అమెరికాతో ఉభయతారక వాణిజ్యం

ABN , First Publish Date - 2020-02-25T07:48:00+05:30 IST

మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా తగ్గిపోతుండగా సేవల రంగం వాటా పెరుగుతున్నది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయరంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి కాకుండా అమెరికా మార్కెట్‌లోకి మన సేవల రంగం ప్రవేశానికి అనుమతిని సాధించేందుకు ప్రాధాన్యమివ్వాలి.

అమెరికాతో ఉభయతారక వాణిజ్యం

మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా తగ్గిపోతుండగా సేవల రంగం వాటా పెరుగుతున్నది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయరంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి కాకుండా అమెరికా మార్కెట్‌లోకి మన సేవల రంగం ప్రవేశానికి అనుమతిని సాధించేందుకు ప్రాధాన్యమివ్వాలి. తనకు రాజకీయ లబ్ధిని సమకూర్చే ఇటువంటి వాణిజ్య ఒప్పందాన్ని ట్రంప్ సంతోషంగా ఒప్పుకుంటారు.


ఒప్పందాలు, సంబంధాలు ఉభయతారకంగా వుండాలి. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో అలాంటి వ్యవహారం సాధ్యమవుతుందా? చికెన్, చీజ్ ఇత్యాది ఉత్పత్తుల దిగుమతులను భారత్ తన మార్కెట్‌లోకి అనుమతించాలని ట్రంప్ కోరుతున్నారు. తద్వారా అమెరికా, భారత్‌ల మధ్య వాణిజ్య లోటును తగ్గించవచ్చని ఆయన భావిస్తున్నారు. అయితే మన దేశం ఇందుకు సిద్ధంగా లేదు. అమెరికా వ్యవసాయోత్పత్తుల దిగుమతులు మన రైతుల ఆదాయాలను దెబ్బ తీస్తాయని న్యూఢిల్లీ కలవరపడుతున్నది. ఈ ప్రతిష్టంభన వల్ల అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుత సందర్శన సందర్భంగా భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం లేదని చెప్పవచ్చు. అయితే విస్తృత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఉభయ దేశాలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తాయి. 


ట్రంప్ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను మనం అర్థం చేసుకోవాలి. అధునాతన సాంకేతికతలే అమెరికన్ ప్రజల ప్రస్తుత భారీ ఆదాయాలకు ప్రాతిపదికలు. అయితే ఆ సాంకేతికతలన్నీ గత కాలానివి మాత్రమే. అణు రియాక్టర్లు, జెట్ విమానాలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ మొదలైన నవీన సాంకేతికతలను అభివృద్ధిపరచడంలో అమెరికా అగ్రగామిగా వున్నది. ఆ సాంకేతికతలను ప్రపంచ దేశాలకు విక్రయించడం ద్వారా అమెరికా అపరిమిత ఆదాయాన్ని ఆర్జిస్తోంది. తమ పౌరులకు భారీ వేతనాలను చెల్లిస్తోంది; నిరుద్యోగ నష్టపరిహారం మొదలైన సంక్షేమ ప్రయోజనాలను సమకూరుస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ఇతోధిక ఆదాయాన్ని సమకూర్చే నవీన సాంకేతికతలేవీ అభివృద్ధి చెందలేదు. తత్ఫలితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నది. అమెరికన్ ప్రజలు పొందుతున్న భారీ వేతన భత్యాలు తగ్గిపోతున్నాయి. అమెరికా ప్రభుత్వ పన్నుల వసూళ్లు పెరగడం లేదు. అయినప్పటికీ తమ పౌరులకు వివిధ సంక్షేమ ప్రయోజనాలను గతంలో మాదిరిగానే సమకూరుస్తున్నారు. దీనికితోడు ప్రపంచంపై ఏకచ్ఛత్రాధిపత్యం వహించాలనే వాషింగ్టన్ పాలకుల ఆరాటం మూలంగా అఫ్ఘాన్, పశ్చిమాసియా దేశాలలో అమెరికా యుద్ధ వ్యయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమెరికా ప్రభుత్వ వ్యయాలు పెరిగిపోతుండగా ఆదాయం తగ్గిపోతున్నది. ఈ కారణంగానే అమెరికా బడ్జెట్ లోటు ఏటా పెరిగిపోతోంది. 


