విదేశాల్లో చిక్కుకున్న‌ తమ పౌరులను.. స్వ‌దేశానికి త‌ర‌లించే ప‌నిలో యూఎస్ బిజీబిజీ

ABN , First Publish Date - 2020-04-05T16:42:58+05:30 IST

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా భూతం ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది.

విదేశాల్లో చిక్కుకున్న‌ తమ పౌరులను.. స్వ‌దేశానికి త‌ర‌లించే ప‌నిలో యూఎస్ బిజీబిజీ

వాషింగ్ట‌న్‌: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా భూతం ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. ఎక్క‌డో వూహాన్‌లో పుట్టిన ఈ సూక్ష్మ‌జీవి ఇప్ప‌టివ‌ర‌కు 65వేల మంది ప్రాణాలు తీసింది. అగ్ర‌రాజ్య‌లను సైతం క‌కాల‌విక‌లం చేస్తోంది. యూఎస్, యూకే, స్పెయిన్‌, ఇట‌లీ, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, ఇరాన్‌, చైనా త‌దిత‌ర దేశాల్లో కొవిడ్‌-19 ప్ర‌భావం తీవ్రంగా ఉంది. ఇక అమెరికా ఈ వైర‌స్ ధాటికి వ‌ణికిపోతోంది. ఇప్ప‌టికే 3.11 ల‌క్ష‌ల పాజిటివ్ కేసుల‌తో అగ్ర‌రాజ్యం అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. యూఎస్‌లో 8,454 మందిని క‌రోనా పొట్ట‌న‌బెట్టుకుంది. న్యూయార్క్ న‌గ‌రమైతే అస్త‌వ్య‌స్తంగా మారిపోయింది. ఇక్క‌డ 1,14,775 క‌రోనా బాధితులు ఉండగా, 3,565 మంది మరణించారు. 


మొద‌ట క‌రోనాను తేలిక‌గా తీసుకున్న ట్రంప్ ప్ర‌భుత్వం.. ఆ త‌ర్వాత న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు మొద‌లెట్టింది. ప్ర‌జ‌ల‌ను మ‌రో నాలుగు వారాల పాటు ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని పిలుపునిచ్చిన అధ్య‌క్షుడు ట్రంప్‌... సామాజిక దూరం పాటించ‌డం, వ్య‌క్తిగ‌త శుభ్ర‌తల‌తో మాత్ర‌మే ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని నియంత్రించ‌గ‌ల‌మ‌ని పేర్కొన్నారు. న్యూయార్క్‌లో జ‌నాలు ముఖాల‌కు మాస్కులు లేకుండా బ‌య‌ట‌కు రావొద్ద‌నే నిబంధ‌న పెట్టారు. అలాగే అమెరికా విదేశాల్లో చిక్కుకున్న‌ తమ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చే ప‌నుల‌ను ముమ్మ‌రం చేసింది. ఇప్పటివరకు 37 వేలకు పైగా అమెరికన్లను 60 దేశాల నుంచి తరలించింది. వీరి కోసం 400లకుపైగా విమానాలను ఏర్పాటు చేసింది. మరో 20 వేల అమెరికన్లు వివిధ దేశాల్లో ఉన్నారని అమెరికా ప్రకటించింది. ఇందులో ఎక్కువ మంది భారత్‌, దక్షిణాసియా దేశాల్లో ఉన్నారని తెలిపింది. వీరందరి కోసం సుమారు 70 విమానాలను నడపనున్నామని వెల్ల‌డించింది.

Updated Date - 2020-04-05T16:42:58+05:30 IST