అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. సర్వే ఫలితాల్లో ఏం తేలిందంటే!

ABN , First Publish Date - 2020-09-16T22:08:44+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవి.. చాలా శక్తివంతమైనది. ఆ పదవిలో ఉన్న వారు తమ నిర్ణయాలతో ప్రపంచంలోని కొన్ని దేశాల గతిని మార్చేయ

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. సర్వే ఫలితాల్లో ఏం తేలిందంటే!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి.. చాలా శక్తివంతమైనది. ఆ పదవిలో ఉన్న వారు తమ నిర్ణయాలతో ప్రపంచంలోని కొన్ని దేశాల గతిని మార్చేయగలరు. అంతటి శక్తివంతమైన అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఓ సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు వెలువడ్డాయి. రాబోయే ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారో ఆ ఫలితాలు వివరిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..


 అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోయింది. జాతివివక్షకు సంబంధించిన గొడవలు అమెరికాలోని ఏదో ఒక మూలన నిత్యం జరుగుతున్నాయి. ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్ల ఓట్లు.. అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్దేశించనున్నాయి. దీంతో ఇండియన్ అమెరికన్లను తమవైపునకు తిప్పుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ అమెరికన్ల నాడి తెలుసుకోవడానికి ప్రవాసులకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ, ఏఏపీఐకి చెందిన సంస్థ సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించాయి. ఆ సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించాయి. 


దీని ప్రకారం.. రాబోయే ఎన్నికల్లో 66శాతం మంది ఇండియన్ అమెరికన్లు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు ఓటేయనున్నారు. 28శాతం మంది.. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ వైపు మొగ్గు చూపారు. ఇక మిగిలిన 6 శాతం మంది మాత్రం.. ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ట్రంప్‌తో పోలిస్తే.. 70శాతం ఓట్లతో జో బైడెన్ ఆధిక్యం ఉన్నట్లు సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే సర్వే ఫలితాలపై డెమొక్రటిక్ అభ్యర్థులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. 2016 ఎన్నికల్లో 77 శాతం భారత అమెరికన్లు హిల్లరీ క్లింటన్‌కు మద్దతు తెలిపితే.. మాజీ అధ్యక్షుడు ఒబామా వెనక 84 శాతం మంది ఉన్నారని చెబుతున్నారు. వీరిద్దరితో పోలిస్తే.. జో బైడెన్‌కు ఇండియన్ అమెరికన్ల మద్దతు తగ్గిందని వారు భావిస్తున్నారు. దీంతో మరికొంత మంది ఇండియన్ అమెరికన్లకు చేరువయ్యేందుకు డెమొక్రటిక్ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


Updated Date - 2020-09-16T22:08:44+05:30 IST