అంతకంతకూ పెరిగిపోతున్న బడ్జెట్ లోటును భర్తీ చేసుకునేందుకు అమెరికా ప్రభుత్వం పెద్ద ఎత్తున అంతర్జాతీయ మార్కెట్ నుంచి రుణాలు తీసుకొంటున్నది. ఇందుకు గాను ట్రెజరీ బిల్స్ లేదా టి-బిల్స్‌గా సుప్రసిద్ధమైన బాండ్‌లను అమెరికా ప్రభుత్వం జారీ చేస్తోంది. ఈ ట్రెజరీ బిల్లులను చైనా, జపాన్ ప్రభుత్వాలు విరివిగా కొంటున్నాయి. దీని వల్ల అమెరికా డాలర్‌కు ప్రపంచ ద్రవ్య విపణిలో డిమాండ్ బాగా పెరిగిపోయింది. టి-బిల్లులు కొనుగోలు చేసేందుకు డాలర్లు అవసరం కదా మరి. డిమాండ్ పెరగడం డాలర్ విలువ పెరుగుదలకు దారితీసింది. చైనా ప్రభుత్వం 100 డాలర్ల విలువైన టి-బిల్స్ కొనుగోలు చేస్తే మార్కెట్లో డాలర్‌కు డిమాండ్ 100 శాతం పెరుగుతున్నది. ఇలా గత రెండు దశాబ్దాలుగా విదేశీ రుణాల ఆలంబనతో డాలర్ విలువను కృత్రిమంగా అధిక స్థాయిలో ఉంచుతున్నారు. అప్పు చెల్లించడానికి తగిన ఆదాయం లేక పోయినప్పటికీ అప్పు తీసుకుని లగ్జరీ కారు కొనుక్కోవడం లాంటిదే ఇది సుమా! 


డాలర్ విలువ పెరుగుదలతో అమెరికాకు దిగుమతులు వెల్లువెత్తగా అమెరికా నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. భారత్‌లో గ్లాడియోలస్ పువ్వు గుత్తి (ఉజ్వల వర్ణాలతో మొనదేలివుండే పువ్వులు) ధర రూ.15. డాలర్ విలువ రూ.75. అయితే అమెరికన్ వినియోగదారు ఒక డాలర్‌కే ఆ పుష్పగుచ్ఛాలు ఐదింటిని కొనుగోలు చేసుకోగలుగుతాడు. మరి డాలర్ విలువ రూ.15 అయితే అమెరికన్ వినియోగదారు ఒక డాలర్‌కు కేవలం ఒక్క గుచ్చాన్ని మాత్రమే కొనుక్కోగలుగుతాడు. అలాగే వాషింగ్టన్ ఆపిల్ పండు ధర అమెరికాలో 1 డాలర్. డాలర్ మారకం రేటు రూ.75 అయితే భారతీయ వినియోగదారు ఒక్క ఆపిల్ పండునే కొనుక్కోగలుగుతాడు. డాలర్ విలువ రూ.15 అయితే అదే వినియోగదారు రూ.75కి ఐదు ఆపిల్ పండ్లను కొనుక్కోగలుగుతాడు. డాలర్ విలువ అధికంగా ఉండడంతో భారతీయ వినియోగదారులు వాషింగ్టన్ ఆపిల్ పండ్లను కొనుగోలు చేయడం లేదు. డాలర్ ధర పెరుగుదల ఇలా అమెరికాకు దిగుమతులు అధికం కావడానికి, అమెరికా నుంచి ఎగుమతులు తగ్గిపోవడానికి కారణమవుతున్నది. వీటి మొత్తం ప్రభావం వల్ల అమెరికా వాణిజ్యలోటు పెరిగిపోతున్నది. ఇదే ట్రంప్‌ను కలవరపరుస్తోంది. ఈ వాణిజ్యలోటును తగ్గించేందుకే చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ఆయన ప్రారంభించారు. భారత్ నుంచి దిగుమతి అవుతున్న ఉక్కుపై సుంకాలను సైతం ఇతోధికంగా పెంచి వేశారు. 


అయితే ఎంపిక చేసిన దేశాల నుంచి ఎంపిక చేసిన సరుకులపై దిగుమతి సుంకాలు భారీగా పెంచినంత మాత్రాన అమెరికా వాణిజ్యలోటు తగ్గబోదు. ఈ విషయాన్ని మరింత నిశితంగా చూద్దాం. ఒక కుటుంబం ఆదాయం తక్కువ మొత్తంలో ఉంటుంది. తమ కనీస అవసరాలను తీర్చుకునేందుకు ఆ కుటుంబం అప్పు చేస్తుంది. వస్త్ర దుకాణదారు చాలా అధిక ధరలకు బట్టలు అమ్ముతున్నాడని గృహిణి వాపోతుంది. అయితే దీనివల్ల కుటుంబ ఆదాయ లోటు తగ్గిపోదు. అప్పు తీసుకున్న సొమ్మును బట్టల కొనుగోలుకు బదులుగా చాకొలెట్లపై వినియోగిస్తారు. వస్త్ర వ్యాపారి బట్టల ధర తగ్గించినప్పటికీ ఆ కుటుంబ ఆదాయలోటు తగ్గదు. ఎందుకంటే అప్పుతీసుకోవడం కొనసాగుతూనే వుంటుంది. అదే విధంగా అమెరికా వాణిజ్య లోటు, భారత్ నుంచి ఉక్కు దిగుమతులు చౌకగా వున్నప్పటికీ, తగ్గబోదు. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం మార్కెట్ నుంచి అప్పులు తీసుకోవడం కొనసాగుతూనే వుంటుంది కనుక. అలా అప్పు తీసుకున్న సొమ్మును ఉక్కుకు బదులు తివాచీల కొనుగోలుకు వినియోగిస్తారు. 


