకు నిత్యం నూరిపోస్తున్నారు. కొద్ది ఓట్ల మెజారిటీతో ప్రతిపక్షం నెగ్గే రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించనీయకండా కోర్టు కెక్కి, చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి తనే నెగ్గినట్టు ప్రకటింప చేసుకోవడానికి సర్వవిధాలా ట్రంప్‌ ప్రయత్నిస్తారు.


సాధారణంగా ఓట్ల లెక్కింపు మొత్తం పూర్తికాక ముందే ఓడిపోతున్న అభ్యర్థి పెద్దమనిషి తరహాగా ప్రత్యర్థిని పిలిచి, ‘మీరే నెగ్గారు’ అంటూ అభినందించటం అమెరికన్‌ ఆనవాయితీ. దింపుడుకళ్ళం ఆశతో ఆఖరిక్షణం దాకా వేచి ఉండటం అమెరికన్‌ సంప్రదాయంకాదు. దాన్ని ఈ ఎన్నికలలో మరిచిపోవలసిరావచ్చు.


ప్రతి రాష్ట్రంలోనూ ఎన్నికల ఫలితాలు నిర్వివాదగ్రస్తంగా స్పష్టంగా ఉండాలని అమెరికన్లు కోరుకుంటున్నారు. ఆ కారణంగానే ఇప్పటికే కోటీ 50 లక్షల మంది గంటల తరబడి లైన్లలో నిలబడి ఓట్లు వేసేశారు. అమెరికాలో 20 లక్షల మంది అమెరికన్‌ భారతీయులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. కారణమేమిటో తెలియదుగానీ, వీరిలో నాలుగు లక్షల మంది ట్రంప్‌కు ఓటు వేద్దామనుకునే వాళ్ళున్నారట! ఇది ఆశ్చర్యం కలిగించేదే. అమెరికాకు వలస రావడానికి ఉబలాట పడుతున్న భారతీయులకు, ఇక్కడ వీసాలు రాక త్రిశంకులో కొట్టుమిట్టాడుతున్న భారతీయులకు ట్రంప్‌ ప్రభుత్వం కానీ, ట్రంప్‌ పార్టీ కానీ వీసమెత్తు సహాయం కూడా చేయవని ఘంటాపథంగా చెప్పవచ్చు. అమెరికన్‌ భారతీయులు జోసెఫ్‌ బైడెన్‌, కమలాదేవి హారిస్‌లను గెలిపించటం అమెరికాకే కాదు, భారతావనికి, ప్రపంచానికంతటికీ కూడా మేలు చేస్తుంది. చరిత్ర తరచి చూసినప్పుడు, డెమోక్రాటిక్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అమెరికాకు భారతదేశంతో సంబంధబాంధవ్యాలు సజావుగా ఉన్నాయని చెప్పక తప్పదు. ఆఖరిగా నోంఛాంస్కీ మాటల్ని గుర్తుచేసుకోవాలి. ‘సమకాలీన రిపబ్లికన్ పార్టీ మానవ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన సంస్థ’ అని ఆ ప్రజా మేధావి వ్యాఖ్యానించారు.

వేలూరి వేంకటేశ్వర రావు

(అట్లాంటా, యుఎస్‌ఏ)

Advertisement
Advertisement
Advertisement