‘ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లిపోండి’.. అగ్రరాజ్య పౌరులకు America హెచ్చరిక

ABN , First Publish Date - 2021-08-26T22:21:55+05:30 IST

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని నగరం కాబూల్‌లోని ఎయిర్ పోర్ట్ వద్ద ఉన్న అమెరికన్ ప్రజలకు బైడెన్ సర్కార్ కీలక హెచ్చరికలు జారీ ..

‘ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లిపోండి’.. అగ్రరాజ్య పౌరులకు America హెచ్చరిక

వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని నగరం కాబూల్‌లోని ఎయిర్ పోర్ట్ వద్ద ఉన్న అమెరికన్ ప్రజలకు బైడెన్ సర్కార్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే ఎయిర్‌పోర్ట్ గేట్ల వద్ద నుంచి వెళ్లిపోవాలని సూచించింది. ఎయిర్‌పోర్ట్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో తాలిబన్ల పట్టు పెరుగుతోందని, దీనివల్ల విమానాశ్రయం నుంచి భారీ సంఖ్యలో తరలింపులు జరుగుతోన్న సమయంలో తాలిబన్ల పట్టు పెరగడం సమస్యాత్మకంగా మారిందని అమెరికన్ ప్రభుత్వం ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్ట గేట్ల వద్ద ఉన్న అమెరికన్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అందరూ వెనక్కి వెళ్లిపోవాలని, అధికారికంగా పిలుపు వచ్చే వరకు ఎయిర్‌పోర్ట్‌ను సమీపించవద్దని ఆ రిపోర్ట్‌లో బైడెన్ సర్కార్ హెచ్చరించింది.


‘కాబూల్ ఎయిర్‌పోర్ట్ బయట ప్రజల భద్రతకు ముప్పు నెలకొన్న నేపథ్యంలో అక్కడి అమెరికన్ ప్రజలు ఎయిర్‌పోర్ట్‌కు రావద్దని సూచిస్తున్నాం. అమెరికన్ ప్రభుత్వం నుంచి ఎవరైనా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌కు ఆహ్వానించేవరకు ఎయిర్‌పోర్ట్‌ వైపు రావద్దు’ అని అమెరికన్ ఎంబసీ పేర్కొంది.


ఇక దీనిపై జో బైడెన్ స్వయంగా తన అధికారిక ట్విటర్ ఖాతాలో స్పందించారు. ‘ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ ప్రజలను, మా ఆఫ్ఘన్ మిత్రులను, భాగస్వాములను, అలాగే తమకు సాయం చేసినందుకు తాలిబన్ల టార్గెట్‌గా ఉన్న ఆఫ్ఘన్ దేశ ప్రజలను అక్కడి నుంచి తరలించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. వారిని భద్రంగా తరలించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం’ అని బైడెన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఇదే విషయంపై అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. కాబూల్ విమానాశ్రయాన్ని తెరిచి ఉంచేందుకు ఆ ప్రాంతంలోని దేశాల సహకారంపై చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. విమానాశ్రయం తెరిచిఉంటే అక్కడి విదేశీయులను వారి స్వదేశాలకు తరలించే ప్రక్రియలు కొనసాగించేందుకు వీలుగా ఉంటుందని అన్నారు. ‘కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను తెరిచి ఉంచేందుకు ప్రాంతీయ దేశాలతో ఇప్పటికే చర్చలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే కొనసాగుతున్న అమెరికా మిలటరీ మిషన్ పూర్తయిన తర్వాత కూడా ఎయిర్‌పోర్ట్ తెరిచి ఉంచేందుకు  ఆయా దేశాలు ఏ మేరకు సాయం చేస్తాయో చూడాలి. ఒకవేళ కొద్ది రోజులు ఎయిర్ పోర్ట్ మూతపడినా.. ఆ తర్వాత మళ్లీ తెరిచేందుకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తున్నాం. తాలిబన్లు కూడా పూర్తిస్థాయిలో పనిచేసే ఓ ఎయిర్‌పోర్ట్‌ను కలిగి ఉండాలనే ఆలోచనతోనే ఉంది. అలాగే అమెరికాతో పాటు ఇతర అంతర్జాతీయ దేశాలు కూడా ఇదే కోరుకుంటున్నాయి. దీనిద్వారా ఆగస్టు 31లోపు ఆఫ్ఘన్‌ను వీడాలనుకునే వారందరినీ అక్కడి నుంచి తరలించేందుకు ఆ విమానాశ్రయం ఉపయోగపడుతుంది. అయితే ఆ డెడ్‌లైన్ తర్వాత కూడా మా శక్తిమేరకు విమానాశ్రయం నుంచి తరలింపులు కొనసాగేలా చూస్తాం. అందుకు అనుకూలమైన అనేక మార్గాలను అన్వేషిస్తున్నాం’ అని బ్లింకెన్ పేర్కొన్నారు.


పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 31 తర్వాత కాబూల్ విమానాశ్రయం బాధ్యత అమెరికా తీసుకోబోదని తేల్చి చెప్పారు. ఇప్పటివరకు అమెరికా ఎంబసీ ఎయిర్‌పోర్ట్ నుంచే పనిచేస్తోందని, అయితే డెడ్‌లైన్ తరువాత మాత్రం అక్కడి బాధ్యతల నుంచి తప్పుకుంటామని పేర్కొన్నారు. ఆ తర్వాత తాలబన్లే ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహించుకుంటారని కిర్బీ పేర్కొన్నారు.

Updated Date - 2021-08-26T22:21:55+05:30 IST