అమెరికా నుంచి భారత్ మరింత ఎక్కువగా దిగుమతులు చేసుకోవాలని అధ్యక్షుడు ట్రంప్ కోరుతున్నారు. అమెరికా నుంచి చికెన్, ప్రాసెస్డ్ చీజ్ దిగుమతులను భారత్ అనుమతించినప్పటికీ అమెరికా వాణిజ్య లోటు తగ్గబోదు. అసలు అధిక వాణిజ్యలోటు సమస్యను గానీ, కృత్రిమంగా పెరిగిన అమెరికన్ల ఆదాయాన్ని తగ్గించడం గానీ ట్రంప్ లక్ష్యం కానే కాదు. ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. చైనా, భారత్‌లతో సానుకూల, లాభదాయక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నానని అమెరికా ప్రజలకు ధ్రువీకరించడం ద్వారా రాజకీయ ప్రయోజనాలను పొందడమే ఆయన అసలు లక్ష్యం. ఈ పరిస్థితులలో మనం మన ఆర్థిక వ్యవస్థకు లాభదాయకంగా ఎలా ముందుకు సాగాలో నిర్ణయించుకోవాలి. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ మార్కెట్లను తెరిపించుకోవడమే ట్రంప్ లక్ష్యం. ఇందుకు ప్రతిగా అమెరికా నుంచి మనం ఏ లబ్ధి పొందాలో నిర్ణయించుకోవలసివున్నది. మన ఉక్కు ఎగుమతులపై సుంకాలు తగ్గించాలని లేదా సాంకేతికతల బదిలీ నిబంధనలను సడలించాలని లేదా అమెరికా ఆర్థిక వ్యవస్థను ఫ్లిప్‌కార్ట్, రూపే లాంటి మన ఈ -వేదికలకు తెరవాలని అడిగి తీరాలి. ఏ ప్రయోజనాలను వదులుకోవాలో, ఏ ప్రయోజనాలను సాధించుకోవాలో మనం స్పష్టంగా నిర్ణయించుకోవాలి. 


మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా తగ్గిపోతున్నది. ప్రపంచ వాణిజ్య అవసరాలకు అనుగుణంగా సేవల రంగం వాటా అంతకంతకూ పెరుగుతున్నది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయరంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి కాకుండా అమెరికా మార్కెట్ లోకి మన సేవల రంగం ప్రవేశానికి అనుమతిని సాధించేందుకు ప్రాధాన్యమివ్వాలి. ఇటువంటి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ట్రంప్ సంతోషంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇటువంటి ఒప్పందం ద్వారా తమ చికెన్, చీజ్ ఉత్పత్తుల ఎగుమతులకు భారత్‌లో అనుకూల విపణి అవకాశాలను సాధించానని అమెరికా ఓటర్లకు ఆయన చెప్పుకుంటారు. ఇక మన దేశం నుంచి సేవల ఎగుమతుల పెరుగుదల పట్ల అమెరికా ప్రజలలో వ్యతిరేకత ఉత్పన్నమవదు. ఎందుకంటే సేవలు అనేవి పరోక్షమైనవి. ప్రత్యక్షంగా కనపడవు. భౌతికమైనవి కావుకదా. అమెరికాతో ఇటువంటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల మన రైతులకు హాని జరుగుతుంది. నిజమే. వారి ప్రయోజనాలు ఎలాగూ దెబ్బతింటాయి. మన వ్యవసాయ రంగానికి జరిగే ఈ నష్టాన్ని మనం భరించితీరాలి. సేవల రంగం ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి, ఆ లక్ష్యసాధనకు అనుగుణంగా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలి. తద్వారా ఆ అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థను మనం జయించాలి.

-(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్డ్ ప్రొఫెసర్‌)



Updated Date - 2020-02-25T07:48:00+05:30 IST